T20 World Cup Final 2024: సాహో భారత్.. టీ20 ప్రపంచకప్ టైటిల్ కైవసం చేసుకున్న రోహిత్‍సేన.. 17 ఏళ్ల తర్వాత..-t20 world cup final 2024 ind vs sa india lifts t20 world title for the second time after beating south africa ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  T20 World Cup Final 2024: సాహో భారత్.. టీ20 ప్రపంచకప్ టైటిల్ కైవసం చేసుకున్న రోహిత్‍సేన.. 17 ఏళ్ల తర్వాత..

T20 World Cup Final 2024: సాహో భారత్.. టీ20 ప్రపంచకప్ టైటిల్ కైవసం చేసుకున్న రోహిత్‍సేన.. 17 ఏళ్ల తర్వాత..

Chatakonda Krishna Prakash HT Telugu
Published Jun 29, 2024 11:38 PM IST

T20 World Cup Final 2024: టీ20 ప్రపంచకప్ 2024 టైటిల్ కైవసం చేసుకుంది భారత్. ఫైనల్‍లో దక్షిణాఫ్రికాను చిత్తుచేసి చాంపియన్‍గా నిలిచింది. 17 ఏళ్ల తర్వాత టీమిండియా టీ20 ప్రపంచకప్ దక్కించుకుంది. 11 ఏళ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీని దక్కించుకుంది.

T20 World Cup Final 2024: సాహో భారత్.. టీ20 ప్రపంచకప్ టైటిల్ కైవసం చేసుకున్న రోహిత్‍సేన.. 17 ఏళ్ల తర్వాత..
T20 World Cup Final 2024: సాహో భారత్.. టీ20 ప్రపంచకప్ టైటిల్ కైవసం చేసుకున్న రోహిత్‍సేన.. 17 ఏళ్ల తర్వాత.. (AP)

టీమిండియా విశ్వవిజేతగా నిలిచింది. టీ20 ప్రపంచకప్ 2024 టైటిల్ సాధించి దుమ్మురేపింది. రెండోసారి పొట్టి వరల్డ్ కప్ ట్రోఫీ కైవసం చేసుకుంది భారత్. 11 ఏళ్ల ఐసీసీ టైటిల్ దాహన్ని తీర్చుకుంది. బార్బడోస్ వేదికగా నేడు (జూన్ 29) జరిగిన టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్‍లో భారత్ 7 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై ఉత్కంఠ విజయం సాధించింది. ప్రపంచకప్ టైటిల్ కైసవం చేసుకుంది రోహిత్ శర్మ సేన. 17 ఏళ్ల నిరీక్షణ తర్వాత టీమిండియాకు రెండో టీ20 ప్రపంచకప్ దక్కింది.

ఈ ఫైనల్ మ్యాచ్‍లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 176 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో దక్షిణాఫ్రికాను 8 వికెట్లకు 169 పరుగులకు పరిమితం చేసి భారత్ విజయం సాధించింది.

రెండో టైటిల్.. 17 ఏళ్ల నిరీక్షణ

టీ20 ప్రపంచకప్ తొలి ఎడిషన్‍ 2007లో భారత్ టైటిల్ సాధించింది. ఎంఎస్ ధోనీ సారథ్యంలో ట్రోఫీ కైవసం చేసుకుంది. ఆ తర్వాత మరో టీ20 టైటిల్ దక్కలేదు. ఇప్పుడు 17 ఏళ్ల తర్వాత రోహిత్ శర్మ సారథ్యంలో 2024లో భారత్ టీ20 వరల్డ్ కప్ టైటిల్ పట్టింది. 2013 చాంపియన్స్ ట్రోఫీ తర్వాత మరే ఐసీసీ టైటిల్ టీమిండియాకు దక్కలేదు. దీంతో 11 ఏళ్ల తర్వాత ఓ ఐసీసీ ట్రోఫీ కైవసం చేసుకుంది. గతేడాది వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్‍లో నిరాశ ఎదురైనా.. ఇప్పుడు టీ20 ప్రపంచకప్ దక్కించుకొని భారత్ దుమ్మురేపింది.

ఓటమి అంచు నుంచి గెలుపునకు.. బౌలర్ల అద్భుతం

ఓ దశలో దక్షిణాఫ్రికా గెలుపునకు 30 బంతులకు 30 పరుగులే చేయాల్సి ఉంది. హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్ క్రీజులో ఉన్నారు. ఆ దశ నుంచి భారత బౌలర్లు అద్భుతమైన బౌలింగ్ వేశారు. సఫారీ బ్యాటర్లను అద్భుతంగా కట్టడి చేశారు. 16వ ఓవర్లో బుమ్రా కేవలం 4 పరుగులే ఇచ్చాడు. 17వ ఓవర్లో జోరు మీద ఉన్న హెన్రిచ్ క్లాసెన్ (52)ను ఔచ్ చేసిన హార్దిక్ పాండ్యా కేవలం 4 రన్సే ఇచ్చాడు. 18వ ఓవర్లో జస్‍ప్రీత్ బుమ్రా మ్యాజిక్ చేశాడు. రెండు రన్స్ మాత్రమే ఇచ్చి ఓ వికెట్ తీశాడు. 19వ ఓవర్లో అర్షదీప్ కూడా 4 పరుగులే ఇచ్చాడు. చివరి ఓవర్లో పాండ్యా 8 పరుగులకే కట్టడి చేశాడు. దీంతో భారత ఓటమి అంచు నుంచి గెలిచింది. టీమిండియా బౌలర్లు అద్భుతం చేశారు.

భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా మూడు వికెట్లతో అదరగొట్టాడు. అర్షదీప్ సింగ్, జస్‍ప్రీత్ బుమ్రా తలా రెండు వికెట్లు తీశారు. సమిష్టిగా సత్తాచాటి భారత్‍ను గెలిపించారు. అక్షర్ పటేల్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. చివరి ఓవర్లో సూర్యకుమార్ యాదవ్ ఓ అద్భుతమైన క్యాచ్ పట్టాడు.

ఫైనల్ గెలిచాక కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా సహా పలువురు భారత ప్లేయర్లు భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నారు.

దుమ్మురేపిన కోహ్లీ

టీ20 ప్రపంచకప్ 2024 టోర్నీలో స్థాయికి తగ్గట్టు రాణించలేకపోయిన భారత స్టార్ విరాట్ కోహ్లీ.. ఫైనల్‍లో అదరగొట్టాడు. 59 బంతుల్లోనే 76 పరుగులతో అత్యంత ముఖ్యమైన హాఫ్ సెంచరీ చేశాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకున్నాడు. 6 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు. టీమిండియా గెలుపులో కీలకపాత్ర పోషించాడు. మొత్తంగా ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 176 పరుగులు చేసింది. అక్షర్ పటేల్ (31 బంతుల్లో 47), శివమ్ దూబే (16 బంతుల్లో 27 రన్స్) రాణించారు.

క్లాసెన్ బాదినా..

దక్షిణాఫ్రికా బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ (27 బంతుల్లోనే 52 పరుగులు) భీకర బ్యాటింగ్ చేసి భారత్‍ను టెన్షన్ పెట్టాడు. అద్భుత అర్ధ శకతం చేశాడు. అయితే మిగిలిన సఫారీ బ్యాటర్లు రాణించలేకపోయారు. భారత బౌలర్ల విజృంభణతో చివరి ఓవర్లలో సఫారీ బ్యాటర్లు వణికిపోయారు. మొత్తంగా 20 ఓవర్లలో 8 వికెట్లకు 169 పరుగులు చేసి ఓడింది దక్షిణాఫ్రికా. ఓ దశలో 30 బంతుల్లో 30 పరుగులు చేయలేక ఓడింది. తొలిసారి ప్రపంచకప్ ఫైనల్‍కు వచ్చిన దక్షిణాఫ్రికాకు నిరాశ ఎదురైంది.

Whats_app_banner