India Test squad: ఆస్ట్రేలియా పర్యటన కోసం భారత్ జట్టు ప్రకటన, టీమ్‌లో వైజాగ్ క్రికెటర్‌కి చోటు
India tour of Australia 2024-25: సిరీస్ ఆరంభ మ్యాచ్‌ల్లో రోహిత్ శర్మ ఆడటంపై సందేహాలు నెలకొనడంతో మూడో ఓపెనర్ జట్టులోకి వచ్చాడు. అలానే గాయం కారణంగా షమీని ఈ టూర్‌కి ఎంపిక చేయలేదు.
ఆస్ట్రేలియా పర్యటన కోసం 18 మందితో కూడిన భారత్ జట్టుని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) శుక్రవారం రాత్రి ప్రకటించింది. ఈ జట్టులో విశాఖపట్నం కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డికి చోటు దక్కింది. ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో ఆల్‌రౌండర్ ప్రదర్శనతో నితీశ్ కుమార్ అదరగొట్టేశాడు. దాంతో లక్కీగా టెస్టు టీమ్ నుంచి కూడా అతనికి పిలుపొచ్చింది.
అక్షర్ ఔట్, సుందర్ ఇన్
ప్రస్తుతం న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్ ఆడుతున్న జట్టులో ఉన్న ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్‌కి ఈ టీమ్‌లో చోటు దక్కలేదు. కుల్దీప్ యాదవ్‌కి గజ్జల్లో గాయమైనట్లు చెప్పుకొచ్చిన బీసీసీఐ.. అక్షర్ పటేల్‌ను తప్పించడానికి మాత్రం సరైన కారణం చెప్పలేదు. అక్షర్ స్థానంలో ప్రస్తుతం పుణె టెస్టులో అదరగొడుతున్న ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌ని ఎంపిక చేసినట్లు బీసీసీఐ తెలిపింది.
ఆస్ట్రేలియా గడ్డపై బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్ జట్టు 5 టెస్టుల సిరీస్‌ను ఆడనుంది.
భారత్, ఆస్ట్రేలియా టెస్టు సిరీస్ షెడ్యూల్
- తొలి టెస్టు మ్యాచ్‌కి నవంబరు 22 నుంచి పెర్త్ ఆతిథ్యం
- రెండో టెస్టు మ్యాచ్ అడిలైడ్‌లో డిసెంబరు 6 నుంచి
- మూడో టెస్టు మ్యాచ్ బ్రిస్బేబ్ వేదికగా డిసెంబరు 14 నుంచి
- నాలుగో టెస్టు మ్యాచ్ మెల్‌బోర్న్ వేదికగా డిసెంబరు 26 నుంచి
- ఆఖరి టెస్టు మ్యాచ్‌కి జనవరి 3 నుంచి సిడ్నీ ఆతిథ్యం
భారత్ టెస్టు జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), జస్‌ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైశ్వాల్, అభిమన్యు ఈశ్వరన్, శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్, ప్రసీద్ కృష్ణ, హర్షిత్ రాణా, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్
ట్రావెలింగ్ రిజర్వ్ ప్లేయర్లు: ముకేష్ కుమార్, నవదీప్ సైనీ, ఖలీల్ అహ్మద్
హార్దిక్ ప్లేస్‌లో తెలుగు క్రికెటర్
ఆస్ట్రేలియా టూర్‌లో పేస్ ఆల్‌రౌండర్ కోటాలో విశాఖపట్నంకి చెందిన నితీశ్ కుమార్ రెడ్డికి అవకాశం దక్కింది. గతంలో హార్దిక్ పాండ్యాకి ఈ అవకాశ దక్కగా.. ప్రస్తుతం అతను వన్డే, టీ20లకే పరిమితం అయిపోయాడు. దాంతో టెస్టుల్లో పేస్ ఆల్‌రౌండర్ కోసం టీమిండియా మేనేజ్‌మెంట్ ఇన్నాళ్లు ఎదురుచూసింది.
బుమ్రాపై భారం
గాయం కారణంగా మహ్మద్ షమీ ఈ జట్టులో లేకపోవడం భారత్ జట్టుకి ఇబ్బందికర పరిస్థితి. ఆస్ట్రేలియా పిచ్‌లపై మంచి అనుభవం ఉన్న షమీ లాంటి పేసర్ లేకపోవడంతో.. జస్‌ప్రీత్ బుమ్రాపై అదనపు భారం పడనుంది.
రోహిత్ శర్మ తొలి టెస్టుకి లేదా రెండో టెస్టుకి అందుబాటులో ఉండనని ఇప్పటికే బీసీసీఐకి సమాచారం అందించాడు. దాంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈశ్వరన్ అభిమన్యుని జట్టులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. రోహిత్ శర్మ మ్యాచ్‌లో ఆడకపోతే టీమ్ వైస్ కెప్టెన్‌గా ఉన్న ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా జట్టుని కెప్టెన్‌గా నడిపిస్తాడు.