IND vs BAN 2nd Test: అద్భుతం చేసిన భారత్.. డ్రా ఖాయమనుకున్న దశ నుంచి గెలిచి సత్తాచాటిన రోహిత్ సేన.. సిరీస్ క్లీన్‍స్వీప్
IND vs BAN 2nd Test: బంగ్లాదేశ్‍పై రెండో టెస్టులో భారత్ అద్భుత విజయం సాధించింది. వాన వల్ల ఈ మ్యాచ్‍లో సుమారు రెండున్నర రోజులు ఆట జరగపోయినా.. అదరగొట్టే ఆటతో గెలిచింది. ఈ టెస్టు సిరీస్‍ను 2-0తో కైవసం చేసుకుంది.
టీమిండియా అద్భుతం చేసింది. వాన, చిత్తడి మైదానం వల్ల రెండున్నర రోజులకు పైగా ఆట తుడిచిపెట్టుకుపోయినా బంగ్లాదేశ్‍పై రెండో టెస్టులో విజయం సాధించింది. మ్యాచ్ చివరి రెండు రోజులు ధనాధన్ బ్యాటింగ్, అద్భుత బౌలింగ్‍తో భారత్ అదిరే గెలుపు సొంతం చేసుకుంది. కన్పూర్ వేదికగా రెండో టెస్టులో చివరి రోజైన నేడు (అక్టోబర్ 1) టీమిండియా 7 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‍పై విజయం సాధించింది. వాన వల్ల ఈ టెస్టు తొలి రోజు 35 ఓవర్లే జరగగా.. తదుపరి రెండు రోజులు రద్దయ్యాయి. మిగిలిన రెండు రోజుల్లోనే సత్తాచాటి గెలిచిన భారత్ 2-0తో ఈ సిరీస్ క్లీన్‍స్వీప్ చేసింది.
భారత బౌలర్స్ అదుర్స్.. బంగ్లా ఢమాల్
రెండు వికెట్లకు 26 పరుగుల వద్ద రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్‍ను నేడు ఐదో రోజు కొనసాగించింది బంగ్లాదేశ్. అయితే, భారత బౌలర్లు అద్భుత ప్రదర్శనతో బంగ్లా బ్యాటింగ్ లైనప్‍ను కుప్పకూల్చేశారు. భారత స్టార్ పేసర్ జస్‍ప్రీత్ బుమ్రా, స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా తలా మూడు వికెట్లతో సత్తాచాటారు. ఆకాశ్ దీప్ ఓ వికెట్ తీశాడు. బంగ్లా ఓపెనర్ షద్మాన్ ఇస్లాం (50) మినహా మిగిలిన బ్యాటర్లు విఫలమయ్యారు. ముష్పికర్ రహీం (37) కాస్త పోరాడాడు. మొత్తంగా టపాటపా వికెట్లు కోల్పోయిన బంగ్లా 146 పరుగులకే కుప్పకూలింది. మోమినుల్ హక్ (3)ను ఔట్ చేసి బంగ్లా పతనాన్ని మొదలుపెట్టాడు భారత స్టార్ స్పిన్నర్ అశ్విన్. ఆ తర్వాత కెప్టెన్ నజ్ముల్ హుసేన్ శాంతో (19)ను జడేజా బౌల్డ్ చేశారు. లిటన్ దాస్ (1), సీనియర్ బ్యాటర్ షకీబల్ హసన్ (0)ను కూడా వెనువెంటనే పెవిలియన్‍కు పంపాడు.
ముష్ఫికర్ కాసేపు నిలిచిన ఫలితం లేకపోయింది. మిగిలిన వికెట్లు త్వరగా పడ్డాయి. 146 పరుగులకే బంగ్లా చాపచుట్టేసింది. దీంతో టీమిండియా ముందు కేవలం 95 పరుగుల లక్ష్యం నిలిచింది.
దుమ్మురేపిన యశస్వి
స్వల్ప లక్ష్యాన్ని భారత్ అలవోకగా ఛేదించింది. యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (45 బంతుల్లో 51 పరుగులు) హాఫ్ సెంచరీతో దమ్మురేపాడు. హిట్టింగ్‍తో మెప్పించాడు. కెప్టెన్ రోహిత్ శర్మ (8), శుభ్‍మన్ గిల్ (6) త్వరగానే ఔటైనా యశస్వి మాత్రం అదరగొట్టాడు. లక్ష్యాన్ని కరిగించేశాడు. 43 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు యశస్వి. ఆ తర్వాత కాసేపటికే ఔటయ్యాడు. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (29 నాటౌట్) రాణించాడు. నిలకడగా ఆడాడు. రెండో ఇన్నింగ్స్‌లో 17.2 ఓవర్లలోనే 3 వికెట్లకు 98 పరుగులు చేసి విజయం సాధించింది భారత్.
మ్యాచ్ సాగిందిలా..
ఈ రెండో టెస్టు తొలి రోజు తొలుత బ్యాటింగ్ చేసి బంగ్లాదేశ్ 35 ఓవర్లలో 3 వికెట్లకు 107 రన్స్ చేసింది. వాన వల్ల ఆట పూర్తిగా జరగలేదు. అయితే, భారీ వర్షంతో రెండో రోజు, చిత్తడి మైదానంలో మూడో రోజు ఆట ఒక్క బంతి పడకుండానే రద్దయింది. దీంతో మ్యాచ్ డ్రా అవడం ఖాయమనుకున్న దశలో చివరి రెండు రోజుల్లో టీమిండియా మ్యాజిక్ చేసింది.
తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్‍ను 233 పరుగులకే భారత్ ఆలౌట్ చేసింది. ఆ తర్వాత టెస్టుల్లో అనితర సాధ్యమైన బ్యాటింగ్ చేసింది. నాలుగో రోజు కేవలం 34.4 ఓవర్లలోనే 285 పరుగులు చేసి తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. టెస్టు చరిత్రలో వేగవంతమైన 50, 100, 150, 200, 250 పరుగుల రికార్డులను దక్కించుకుంది. ఐదో రోజు బంగ్లాను రెండో ఇన్నింగ్స్‌లో 146 పరుగులకు కుప్పకూల్చి.. లక్ష్యాన్ని భారత్ అలవోకగా ఛేదించింది. 2-0తో సిరీస్‍ను క్లీన్‍స్వీప్ చేసింది. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ధనాధన్ 72 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 51 పరుగులు చేసి భారత యంగ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్‍కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
భారత్, బంగ్లాదేశ్ మధ్య తదుపరి మూడు టీ20ల సిరీస్ జరగనుంది. అక్టోబర్ 6న తొలి మ్యాచ్, అక్టోబర్ 9న రెండో టీ20, అక్టోబర్ 12న ఆఖరిదైన మూడో టీ20 జరగనున్నాయి.