IND vs BAN 1st Test: రిషబ్ పంత్‌కి క్షమాపణలు చెప్పిన యశస్వి జైశ్వాల్.. ఒకే ఓవర్‌లో రెండు ఛాన్స్‌లు
Yashasvi Jaiswal: బంగ్లాదేశ్ ఫీల్డర్ల తప్పిదం కారణంగా భారత యంగ్ క్రికెటర్లు యశస్వి జైశ్వాల్, రిషబ్ పంత్ రెండు సార్లు రనౌట్ అయ్యే ప్రమాదాన్ని తప్పించుకున్నారు. వికెట్ల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ కారణంగా రెండు సార్లూ యశస్వి డైవ్ చేయాల్సి వచ్చింది.
Rishabh Pant: టీమిండియా యంగ్ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ చెన్నైలోని చెపాక్ స్టేడియంలో రిషబ్ పంత్‌కి క్షమాపణలు చెప్పాడు. బంగ్లాదేశ్‌తో గురువారం ప్రారంభమైన తొలి టెస్టులో రిషబ్ పంత్, యశస్వి జైశ్వాల్ తొలి సెషనల్‌లో వికెట్ కాపాడుకుంటూ బంగ్లాదేశ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. ఈ క్రమంలో ఓ రెండు సందర్భాల్లో ఈ జోడి వికెట్ల మధ్య పరుగు తీయడంలో ఇబ్బందిపడింది. కమ్యూనికేషన్ గ్యాప్ కారణంగా జైశ్వాల్, పంత్ రనౌట్ అవ్వబోయారు.
తొలి సెషన్‌లో ఆదుకున్న జోడి
మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ, నెం.3లో వచ్చిన శుభమన్ గిల్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మ్యాచ్ ఆరంభమైన తొలి గంటలోనే బంగ్లాదేశ్ పేసర్ హసన్ మహమూద్‌కి వికెట్లు సమర్పించుకున్నారు. దాంతో భారత్ ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యతని రిషబ్ పంత్, యశస్వి జైశ్వాల్ తీసుకున్నారు.
మ్యాచ్‌లో 118 బంతులు ఎదుర్కొన్న యశస్వి జైశ్వాల్ 9 ఫోర్ల సాయంతో 56 పరుగులు చేశాడు. రిషబ్ పంత్ కూడా 52 బంతుల్లో 6 ఫోర్ల సాయంతో 39 పరుగులు చేసి ఔటయ్యాడు. భారత్ జట్టు 34/3తో నిలిచిన దశలో పట్టుదలతో బ్యాటింగ్ చేసిన ఈ యంగ్ జోడి నాలుగో వికెట్‌కి 62 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. అయితే రెండో సెషన్‌లో ఇద్దరూ ఒకే తరహాలో వికెట్ చేజార్చుకుని పెవిలియన్ బాట పట్టారు.
ఒకే ఓవర్‌లో రెండు సార్లు ఛాన్స్
ఇన్నింగ్స్ 12వ ఓవర్ వేసిన హసన్ మహమూద్ బౌలింగ్‌లో బంతిని డిఫెన్స్ చేసిన రిషబ్ పంత్ అనూహ్యంగా సింగిల్ కోసం జైశ్వాల్‌ను పిలిచాడు. దాంతో స్పందించిన జైశ్వాల్ రిస్క్ చేస్తూ సింగిల్‌కి వచ్చాడు. అయితే అదే సమయంలో ఫీల్డర్ బంతిని అందుకుని కీపర్‌కి ఇవ్వడంతో రనౌట్ నుంచి తప్పించుకోవడానికి జైశ్వాల్ ఫుల్ లెంగ్త్ డైవ్ చేయాల్సి వచ్చింది.
ఇదే ఓవర్‌లో బంతిని మిడాన్ దిశగా హిట్ చేసిన రిషబ్ పంత్.. బంతి బౌండరీకి వెళ్లిపోతుందని చాలా క్యాజువల్‌గా నడుచుకుంటూ నాన్‌స్ట్రైక్ ఎండ్ వైపు వచ్చాడు. అయితే చెపాక్ అవుట్ ఫీల్డ్ కాస్త నెమ్మదిగా ఉండటంతో బంతి వేగం తగ్గింది. అది గమనించిన పంత్ రెండో పరుగు కోసం జైశ్వాల్‌ను పిలిచాడు. రెండో పరుగు పూర్తవుతున్న క్రమంలో బంతిని ఆపడానికి బౌండరీ లైన్ సమీపానికి వెళ్లిన బంగ్లాదేశ్ ఫీల్డర్ నహీద్ రాణా దాన్ని పట్టుకోవడంలో తడబడ్డాడు. అది గమనించిన పంత్ మూడో పరుగు కోసం కూడా పిలిచాడు.
క్రీజులో జారిపోయిన జైశ్వాల్
వాస్తవానికి రిషబ్ పంత్ అప్పటికే అలసిపోయాడు. యాక్సిడెంట్ నుంచి కోలుకున్న తర్వాత మునుపటి తరహాలో పంత్ ఫిట్‌గా లేడు. రెండో పరుగుకే అతను అలసిపోయినట్లు కనిపించాడు. అయితే మూడో పరుగుకి కూడా అవకాశం ఉండటంతో పరుగెత్తక తప్పలేదు. కానీ జైశ్వాల్ కాస్త నెమ్మదిగా పరుగెడుతుండటంతో బంతిని ఫీల్డర్ నహీద్ రాణా కీపర్ ఎండ్ వైపు విసిరాడు. దాంతో జైశ్వాల్ మరోసారి రనౌట్ నుంచి కాపాడుకోవడానికి డైవ్ చేయాల్సి వచ్చింది.
ఆ ఓవర్ తర్వాత వికెట్ల మధ్య ఇద్దరూ మాట్లాడుకుంటుండగా.. రిషబ్ పంత్‌కి యశస్వి జైశ్వాల్ క్షమాపణలు చెప్పాడు. ‘‘సారీ.. నేను జారిపోయాను. అందుకే పరుగెత్తలేకపోయా’’ అని వివరణ ఇచ్చుకున్నాడు. ఒకే ఓవర్‌లో ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ రావడంతో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్, కెప్టెన్ రోహిత్ శర్మ కాస్త అసహనంతో వారి వైపు చూస్తూ కనిపించారు.