Team India: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఫామ్‌పై పెదవి విప్పిన టీమిండియా బ్యాటింగ్ కోచ్ అభిషేక్ నాయర్
IND vs NZ 3rd Test: భారత్ జట్టు 20 ఏళ్ల తర్వాత సొంతగడ్డపై వైట్‌వాష్ ప్రమాదం అంచున ఉంది. వాంఖడే వేదికగా శుక్రవారం నుంచి న్యూజిలాండ్‌తో ఆఖరి టెస్టు మ్యాచ్ జరగనుంది.

భారత్ జట్టు సొంతగడ్డపై వైట్‌వాష్‌ను తప్పించుకోవడానికి తర్జనభర్జనలు పడుతోంది. నవంబరు 1 నుంచి ముంబయిలోని వాంఖడే వేదికగా న్యూజిలాండ్‌తో ఆఖరి టెస్టు మ్యాచ్ జరగనుండగా.. ఈ మ్యాచ్‌లో ఒకవేళ భారత్ జట్టు ఓడిపోతే మూడు టెస్టుల సిరీస్ 0-3తో చేజార్చుకుని వైట్‌వాష్ పరాభావాన్ని చవిచూడనుంది. టీమిండియా చివరిగా 2000లో దక్షిణాఫ్రికా చేతిలో సొంతగడ్డపై వైట్‌వాష్‌ని ఎదుర్కొంది.
బుమ్రాకి రెస్ట్.. కొత్త బౌలర్‌కి పిలుపు
బెంగళూరు వేదికగా జరిగిన తొలి టెస్టులో 8 వికెట్ల తేడాతో, పుణె వేదికగా జరిగిన రెండో టెస్టులో 113 పరుగుల తేడాతో ఓడిపోయిన టీమిండియా ఇప్పటికే 0-2తో వెనకబడి తీవ్ర ఒత్తిడిలో ఉంది. దాంతో మూడో టెస్టుకి జట్టులో ఎలాంటి మార్పులు చేయాలో ఇప్పటికీ ఓ క్లారిటీకి రాలేకపోతోంది. జస్‌ప్రీత్ బుమ్రాకి రెస్ట్ ఇచ్చి కొత్త బౌలర్ హర్షిత్ రాణాని తీసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
బ్యాటింగ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఫామ్ టీమిండియా ఆందోళనని రెట్టింపు చేస్తోంది. ఇప్పటికే ముగిసిన రెండు టెస్టుల్లోనూ ఈ ఇద్దరూ విఫలమయ్యారు. మరీ ముఖ్యంగా విరాట్ కోహ్లీ సింపుల్‌గా ఆడాల్సిన పుల్ టాస్ బాల్‌కి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇద్దరు సీనియర్ ప్లేయర్లు తడబడుతుండటంతో ఆ ప్రభావం టీమిండియా టాప్ ఆర్డర్‌పై కూడా పడుతోంది. ఫామ్ అందుకున్నట్లు కనిపించిన సర్ఫరాజ్ ఖాన్, శుభమన్ గిల్, యశస్వి జైశ్వాల్ కూడా ఒత్తిడికి గురై తక్కువ స్కోరుకే ఔటైపోతున్నారు.
కోహ్లీ, రోహిత్‌ని పొగుడుతారు
వాంఖడే టెస్టు ముంగిట బుధవారం భారత బ్యాటింగ్ కోచ్ అభిషేక్ నాయర్ విలేకరుల సమావేశంలో మాట్లాడాడు. ఈ క్రమంలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఫామ్ గురించి ఎదురైన ప్రశ్నకి అభిషేక్ నాయర్ సమాధానమిచ్చాడు.
‘‘టీమ్‌లోని స్టార్ ప్లేయర్లు ఫామ్ కోల్పోయినప్పుడు వారు లయ అందుకోవడానికి వాళ్లకి కాస్త స్పేస్ ఇవ్వాలి. అలానే వారిపై మనం భరోసా కూడా ఉంచాలి. అది విరాట్ కోహ్లీ అయినా లేదా రోహిత్ శర్మ అయినా లేదా శుభమన్ గిల్ లాంటి యువ ఆటగాడైనా ఇదే పద్ధతిని అనుసరించాలి. నెట్స్‌లో వాళ్లు కష్టపడుతున్నారు. ఒక్కోసారి గొప్ప ఆటగాళ్లు కూడా ఫామ్ కోసం కాస్త ఓపిక పట్టక తప్పదు. ప్రతి ఒక్కరికీ కష్టకాలం రావచ్చు. త్వరలోనే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల ఫామ్ అందుకుంటారు. వాళ్లని మనం పొగడ్తలతో ముంచెత్తుతాం’’ అని అభిషేక్ నాయర్ ధీమా వ్యక్తం చేశాడు.
డబ్ల్యూటీసీ ఫైనల్‌కి చేరాలంటే
భారత్ జట్టు ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి చేరాలంటే ఇక మిగిలిన ఆరు మ్యాచ్‌ల్లో కనీసం నాలుగు మ్యాచ్‌ల్లో గెలవాల్సి ఉంది. న్యూజిలాండ్‌తో వాంఖడే వేదికగా శుక్రవారం ఆఖరి టెస్టు మ్యాచ్.. ఆ తర్వాత నవంబరు 22 నుంచి ఆస్ట్రేలియా గడ్డపై బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టులను టీమిండియా ఆడనుంది.
2012 నుంచి భారత్ గడ్డపై వరుసగా 18 టెస్టు సిరీస్‌లు గెలిచిన టీమిండియా.. 12 ఏళ్ల తర్వాత పర్యాటక జట్టుకి సిరీస్‌ను చేజార్చుకుంది. కనీసం వాంఖడేలో ఆఖరి టెస్టులోనైనా గెలిచి పరువు నిలుపుకోవాలని భారత్ జట్టు ఆశిస్తోంది.