Rishabh Pant Records: వాంఖడే టెస్టులో రిషబ్ పంత్ రికార్డుల మోత, న్యూజిలాండ్‌పై ఏ భారత క్రికెటర్‌కీ సాధ్యంకాని ఘనత
IND vs NZ 3rd Test Live Updates: భారత్ జట్టులో రిషబ్ పంత్ ట్రబుల్ షూటర్ పాత్రని పోషిస్తున్నాడు. వాంఖడే టెస్టులో టీమ్ అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్ దూకుడుతో జట్టు పరువు నిలిపాడు.
న్యూజిలాండ్‌తో ముంబయి వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో భారత స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ రికార్డుల మోత మోగించాడు. మ్యాచ్‌లో రెండో రోజైన శనివారం ఓవర్ నైట్ స్కోరు ఒక్క పరుగుతో బ్యాటింగ్ కొనసాగించిన రిషబ్ పంత్ 59 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 60 పరుగులు చేశాడు. అతనితో పాటు శుభమన్ గిల్ కూడా 90 పరుగులు చేయడంతో భారత్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగులు చేసింది. అంతక ముందు న్యూజిలాండ్ టీమ్ తొలి ఇన్నింగ్స్‌లో 235 పరుగులకే ఆలౌటై ఉండటంతో.. భారత్ జట్టుకి 28 పరుగుల ఆధిక్యం లభించింది.
36 బంతుల్లోనే విధ్వంసం
ఈరోజు మ్యాచ్‌లో కేవలం 36 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదిన రిషబ్ పంత్.. న్యూజిలాండ్ జట్టుపై టెస్టుల్లో అత్యంత వేగంగా 50 పరుగుల మార్క్‌ని అందుకున్న భారత క్రికెటర్‌గా రికార్డ్ నెలకొల్పాడు. ఇన్నేళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో కివీస్‌పై ఇంత వేగంగా ఎవరూ హాఫ్ సెంచరీ నమోదు చేయలేదు.
వాస్తవానికి రిషబ్ పంత్ క్రీజులోకి వచ్చే సమయానికి భారత్ జట్టు 84/4తో పీకల్లోతు కష్టాల్లో ఉంది. అప్పటికే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, యశస్వి జైశ్వాల్ ఔటైపోయారు. కానీ.. ఈ దశలో శుభమన్ గిల్‌తో కలిసి ఐదో వికెట్‌కి 96 పరుగుల్ని జోడించిన రిషబ్ పంత్ హాఫ్ సెంచరీ తర్వాత ఇష్ సోధి బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా ఔటపోయాడు. టెస్టు కెరీర్‌లో పంత్‌కి ఇది 13వ హాఫ్ సెంచరీ.
ముగ్గురి రికార్డ్ బ్రేక్
న్యూజిలాండ్‌పై ఇప్పటి వరకు టెస్టుల్లో వేగంగా హాఫ్ సెంచరీ నమోదు చేసిన భారత్ ఆటగాళ్ల జాబితాని ఓసారి పరిశీలిస్తే.. యశస్వి జైశ్వాల్ 41 బంతుల్లో 50 పరుగులు చేయగా.. ఆ తర్వాత హర్భజన్ సింగ్ 42, సర్ఫరాజ్ ఖాన్ 42 బంతులతో ఉన్నారు. కానీ.. రిషబ్ పంత్ ఈరోజు ఈ ముగ్గురి రికార్డ్‌ను బ్రేక్ చేసేశాడు.
నిజానికి టెస్టు క్రికెట్‌లో భారత్ తరఫున అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ సాధించిన రికార్డు కూడా రిషబ్ పంత్ పేరిటే ఉంది. 2022లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో కేవలం 28 బంతుల్లోనే రిషబ్ పంత్ హాఫ్ సెంచరీ నమోదు చేసిన విషయం తెలిసిందే.
ఇన్నింగ్స్‌ల కంటే సిక్సర్లే ఎక్కువ
రిషబ్ పంత్ ఈరోజు మరో అరుదైన రికార్డ్‌ను కూడా సొంతం చేసుకున్నాడు. అది ఏంటంటే? టెస్టు క్రికెట్‌లో ఆడిన ఇన్నింగ్స్‌ల కంటే ఎక్కువ సిక్సర్లు బాదిన ఏకైక బ్యాటర్‌గా రిషబ్ పంత్ నిలిచాడు. ఈరోజు రిషబ్ పంత్ 2 సిక్సర్లు కొట్టగా.. టెస్టుల్లో అతని సిక్సర్ల సంఖ్య 66కి చేరింది.
ఇప్పటి వరకు 38 టెస్టులు ఆడిన రిషబ్ పంత్ కేవలం 65 ఇన్నింగ్స్‌ల్లో మాత్రమే బ్యాటింగ్ చేశాడు. దాంతో ఇన్నింగ్స్‌ల కంటే ఒక సిక్సర్ ఎక్కువగా అతను నమోదు చేశాడు. టెస్టు క్రికెట్‌లో ఇలా ఇన్నింగ్స్ కంటే ఎక్కువ సిక్సర్లు బాదిన తొలి క్రికెటర్‌గా పంత్ నిలిచాడు.