PAK vs BAN: బంగ్లాదేశ్ చేతిలో పాకిస్థాన్‍కు ఘోర పరాభవం.. సిరీస్ క్లీన్‍స్వీప్.. హిస్టరీ క్రియేట్ చేసిన బంగ్లా
PAK vs BAN Test Series: పాకిస్థాన్ జట్టుకు ఘోరమైన అవమానం ఎదురైంది. సొంతగడ్డపై బంగ్లాదేశ్ చేతిలో క్వీన్‍స్వీప్‍కు ఆ జట్టు గురైంది. పేలవ ప్రదర్శనతో పరాభవాన్ని పాక్ మూటగట్టుకుంది. సిరీస్ సొంతం చేసుకొని బంగ్లా ఓ హిస్టరీ క్రియేట్ చేసింది.
PAK vs BAN Test Series: పాకిస్థాన్ జట్టుకు పరాభవాల పరంపర కొనసాగింది. సొంతగడ్డపై బంగ్లాదేశ్ చేతిలో పాక్‍కు ఘోర అవమానం ఎదురైంది. అన్ని విభాగాల్లో పేలవమైన ప్రదర్శన చేసిన ఆ జట్టు చతికిలపడింది. టెస్టు సిరీస్‍లో పాకిస్థాన్‍ను బంగ్లాదేశ్ క్లీన్‍స్వీప్ చేసేసింది. అద్భుతమైన ఆటతో బంగ్లా చరిత్ర సృష్టించింది. దీంతో 2-0తో టెస్టు సిరీస్ కైవసం చేసుకుంది. రావల్పిండి వేదికగా జరిగిన రెండో టెస్టులో 6 వికెట్ల తేడాతో నేడు (సెప్టెంబర్ 3) పాకిస్థాన్‍పై బంగ్లాదేశ్ విజయం సాధించింది.
అలవోకగా..
రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్‍కు 185 పరుగుల స్వల్ప టార్గెట్‍ను పాకిస్థాన్ నిర్దేశించింది. మ్యాచ్ ఐదో రోజైన నేడు ఆ లక్ష్యాన్ని బంగ్లా సునాయాసంగానే ఛేదించింది. వికెట్ నష్టపోకుండా 42 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో నేడు బ్యాటింగ్ కొనసాగించింది బంగ్లా.
బంగ్లాదేశ్ ఓపెనర్ జకీర్ హసన్ (40) రాణించాడు. నిలకడగా ఆడి జట్టును పటిష్టంగా నడిపించాడు. మరో ఓపెనర్ షద్మాన్ ఇస్లాం (24) అతడికి సహకరించాడు. వారిద్దరూ ఔటయ్యాక కెప్టెన్ నజ్ముల్ హుసేన్ శాంతో (38) నిలకడగా ఆడాడు. మోమినుల్ హక్ (34) కూడా రాణించాడు. వీరిద్దరూ జట్టును లక్ష్యానికి చేరువచేశారు.
నజమ్ముల్, మోమినుల్ తర్వాత సీనియర్ ప్లేయర్లు ముష్ఫికర్ రహీం (22 నాటౌట్), షకీబల్ హసన్ (21 నాటౌట్) నెమ్మదిగా ఆడుతూ పరుగులు రాబట్టారు. మరో వికెట్ కోల్పోకుండా జాగ్రత్త పడ్డారు. అలవోకగా జట్టును గెలుపు తీరం దాటించారు. 6 వికెట్ల తేడాతో బంగ్లా విజయం సాధించింది. ఈ చరిత్రాక్మత గెలుపు తర్వాత బంగ్లాదేశ్ ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు. రెండో ఇన్నింగ్స్‌లో పాక్ బౌలర్లలో మీర్ హమ్జా, ఖురమ్ షహజాద్, అబ్రార్ అహ్మద్, సల్మాన్ అఘ చెరో వికెట్ తీసుకున్నారు.
మ్యాచ్ సాగిందిలా..
ఈ రెండో టెస్టులో తొలి రోజు వర్షం వల్ల రద్దయింది. ఫస్ట్ డే ఒక్క బంతి కూడా పడలేదు. ఆ తర్వాత టాస్ గెలిచిన బంగ్లాదేశ్ ఫీల్డింగ్ ఎంపిక చేసుకుంది. దీంతో రెండో రోజు పాకిస్థాన్ బ్యాటింగ్‍కు దిగింది. కెప్టెన్ షాన్ మసూద్ (57), సైమ్ అయూబ్ (58), సల్మాన్ అఘ (54) అర్ధ శతకాలతో రాణించటంతో 274 పరుగులు చేయగలిగింది పాకిస్థాన్.
తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 262 పరుగులు చేసింది. లిటన్ దాస్ (138) సెంచరీతో దుమ్మురేపగా.. మెహదీ హసన్ మిరాజ్ (78) అదగొట్టాడు. అయితే, మిగిలిన బ్యాటర్లు విఫలమవటంతో పాక్‍కు స్పల్ప ఆధిక్యం దక్కింది. రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ బౌలర్ల విజృంభణతో పాకిస్థాన్ 172 పరుగులకే నాలుగో రోజు ఆలౌటైపోయింది. ముందున్న 185 పరుగుల లక్ష్యాన్ని నేడు ఐదో రోజు అలవోకగా ఛేదించింది బంగ్లాదేశ్.
చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్
ఈ సిరీస్ కైవసం చేసుకొని బంగ్లాదేశ్ చరిత్ర సృష్టించింది. పాకిస్థాన్‍పై తొలిసారి టెస్టు సిరీస్ గెలిచి ఆ జట్టు హిస్టరీ క్రియేట్ చేసింది. పాక్ గడ్డపై బంగ్లా గర్జించింది. రావల్పిండిలోనే జరిగిన తొలి టెస్టులో 10 వికెట్ల తేడాతో గెలిచి బంగ్లా అదరగొట్టింది. రెండో టెస్టులోనూ గెలిచి 2-0తో సిరీస్‍లో పాకిస్థాన్‍ను వైట్‍వాష్ చేసింది.
గత 1303 రోజుల్లో సొంతగడ్డపై పాకిస్థాన్ ఒక్క టెస్టు మ్యాచ్ కూడా గెలువలేకపోయింది. ఐసీసీ టోర్నీల్లోనూ ఆ జట్టుకు పరాభవాలే ఎదురవుతున్నాయి. ఇప్పుడు బంగ్లాదేశ్ చేతిలో ఘోర అవమానాన్ని మూటగట్టుకుంది పాక్.