Team India: టెస్టు క్రికెట్‌లో అరుదైన రికార్డ్‌కి అడుగు దూరంలో టీమిండియా-team india set to register never seen before record in test cricket as they host bangladesh ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Team India: టెస్టు క్రికెట్‌లో అరుదైన రికార్డ్‌కి అడుగు దూరంలో టీమిండియా

Team India: టెస్టు క్రికెట్‌లో అరుదైన రికార్డ్‌కి అడుగు దూరంలో టీమిండియా

Galeti Rajendra HT Telugu
Sep 13, 2024 04:18 PM IST

India Test cricket Records: టెస్టుల్లో దశాబ్దాలుగా భారత్ జట్టుకి అందని ద్రాక్షగా ఉన్న రికార్డ్‌కి అడుగు దూరంలో రోహిత్ శర్మ సేన ఉంది. ఇప్పటి వరకు 579 టెస్టులాడిన భారత్.. 178 మ్యాచ్‌ల్లో గెలిచి, 178 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. మిగిలిన మ్యాచ్‌ల్లో ఒక్కటి మినహా అన్నీ డ్రాగా ముగిశాయి.

భారత టెస్టు జట్టు
భారత టెస్టు జట్టు

IND vs BAN Test series: టెస్టు క్రికెట్‌లో అరుదైన రికార్డ్‌కి భారత్ జట్టు ఒక్క అడుగు దూరంలో ఉంది. బంగ్లాదేశ్‌తో సెప్టెంబర్ 19 నుంచి భారత్, బంగ్లాదేశ్ మధ్య రెండు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. తొలి టెస్టుకి చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుండగా.. రెండో టెస్టు మ్యాచ్ కాన్పూర్‌లో జరగనుంది.

తొలి టెస్టు కోసం చెన్నై చేరుకున్న భారత టెస్టు జట్టు ప్రాక్టీస్ కూడా ప్రారంభించింది. బంగ్లాదేశ్‌తో జరిగే తొలి టెస్టులో రోహిత్ శర్మ కెప్టెన్సీలోని టీమిండియా విజయం సాధిస్తే.. దశాబ్దాలుగా అందని ద్రాక్షలా ఉన్న రికార్డులో చోటు దక్కనుంది.

ఒక్క టెస్టు గెలిస్తే.. అరుదైన రికార్డ్‌లో చోటు

సుదీర్ఘ ఫార్మాట్‌ (టెస్టు క్రికెట్)‌లో ఇప్పటివరకు 579 మ్యాచ్‌లను భారత్ జట్టు ఆడింది. ఇందులో 178 మ్యాచ్‌ల్లో గెలిచిన భారత్ జట్టు.. సరిగ్గా 178 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఇక మిగిలిన 223లో 222 మ్యాచ్‌లు డ్రాగా ముగియగా ఒక మ్యాచ్‌ టైగా ముగిసింది. దాంతో చెన్నై వేదికగా ఈ నెల 19 నుంచి జరిగే తొలి టెస్టులో బంగ్లాదేశ్‌ను టీమిండియా ఓడించగలిగితే.. టెస్టు క్రికెట్‌లో ఓటములు కంటే విజయాలు ఎక్కువగా ఉన్న నాలుగో టీమ్‌గా రికార్డుల్లో నిలవనుంది. ఇప్పటి వరకు ఈ రికార్డ్‌‌ని భారత్ అందుకోలేదు.

టెస్టు క్రికెట్ చరిత్రలో ప్రస్తుతం నాలుగు జట్ల ఖాతాలో మాత్రమే ఓటముల కంటే విజయాల్ని సంఖ్య ఎక్కువగా ఉంది. ఆస్ట్రేలియా టీమ్ ఇప్పటి వరకు 866 టెస్టులు ఆడగా, ఇందులో 414 విజయాలు, 232 ఓటములు ఉన్నాయి. ఇంగ్లాండ్ టీమ్ 1077 టెస్టులు ఆడగా.. 397 మ్యాచ్‌ల్లో గెలిచి, 325 టెస్టుల్లో ఓడింది.

దక్షిణాఫ్రికా 466 టెస్టులు ఆడగా.. 179 విజయాలు సాధించగా, 161 ఓటములతో రికార్డ్‌లో మూడో స్థానంలో ఉంది. ఇక భారత చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ 458 టెస్టులు ఆడి.. 148 మ్యాచ్‌ల్లో గెలిచి, 144 మ్యాచ్‌ల్లో ఓడింది. ఒకవేళ భారత్ జట్టు చెన్నై టెస్టులో గెలిస్తే ఈ జాబితాలో చేరిన ఐదో జట్టుగా నిలుస్తుంది.

తొలి టెస్టుకి బీసీసీఐ ప్రకటించిన భారత టెస్టు జట్టు

రోహిత్ శర్మ (కెప్టెన్‌), గిల్, జైస్వాల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ (వికెట్‌ కీపర్‌), సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్ (వికెట్‌కీపర్‌), రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్, జస్‌ప్రీత్ బుమ్రా, యశ్ దయాళ్