Yashasvi Jaiswal: టీమిండియా ఓపెనర్ జైశ్వాల్‌ను టార్గెట్ చేసిన ఆస్ట్రేలియా మాజీలు, కామెంట్స్‌తో భయపెట్టే ఎత్తుగడ
India tour of Australia 2024-25: ఆస్ట్రేలియా గడ్డపై ఆ దేశ బౌలర్లకి భారత యంగ్ ఓపెనర్ యశస్వి జైశ్వాల్‌తో చిక్కులు తప్పవని భారత మాజీ క్రికెటర్లు గత కొన్ని రోజుల నుంచి చెప్తున్నారు. దాంతో ఆస్ట్రేలియా నుంచి కూడా మాటల దాడి మొదలైంది.
IND vs AUS 2024: బోర్డర్- గవాస్కర్ ట్రోఫీ 2024-2025 ఆరంభానికి ముందే ఆస్ట్రేలియా నుంచి మాటల దాడి మొదలైంది. మూడు దశాబ్దాల తర్వాత ఆస్ట్రేలియా గడ్డపై ఐదు టెస్టుల సిరీస్‌ను భారత్ జట్టు ఆడబోతోంది.
ఈ సిరీస్‌లో ఆస్ట్రేలియా టీమ్‌కి టీమిండియా యంగ్ ఓపెనర్ యశస్వి జైశ్వాల్‌తో తిప్పలు తప్పవని అందరూ హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో సిరీస్‌కి ముందే జైశ్వాల్‌ను మాటల దాడితో మానసికంగా దెబ్బతీయాలని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లు కుట్రలు చేస్తున్నారు.
నిలకడగా సత్తాచాటుతున్న ఓపెనర్
ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ 2023-25 సీజన్‌లో ఇప్పటికే 1028 పరుగులతో రెండో టాప్ స్కోరర్‌గా కొనసాగుతున్న యశస్వి జైశ్వాల్ తొమ్మిది టెస్ట్ మ్యాచ్‌ల్లో 68.53 సగటుతో రెండు డబుల్ సెంచరీలు కూడా నమోదు చేశాడు. సీజన్‌లో ఇంగ్లాండ్ ఆటగాడు జో రూట్ (15 మ్యాచ్‌ల్లో 3 సెంచరీలు, 6 అర్ధసెంచరీలతో 1,165 పరుగులు) తర్వాత అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా జైశ్వాల్ కొనసాగుతున్నాడు.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి జైస్వాల్ తొలిసారి ఆస్ట్రేలియా గడ్డపై ఓపెనర్‌గా ఆడబోతున్నాడు. దాంతో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లు మాథ్యూ హేడెన్, నాథన్ లియాన్ ఇప్పటికే జైశ్వాల్ గురించి కామెంట్స్ చేస్తూ అక్కడి పిచ్‌లు, బౌలర్ల చెప్తూ గురించి భయపెట్టే ప్రయత్నం చేశారు. కానీ ఐపీఎల్ లో ఇప్పటికే మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్, జోష్ హేజిల్‌వుడ్‌లను ఎదుర్కొన్న జైశ్వాల్ టెస్టుల్లోనూ వారిపై ఆధిపత్యం చెలాయించే అవకాశం ఉంది.
బౌన్సీ పిచ్‌ల పేరు చెప్పి భయపెట్టే ఎత్తుగడ
వాస్తవానికి ఆస్ట్రేలియా తరహాలో పిచ్‌లు ఉండే సౌతాఫ్రికాలో జైశ్వాల్ సత్తాచాటలేకపోయాడు. బౌన్సీ పిచ్‌లపై ఆడటంలో కాస్త ఇబ్బందిపడ్డాడు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఆస్ట్రేలియా మాజీ హెడ్ కోచ్ జాన్ బుకానన్.. జైశ్వాల్‌ను ఉద్దేశిస్తూ కామెంట్స్ చేశాడు.
‘‘జైశ్వాల్ గురించి చర్చ జరుగుతోంది. ఆస్ట్రేలియాలో అతని ఆటని చూడటానికి అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ పెర్త్ లాంటి బౌన్సీ పిచ్‌లపై అతనికి ఆడిన అనుభవం లేదు. కాబట్టి.. అతను సత్తాచాటడం కష్టమే. అయితే ఆస్ట్రేలియా పరిస్థితులకి ఎంత త్వరగా అలవాటుపడతాడు అనేదానిపై సిరీస్‌లో అతని ప్రదర్శన ఆధారపడి ఉంటుంది’’ అని జాన్ బుకానన్ చెప్పుకొచ్చాడు.
ఇంగ్లాండ్‌తో ఈ ఏడాది ఆరంభంలో జరిగిన సిరీస్‌లో జైస్వాల్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. 5 మ్యాచ్‌ల్లో మొత్తం 9 ఇన్నింగ్స్‌ల్లో కలిపి 712 పరుగులు చేశాడు. ఇందులో రెండు డబుల్ సెంచరీలు, మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అలానే సిరీస్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. దాంతో ఇదే జోరుని ఆస్ట్రేలియా గడ్డపై కూడా కొనసాగించాలని టీమిండియా మేనేజ్‌మెంట్ ఆశిస్తోంది.
సిరీస్ షెడ్యూల్ ఇదే
నవంబర్ 22న భారత్, ఆస్ట్రేలియా మధ్య పెర్త్ వేదికగా తొలి టెస్టు ప్రారంభంకానుంది. ఆ తర్వాత అడిలైడ్ ఓవల్ వేదికగా డిసెంబర్ 6 నుంచి 10వ తేదీ వరకు రెండో టెస్టు డే/నైట్ ఫార్మాట్ ఉంటుంది. ఆ తర్వాత డిసెంబర్ 14 నుంచి 18 వరకు జరిగే మూడో టెస్టుకి బ్రిస్బేన్ ఆతిథ్యం ఇవ్వనుంది. డిసెంబర్ 26 నుంచి 30 వరకు మెల్‌బోర్న్, చివరి టెస్టు మ్యాచ్ జనవరి 3 నుంచి 7 వరకు సిడ్నీలో జరగనుంది.