Sourav Ganguly: ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‍లో ఆ మార్పు తేవాలి: సౌరవ్ గంగూలీ
Sourav Ganguly: ఐపీఎల్‍లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ విషయంపై జోరుగా చర్చ సాగింది. అయితే, ఇంపాక్ట్ ప్లేయర్ విషయంలో ఓ మార్పు తీసుకురావాలని సౌరవ్ గంగూలీ సూచించారు.
Sourav Ganguly: ఐపీఎల్‍లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ కొనసాగించాలా వద్దా అనే విషయంపై చర్చలు సాగుతూనే ఉన్నాయి. ఈ ఏడాది ఐపీఎల్ 2024 సీజన్‍లో ఎనిమిదిసార్లు 250పైగా స్కోర్లు నమోదవడం, ఆల్‍రౌండర్లకు ప్రాధాన్యత తగ్గుతుందనే వాదనలతో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ విషయంలో భిన్నాభిప్రాయాలు వచ్చాయి. ఐపీఎల్‍లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ఉండకూడదని స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కూడా అభిప్రాయపడ్డారు. అయితే, టీమిండియా మాజీ కెప్టెన్, ఐపీఎల్‍లో ఢిల్లీ క్యాపిటల్స్ డైరెక్టర్ సౌరవ్ గంగూలీ ఇప్పుడు ఇంపాక్ట్ ప్లేయర్ అంశంపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ఉండాలంటూనే ఓ మార్పును సూచించారు.
టాస్‍కు ముందే..
ఐపీఎల్‍లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ఉండాలని బీసీసీఐ మాజీ బాస్ సౌరవ్ గంగూలీ అభిప్రాయపడ్డారు. అయితే, టాస్‍కు ముందే ఇంపాక్ట్ ప్లేయర్ ఎవరో జట్టు కెప్టెన్లు చెప్పేలా మార్పు తీసుకురాలని ఓ ప్రెస్‍మీట్‍లో దాదా సూచించారు. “ఐపీఎల్ గొప్ప టోర్నమెంట్. టాస్‍కు ముందే ఇంపాక్ట్ ప్లేయర్‌ను నిర్ణయించడం చేయవచ్చు. ఇలా టాస్‍కు ముందే ఇంపాక్ట్ ప్లేయర్‌ను రివీల్ చేస్తే.. చాలా స్కిల్, గేమ్ ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే, నేను ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‍కు మద్దతునే తెలుపుతున్నా” అని గంగూలీ చెప్పారు.
బౌండరీలు ఎక్కువ దూరం
ఐపీఎల్ మ్యాచ్‍లు జరిగే మైదానాల్లో బౌండరీలు ఇంకాస్త ఎక్కువ దూరం ఉండాలని సౌరవ్ గంగూలీ అభిప్రాయపడ్డారు. “నాకు ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ అంటే ఇష్టం. అయితే, గ్రౌండ్స్ పెద్దగా ఉండడమే నాకు కావాలి. బౌండరీలు మరింత ఎక్కువ దూరం ఉండాలి” అని దాదా అన్నారు.
ఢిల్లీ క్యాపిటల్స్ యంగ్ స్టార్ పృథ్వి షా ఈ ఏడాది ఐపీఎల్‍లోనూ విఫలమవడంపై గంగూలీ స్పందించారు. ఇంకా అతడు యువకుడేనని, బాగా ఆడతాడనే నమ్మకం ఉందని చెప్పారు. “పృథ్వి షా ఇంకా పిల్లోడే. అతడికి 23 ఏళ్లే. టీ20 క్రికెట్ ఎలా ఆడాలో అతడు ఇంకా నేర్చుకుంటున్నాడు. అతడికి అద్భుతమైన టాలెంట్ ఉంది.. తప్పకుండా మెరుగవుతాడు. కొన్నిసార్లు మనం కొందరి నుంచి చాలా త్వరగా ఆశిస్తాం. అతడికి ఉన్న నైపణ్యంతో పథ్వి కచ్చితంగా బాగా ఆడతాడని నేను నమ్ముతున్నా” అని గంగూలీ చెప్పారు.
2022లో రోడ్డు ప్రమాదం జరగకముందులా ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ ఆడుతున్నాడని గంగూలీ చెప్పారు. పంత్ కమ్‍బ్యాక్ చేయడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని, అతడో స్పెషల్ ప్లేయర్ అని దాదా అన్నారు. 2022 డిసెంబర్లో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పంత్.. ఈ ఏడాది ఐపీఎల్‍తోనే మళ్లీ మైదానంలోకి దిగాడు. టీ20 ప్రపంచకప్ టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు.
ఈ ఏడాది ఐపీఎల్ 2024 సీజన్‍లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు లీగ్ దశలోనే నిష్క్రమించింది. 14 మ్యాచ్‍ల్లో ఏడు గెలిచి, ఏడు ఓడింది. ఆరంభంలో ఐదు మ్యాచ్‍ల్లో నాలుగు ఓడినా.. ఆ తర్వాత ఢిల్లీ అద్భుతంగా పుంజుకుంది. కానీ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించలేకపోయింది. అయితే, 15 నెలల తర్వాత కమ్‍బ్యాక్ ఇచ్చిన రిషబ్ పంత్ బ్యాటింగ్‍లో దుమ్మురేపాడు.