Ganguly on Pakistan Cricket: పాకిస్థాన్ క్రికెట్ పతనంపై స్పందించిన సౌరవ్ గంగూలీ.. సమస్య ఏంటో చెప్పిన దాదా
Sourav Ganguly on Pakistan Cricket: పాకిస్థాన్ క్రికెట్ జట్టు పేలవమైన ఆటతో నిరాశపరుస్తోంది. మూడేళ్లుగా ఆ టీమ్ పతనమవుతోంది. ఈ విషయంపై భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ స్పందించారు. సమస్య ఎక్కడొచ్చిందో చెప్పారు.
గత తరంలో బలమైన క్రికెట్ జట్టుగా పేరు తెచ్చుకున్న పాకిస్థాన్.. ప్రస్తుతం పతనావస్థలోకి జారిపోతోంది. మూడు ఫార్మాట్లలో ఆ జట్టు విఫలమవుతూ వరుసగా పరాజయాలను ఎదుర్కొంటోంది. కెప్టెన్‍లు, సెలెక్టర్ల మార్పులు, ఆటగాళ్ల మధ్య విభేదాలు, క్రికెట్ బోర్డులో లుకలుకలతో ఈ జట్టులో సంక్షోభం మరింత పెరిగింది. ఐసీసీ టోర్నీల్లో వరుసగా విఫలమైంది. ఇటీవలే బంగ్లాదేశ్ చేతిలో సొంతగడ్డపై టెస్టు సిరీస్‍లో పాకిస్థాన్ క్లీన్ స్వీప్‍కు గురైంది. ఘోరమైన పరాభవాన్ని ఎదుర్కొంది.
గతేడాది వన్డే ప్రపంచకప్‍లో గ్రూప్ దశలో బాబర్ ఆజం సారథ్యంలోని పాకిస్థాన్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. అఫ్గానిస్థాన్ చేతిలో పరాజయం పాలైంది. పరిమిత ఓవర్ల క్రికెట్ కెప్టెన్సీ నుంచి బాబర్ ఆజమ్‍ను తప్పించిన పాకిస్థాన్ బోర్డు.. కొంతకాలానికి మళ్లీ అతడినే తెచ్చింది. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‍లో టెస్టు హోదా కూడా లేదని అమెరికా చేతిలో పాక్ దారుణమైన ఓటమిని ఎదుర్కొంది. గ్రూప్ దశలోని నిష్రమించి నిరాశపరిచింది. స్వదేశం, విదేశాల్లో చాలా సిరీస్‍ల్లో పేలవంగా ఆడింది. దీంతో పాకిస్థాన్ జట్టుపై మాజీలు మండిపడుతున్నారు.
ఈ తరుణంలో పాకిస్థాన్ క్రికెట్ పతనం అవుతుండటంపై భారత మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పందించారు. ఆ దేశంలో టాలెంట్ తీవ్రంగా కొరవడడమే సమస్య అని చెప్పారు దాదా.
ఈ తరంలో విఫలం
పాకిస్థాన్ క్రికెట్ అంటే మనకు ఇప్పటికీ మియాందాద్ కాలం నాటి ఆటగాళ్లే గుర్తొస్తారని సౌరవ్ గంగూలీ చెప్పారు. ఈ తరం పాకిస్థాన్ జట్టు గెలిచేందుకు తంటాలు పడుతోందని చెప్పారు. “ఆ దేశంలో తీవ్రమైన టాలెంట్ లోటు ఉందని నాకు అర్థమైంది. పాకిస్థాన్ గురించి మనం ఆలోచించినప్పుడల్లా మనకు మిదాంద్, వాసిం అక్రమ్, సయీద్ అన్వర్, మహమ్మద్ యూసుఫ్, యునీస్ ఖాన్ లాంటి వాళ్లే గుర్తొస్తారు. అయితే, ఆధునిక తరంలో మాత్రం ఆ జట్టు గెలువలేకుంది” అని పీటీఐతో గంగూలీ చెప్పారు.
పాకిస్థాన్ వరుసగా విఫలమయ్యేందుకు కారణంగా సరైన టాలెంట్ లేకపోవడమే కారణమని తెలిపారు. “ప్రతీ తరం కూడా గెలిచేందుకు ఆటగాళ్లు తయారై ఉండాలి. ఇప్పుడు ప్రపంచ క్రికెట్‍లో పాకిస్థాన్‍ను చూస్తే వెస్టిండీస్‍లో వరల్డ్ కప్ ఓడింది, ఇండియాలో జరిగిన ప్రపంచకప్‍లో వైఫలమైంది, ఇప్పుడు బంగ్లాదేశ్‍తో సిరీస్ పోయింది. ఆ దేశంలో టాలెంట్ లోటు చాలా తీవ్రంగా ఉంది” అని గంగూలీ అన్నారు.
అలా చేయాల్సిందే
పాకిస్థాన్ క్రికెట్ పూర్తిగా పతనమవకుండా ఉండాలంటే ఆ దేశ బోర్డు ఏం చేయాలో కూడా గంగూలీ చెప్పారు. సరైన నాణ్యత గల ప్లేయర్లను గుర్తించి.. జట్టుకు ఎంపిక చేయాలని సూచించారు. “పాకిస్థాన్‍లో క్రికెట్‍కు సంబంధించిన వారు ఈ విషయంపై ఆలోచించాలి. నేను అగౌరవంగా ఇది చెప్పడం లేదు. ఒకప్పుడు పాకిస్థాన్ జట్టులో గొప్ప ప్లేయర్లు ఉండేవారు. ఇప్పుడు జట్టులో ఎలాంటి వారెవరూ నాకు కనిపించడం లేదు” అని గంగూలీ చెప్పారు.
పాకిస్థాన్ ఇటీవలే స్వదేశంలో బంగ్లాదేశ్ చేతిలో టెస్టు సిరీస్ కోల్పోయింది. 0-2తో ఓడి వైట్‍వాష్‍తో అవమానానికి గురైంది. పాక్‍పై బంగ్లాదేశ్‍కు ఇదే తొలి టెస్టు సిరీస్ గెలుపు.