Team India: రూ.125కోట్లలో భారత ఆటగాళ్లు, కోచింగ్ స్టాఫ్‍కు పంపకాలు ఇలా.. ఒక్కో ప్లేయర్‌కు ఎన్ని కోట్లంటే!
Team India T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు రూ.125కోట్ల భారీ ప్రెజ్‍మనీని బీసీసీఐ ప్రకటించింది. అయితే, ఈ మొత్తంలో ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బందికి ఎంత దక్కుతుందో తాజాగా సమాచారం వెల్లడైంది.
టీ20 ప్రపంచకప్ 2024 టైటిల్ గెలిచి భారత్ సత్తాచాటింది. అమెరికా, వెస్టిండీస్ సంయుక్త వేదికలుగా ఈ ఏడాది జూన్‍లో జరిగిన విశ్వటోర్నీలో అదరగొట్టింది. 17ఏళ్ల ఏళ్ల తర్వాత టీ20 ప్రపంచకప్ టైటిల్ కైవసం చేసుకుంది. ఫైనల్‍లో దక్షిణాఫ్రికాపై ఉత్కంఠ పోరులో గెలిచి రోహిత్ శర్మ సేన ట్రోఫీ కైవసం చేసుకుంది. టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు రూ.125కోట్ల భారీ ప్రెజ్‍మనీని బీసీసీఐ ప్రకటించింది. అయితే, ఈ ప్రైజ్‍మనీలో ఆటగాళ్లు, కోచింగ్ స్టాఫ్ మధ్య పంపకాలు ఎలా ఉంటాయో.. ఎవరికి ఎంత దక్కుతుందో తాజాగా సమాచారం బయటికి వచ్చింది.
ఒక్కో ఆటగాడికి రూ.5కోట్లు
టీ20 ప్రపంచకప్ 2024 టోర్నీలో ప్రధాన జట్టులో ఉన్న 15 మంది ప్లేయర్లకు ఒక్కొక్కరికి ఈ ప్రైజ్‍మనీ నుంచి రూ.5కోట్లు దక్కనున్నాయని తెలుస్తోంది. ఈ విషయాన్ని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ రిపోర్ట్ వెల్లడించింది. ప్రపంచకప్‍లో ఒక్క మ్యాచ్ కూడా ఆడని యజువేంద్ర చాహల్, సంజూ శాంసన్, యశస్వి జైస్వాల్‍కు కూడా రూ.5కోట్ల దక్కనున్నాయని పేర్కొంది.
రిజర్వ్ ఆటగాళ్లుగా ఉన్న శుభ్‍మన్ గిల్, రింకూ సింగ్, ఆవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్‍లకు తలా ఓ రూ.కోటి దక్కుతుందని ఆ రిపోర్ట్ వెల్లడించింది.
కోచింగ్ స్టాఫ్‍కు ఇలా..
ప్రపంచకప్ బీసీసీఐ ప్రైజ్‍మనీ నుంచి టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‍కు రూ.2.5 కోట్లు దక్కుతాయని ఆ రిపోర్ట్ వెల్లడించింది. బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, ఫీల్డింగ్ కోచ్ టి.దిలీప్, బౌలింగ్ పరామ్ మాంబ్రేకు కూడా చెరో రూ.2.5కోట్లు పొందుతారని తెలుస్తోంది. ఇక, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌తో పాటు మిగిలిన సెలెక్టర్లకు తలా ఓ రూ.కోటి దక్కుతుందని సమాచారం.
కోచింగ్ సపోర్టింగ్ స్టాఫ్‍లో భాగంగా ఫిజియోథెరపిస్టులు, త్రోడౌన్ స్పెషలిస్టులు, వీడియో అనలిస్టులు, మెజరర్లు, కండీషనింగ్ కోచ్‍లకు కూడా ఈ ప్రైజ్‍మనీ నుంచి వాటా దక్కనుంది. సపోర్టింగ్ స్టాఫ్‍లో ఒక్కక్కరికి కనీసం రూ.కోటి వరకు ప్రైజ్‍మనీ నుంచి దక్కనుందని తెలుస్తోంది.
బార్బడోస్ వేదికగా జూన్ 29న జరిగిన టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్‍లో భారత్ 7 పరుగులతో తేడాతో దక్షిణాఫ్రికాపై ఉత్కంఠ విజయం సాధించింది. సుదీర్ఘ కాలం తర్వాత టీ20 ప్రపంచకప్ దక్కడంతో భారత ప్లేయర్లు ఎమోషనల్ అయ్యారు. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ సహా మరికొందరు ఆటగాళ్లు భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా టైటిల్ సాధించింది భారత్. ఆధిపత్యం ప్రదర్శించి ట్రోఫీ కైవసం చేసుకుంది. 2007 తర్వాత రెండోసారి టీ20 ప్రపంచకప్ టైటిల్ దక్కించుకుంది.
ఈ ప్రపంచకప్ టైటిల్ సాధించాక కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, ఆల్‍రౌండర్ రవీంద్ర జడేజా అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించారు. ఇక భారత్ తరఫున వన్డేలు, టెస్టులు ఆడనున్నారు. యువ ఆటగాళ్లకు టీ20ల్లో అవకాశాలు వచ్చేందుకు ఆ ముగ్గురు ఈ ఫార్మాట్‍కు గుడ్‍బై చెప్పారు. రాహుల్ ద్రవిడ్ కూడా హెడ్ కోచ్ పదవిని వీడయనున్నారు. తాను ఇక కొనసాగనని ద్రవిడ్ ఇప్పటికే స్పష్టం చేశారు.