IND vs NZ 1st Test Weather: భారత్, న్యూజిలాండ్ తొలి టెస్టుకు వాన గండం ఉందా? తుది జట్లు ఎలా ఉండొచ్చు?
IND vs NZ 1st Test Weather: న్యూజిలాండ్‍తో టెస్టు పోరుకు భారత్ సిద్ధమైంది. బెంగళూరులో తొలి టెస్టు జరగనుంది. ఈ మ్యాచ్‍కు వరుణుడి గండం కనిపిస్తోంది. ఈ మ్యాచ్‍పై వర్షం ప్రభావం ఎలా ఉండొచ్చంటే..
టీమిండియా ఫుల్ జోష్‍లో ఉంది. బంగ్లాదేశ్‍ను స్వదేశంలో టెస్టు, టీ20 సిరీస్‍ల్లో చిత్తు చేసి జోరు చూపింది. ఇక న్యూజిలాండ్‍తో మూడు టెస్టుల సిరీస్ సమరానికి భారత్ రెడీ అయింది. డబ్ల్యూటీసీ ఫైనల్ చేరేందుకు టీమిండియాకు ఈ సిరీస్ కూడా కీలకంగా ఉంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రేపు (అక్టోబర్ 16) భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి టెస్టు మొదలుకానుంది. అయితే, ఈ మ్యాచ్‍పై వర్షం ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
వర్షం ముప్పు!
టీమిండియా, న్యూజిలాండ్ తొలి టెస్టు తొలి రోజు (అక్టోబర్ 16) బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద వాన పడే అవకాశాలు ఉన్నాయి. అక్యువెదర్ రిపోర్ట్ ప్రకారం, ఉదయం వర్షం పడే అవకాశాలు 8 శాతమే ఉన్నా.. ఆ తర్వాత అధికమైంది. మధ్యాహ్నం 1 గంటల నుంచి వర్షం కురిసే అవకాశం 51 శాతంగా ఉంది. దీంతో ఆటకు అంతరాయం కలిగే ఛాన్స్ కనిపిస్తోంది. బెంగళూరు స్టేడియంలో డ్రైనేజ్ సిస్టమ్ మెరుగ్గా ఉండడం కాస్త కలిసి వచ్చే అంశం.
రెండో రోజు (అక్టోబర్ 17) కూడా చిన్నస్వామి స్టేడియం వద్ద వాన పడే అవకాశాలు 50 శాతం వరకు ఉన్నాయి. తొలి రెండు రోజులు ఆకాశం ఎక్కువగా మేఘావృతమై ఉంటుంది. అయితే, ఈ మ్యాచ్ తదుపరి మూడు రోజులు వాన పడే అవకాశాలు తక్కువగానే ఉన్నాయి. అయితే, తొలి రెండు రోజులు ఆటకు వాన ముప్పు పొంచి ఉంది.
తుది జట్లు ఇలా..
న్యూజిలాండ్‍తో తొలి టెస్టులో ముగ్గురు ప్లేసర్లతోనే భారత్ బరిలోకి దిగే అవకాశం ఉంది. దీంతో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‍కు తుది జట్టులో చోటు దక్కే అవకాశాలు కనిపించడం లేదు. సర్ఫరాజ్ ఖాన్ కూడా బెంచ్‍కే పరిమితం అయ్యే ఛాన్స్ ఉంది. ఒకవేళ సర్ఫరాజ్‍ను తీసుకోవాలంటే గిల్‍ను పక్కనపెట్టాల్సి వస్తుంది.
తొలి టెస్టులో భారత తుదిజట్టు (అంచనా): యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, ఆకాశ్‍దీప్, జస్‍ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్
న్యూజిలాండ్ తుదిజట్టు (అంచనా): డెవోన్ కాన్వే, టామ్ లాథమ్ (కెప్టెన్), విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ బ్లండెల్ (వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ శాంట్నర్, టిమ్ సౌథీ, ఎజాజ్ పటేల్, విల్ ఒరూర్కే
టైమ్ ఇలా..
భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి టెస్టు తొలి రోజు రేపు (అక్టోబర్ 16) ఉదయం 9 గంటల 30 నిమిషాలకు మొదలుకానుంది. అరగంట ముందు టాస్ పడుతుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.
లైవ్ ఎక్కడ?
టీమిండియా, న్యూజిలాండ్ మధ్య తొలి టెస్టు స్పోర్ట్స్18 నెట్‍వర్క్ టీవీ ఛానెళ్లలో లైవ్ టెలికాస్ట్ అవుతుంది. డిజిటల్ విషయానికి వస్తే, జియోసినిమా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో ఈ మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్ అవుతుంది.