IND vs NZ 1st Test: తొలి టెస్టు ముంగిట.. భారత ఓపెనర్ యశస్వి జైశ్వాల్ హ్యాపీగా లేడన్నకెప్టెన్ రోహిత్ శర్మ
India vs New Zealand 1st Test: భారత్, న్యూజిలాండ్ మధ్య బుధవారం నుంచి తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభంకానుంది. కానీ తొలి టెస్టు ముంగిట ఓపెనర్ యశస్వి జైశ్వాల్ హ్యాపీగా లేడంటూ కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.
భారత్, న్యూజిలాండ్ మధ్య మూడు టెస్టుల సిరీస్ మరి కొన్ని గంటల్లో ప్రారంభంకానుంది. కానీ.. ఈ టెస్టు సిరీస్ ముంగిట టీమిండియా యంగ్ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ హ్యాపీగా లేడంటూ కెప్టెన్ రోహిత్ శర్మ కామెంట్స్ చేయడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. వాస్తవానికి ప్రస్తుతం జరుగుతున్న ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భారత్ తరఫున నిలకడగా రాణిస్తున్న యశస్వి జైశ్వాల్.. ఆడిన 11 టెస్టుల్లో మూడు సెంచరీలతో 1217 పరుగులు చేశాడు. టెస్టుల్లో అతని సగటు 64.05గా ఉంది.
కెరీర్ ఆరంభంలోనే వెస్టిండీస్‌తో సెంచరీ బాదిన యశస్వి జైశ్వాల్ ఈ ఈ ఏడాది ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదు టెస్టుల సిరీస్‌లోనూ 700పైచిలుకు పరుగులు చేసి రికార్డులు నెలకొల్పాడు. అయినప్పటికీ ఇప్పటి వరకు సాధించిన పరుగులు, రికార్డుల పట్ల యశస్వి జైశ్వాల్ హ్యాపీగా లేడని కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.
జైశ్వాల్ ఎందుకు హ్యాపీగా లేడంటే?
‘‘యశస్వి జైశ్వాల్ చాలా టాలెంటెడ్ ప్లేయర్. అతని ప్రతిభ గురించి నాకు తెలుసు కాబట్టి టెస్టుల్లో సాధిస్తున్న పరుగులు, రికార్డులకి నేను ఆశ్చర్యపోవడం లేదు. క్లిష్ట పరిస్థితుల్లో కూడా మ్యాచ్ గమనానికి అనుగుణంగా అతను బ్యాటింగ్ చేయలగడు. ఇంటర్నేషనల్ క్రికెట్‌లో సత్తాచాటడానికి అవసరమైన అన్ని స్కిల్స్ యశస్వి జైశ్వాల్‌లో ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు సాధించిన పరుగులు, రికార్డుల పట్ల అతను సంతృప్తిగా లేడు. మరింతగా సాధించాలనే ఆతృత జైశ్వాల్‌లో కనిపిస్తోంది’’ అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.
శిఖర్ ధావన్‌కి రీప్లేస్‌మెంట్
భారత మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ రిటైర్మెంట్ ప్రకటించడంతో యశస్వి జైశ్వాల్‌కి టెస్టుల్లో లైన్ క్లియరైంది. ఎడమ చేతి వాటం బ్యాటర్ కావడంతో టీమిండియాకీ మంచి ఆప్షన్ దొరికింది. కానీ చాలా సందర్భాల్లో యశస్వి జైశ్వాల్ దూకుడుగా ఆడబోయి వికెట్ చేజార్చుకుంటూ వస్తుంటాడు. దాంతో మ్యాచ్ గమనానికి అనుగుణంగా ఆడటంపై ఈ యంగ్ ప్లేయర్ మరింత శ్రద్ధ పెట్టాలని మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు. దేశవాళీ క్రికెట్, అండర్-19 క్రికెట్‌లో యశస్వి జైశ్వాల్ చాలా మ్యాచ్‌లు ఆడాడు.
ఏడాది వ్యవధిలో పరుగుల మోత
జులై, 2023లో భారత్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన జైశ్వాల్ ఇప్పటి వరకు 11 టెస్టులాడి 1217 పరుగులు చేయగా.. ఇందులో రెండు డబుల్ సెంచరీలు కూడా ఉన్నాయి. అలానే టెస్టుల్లో 139 ఫోర్లు, 32 సిక్సర్లు ఉండటం అతని దూకుడికి నిదర్శనం. అలానే ఆడిన 23 టీ20ల్లో 723 పరుగులు చేయగా.. ఇందులో ఒక సెంచరీ కూడా ఉంది.
భారత్, న్యూజిలాండ్ మధ్య బుధవారం (అక్టోబరు 16) తొలి టెస్టు మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కి బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుండగా.. టాస్ ఉదయం 9 గంటలకి పడనుంది.