Rohit Sharma: భారత కెప్టెన్ రోహిత్ శర్మను హెచ్చరించిన మాజీ క్రికెటర్లు.. తేలికగా తీసుకుంటే మూల్యం తప్పదు-team india skipper rohit sharma gets warning bell from former cricketers ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Rohit Sharma: భారత కెప్టెన్ రోహిత్ శర్మను హెచ్చరించిన మాజీ క్రికెటర్లు.. తేలికగా తీసుకుంటే మూల్యం తప్పదు

Rohit Sharma: భారత కెప్టెన్ రోహిత్ శర్మను హెచ్చరించిన మాజీ క్రికెటర్లు.. తేలికగా తీసుకుంటే మూల్యం తప్పదు

Galeti Rajendra HT Telugu
Aug 30, 2024 05:27 PM IST

India vs Bangladesh Test 2024: పాకిస్థాన్ జట్టుని రావల్పిండిలో ఓడించిన బంగ్లాదేశ్ టీమ్ రెండు టెస్టుల సిరీస్ కోసం సెప్టెంబరులో భారత్‌కి రాబోతోంది. ఈ టెస్టులకి చెన్నై, కాన్పూర్ ఆతిథ్యం ఇవ్వబోతోంది.

రోహిత్ శర్మ
రోహిత్ శర్మ (BCCI-X)

బంగ్లాదేశ్‌తో రెండు టెస్టుల సిరీస్‌‌కి ముందు భారత కెప్టెన్ రోహిత్ శర్మకి మాజీ క్రికెటర్లు హర్భజన్ సింగ్, సురేశ్ రైనా నుంచి ఒక హెచ్చరిక వచ్చింది. సెప్టెంబరు 19 నుంచి భారత్, బంగ్లాదేశ్ మధ్య రెండు టెస్టు సిరీస్ ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ టీమ్‌ను తక్కువ అంచనా వేయొద్దని మాజీ క్రికెటర్లు రోహిత్ శర్మకి సూచించారు.

పాకిస్థాన్‌తో ఇటీవల ముగిసిన తొలి టెస్టులో 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన బంగ్లాదేశ్ ఇప్పుడు పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంది. మ్యాచ్‌లో ముష్ఫికర్ రహీమ్ 191 పరుగులతో హీరోగా నిలిచాడు. పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో 448 పరుగులు చేసినప్పటికీ బంగ్లాదేశ్‌ను మ్యాచ్‌లో నిలువరించలేకపోయింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లోనూ పాకిస్థాన్‌కి గట్టి పోటీనిచ్చిన బంగ్లాదేశ్ ఎట్టకేలకి పాక్ గడ్డపై తొలి విజయాన్ని నమోదు చేసింది.

బీసీసీఐ చొరవ మంచిదే

భారత్, బంగ్లాదేశ్ టెస్టు సిరీస్‌ గురించి మాజీ క్రికెటర్ సురేశ్ రైనా మాట్లాడుతూ ‘‘టెస్టు సిరీస్‌కి ముందు భారత ఆటగాళ్లు దులీప్ ట్రోఫీలో ఆడాలని బీసీసీఐ చెప్పడం చాలా మంచి విషయం. రెడ్ బాల్ క్రికెట్ ఆడుతున్నప్పుడే ఆటగాళ్లకి చాలా విషయాలు తెలుస్తాయి. బంగ్లాదేశ్‌ టీమ్‌లో నాణ్యమైన స్పిన్నర్లు ఉన్నారు. సుదీర్ఘకాలంగా నిలకడగా రాణిస్తున్న బ్యాటర్లు ఆ టీమ్‌లో ఉన్నారు. కాబట్టి ఆస్ట్రేలియాతో సిరీస్‌కి ముందు భారత్ జట్టుకి ఇది మంచి ప్రాక్టీస్ మ్యాచ్ అవుతుంది’’ అని అభిప్రాయపడ్డాడు

బంగ్లాని తేలికగా తీసుకోవద్దు

‘‘భారత క్రికెట్ జట్టు ఇప్పుడు చాలా బలంగా ఉంది. మరోవైపు బంగ్లాదేశ్ లో కూడా పాకిస్థాన్‌పై గెలిచి పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంది. కాబట్టి బంగ్లా టీమ్‌ని టీమిండియా తేలికగా తీసుకోకూడదు. కొన్నిసార్లు చిన్న జట్లు కూడా మ్యాచ్‌ల్లో బాగా రాణిస్తాయి’’ అని హర్భజన్ సింగ్ చెప్పుకొచ్చాడు.

భారత్, బంగ్లాదేశ్ మధ్య రెండు టెస్టులు చెన్నై, కాన్పూర్ వేదికగా జరగనున్నాయి. ఈ రెండు పిచ్ సాధారణంగా స్పిన్నర్లకు అనుకూలిస్తుంటాయి. ఇవే తరహా పిచ్‌లు బంగ్లాదేశ్‌లో కూడా ఎక్కువ. కాబట్టి ఆ జట్టు నుంచి సిరీస్‌లో టీమిండియాకి సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది. బంగ్లాదేశ్‌ టీమ్‌లోని చాలా మంది ఆటగాళ్లు ఐపీఎల్‌లో ఆడటం ద్వారా భారత్ పిచ్‌లపై అవగాహన ఉంది.

ఆస్ట్రేలియా టూర్‌కి ముందు సన్నాహం

బంగ్లాదేశ్‌తో సిరీస్ తర్వాత అక్టోబర్ 16 నుంచి నవంబర్ 5 వరకు న్యూజిలాండ్‌తో మూడు టెస్టుల సిరీస్‌ను భారత్ జట్టు ఆడనుంది. ఆ తర్వాత ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియాకి వెళ్లి అక్కడ బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టులను టీమిండియా ఆడనుంది.