ICC Test Rankings: నంబర్ వన్ ర్యాంక్ కోల్పోయిన బుమ్రా.. టాప్ 10 నుంచి కోహ్లి, రిషబ్ పంత్ ఔట్..-icc test rankings bumrah loses top spot virat kohli rishabh pant out of top 10 ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Icc Test Rankings: నంబర్ వన్ ర్యాంక్ కోల్పోయిన బుమ్రా.. టాప్ 10 నుంచి కోహ్లి, రిషబ్ పంత్ ఔట్..

ICC Test Rankings: నంబర్ వన్ ర్యాంక్ కోల్పోయిన బుమ్రా.. టాప్ 10 నుంచి కోహ్లి, రిషబ్ పంత్ ఔట్..

Hari Prasad S HT Telugu
Oct 30, 2024 03:35 PM IST

ICC Test Rankings: టీమిండియా స్టార్ పేస్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా టెస్టుల్లో తన నంబర్ వన్ ర్యాంక్ కోల్పోయాడు. అటు స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లి, రిషబ్ పంత్ టాప్ 10 నుంచి బయటకు వెళ్లిపోయారు.

నంబర్ వన్ ర్యాంక్ కోల్పోయిన బుమ్రా.. టాప్ 10 నుంచి కోహ్లి, రిషబ్ పంత్ ఔట్..
నంబర్ వన్ ర్యాంక్ కోల్పోయిన బుమ్రా.. టాప్ 10 నుంచి కోహ్లి, రిషబ్ పంత్ ఔట్.. (AFP and PTI)

ICC Test Rankings: న్యూజిలాండ్ తో రెండు టెస్టుల్లోనూ ఓడిపోయి స్వదేశంలో 12 ఏళ్ల తర్వాత సిరీస్ కోల్పోయిన టీమిండియాకు తాజా టెస్టు ర్యాంకుల్లోనూ చేదు అనుభవమే ఎదురైంది. నంబర్ వన్ బౌలర్ గా నిలిచిన బుమ్రా.. ఇప్పుడు తన అగ్రస్థానాన్ని సౌతాఫ్రికా పేస్ బౌలర్ కగిసో రబాడాకు కోల్పోయాడు. మరోవైపు బ్యాటింగ్ ర్యాంకుల్లోనూ మన ప్లేయర్స్ పతనమయ్యారు.

టాప్ ర్యాంక్ కోల్పోయిన బుమ్రా

టీమిండియా పేస్ బౌలర్ బుమ్రా టెస్టుల్లో నంబర్ వన్ ర్యాంక్ కోల్పోయాడు. ఈ మధ్యే టెస్టుల్లో 300 వికెట్ల మైలురాయిని అందుకున్న సౌతాఫ్రికా పేస్ బౌలర్ కగిసో రబాడా 2019 తర్వాత తొలిసారి టెస్టుల్లో నంబర్ వన్ అయ్యాడు. బంగ్లాదేశ్ తో జరిగిన తొలి టెస్టులో ఏకంగా 9 వికెట్లు తీసి సౌతాఫ్రికాను గెలిపించిన రబాడా.. తాజా ర్యాంకుల్లోనూ అగ్రస్థానానికి దూసుకెళ్లాడు.

అదే సమయంలో న్యూజిలాండ్ తో రెండో టెస్టులో బుమ్రా దారుణంగా విఫలమయ్యాడు. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. దీంతో తొలి స్థానం నుంచి మూడో స్థానానికి పడిపోయాడు. ఆస్ట్రేలియా పేసర్ హేజిల్‌వుడ్ రెండో స్థానంలో ఉన్నాడు. ఇక స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా రెండు స్థానాలు కోల్పోయి నాలుగో ర్యాంకులో నిలిచాడు.

విరాట్ కోహ్లి, పంత్ ఔట్

న్యూజిలాండ్ తో రెండో టెస్టులో బ్యాటింగ్ వైఫల్యంతోనే టీమిండియా ఓడిపోయింది. స్పిన్ పిచ్ పై మన బ్యాటర్లు అసలు నిలదొక్కుకోలేకపోయారు. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి సహా మిగతా బ్యాటర్లు కూడా విఫలమయ్యారు. దీంతో తాజా టెస్టుల్లో ర్యాంకుల్లో విరాట్ కోహ్లితోపాటు రిషబ్ పంత్ కూడా టాప్ 10 నుంచి బయటకు వెళ్లిపోయారు.

కోహ్లి ఆరు స్థానాలు దిగజారి 14వ ర్యాంకుకు పడిపోయాడు. వికెట్ కీపర్ పంత్ కూడా 11వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఇక కెప్టెన్ రోహిత్ శర్మ అయితే టాప్ 20 నుంచి కూడా బయటకు వెళ్లిపోయాడు. తాజా ర్యాంకుల్లో అతడు ఏకంగా 24వ ర్యాంకులో ఉన్నాడు. టాప్ 10లో ఇండియా నుంచి యశస్వి జైస్వాల్ మాత్రమే మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.

బ్యాటింగ్ ర్యాంకుల్లో ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ టాప్ లో ఉన్నాడు. టెస్ట్ ఆల్ రౌండర్ల జాబితాలో ఇండియన్ ఆల్ రౌండర్లు రవీంద్ర జడేజా, అశ్విన్ మాత్రం టాప్ లోనే కొనసాగుతున్నారు.

Whats_app_banner