Virat Kohli Run-out: విరాట్ కోహ్లి షాకింగ్ రనౌట్.. లేని పరుగు కోసం ట్రై చేసి ఎలా ఔటయ్యాడో చూడండి.. 78/1 నుంచి 84/4కి..
Virat Kohli Run-out: విరాట్ కోహ్లి రనౌటైన విధానం అతన్నే కాదు అభిమానులను కూడా షాక్ కు గురి చేస్తోంది. అసలే ఫామ్ లేమితో సతమతమవుతున్న విరాట్.. లేని పరుగు కోసం ప్రయత్నించి రనౌట్ కావడం గమనార్హం.
Virat Kohli Run-out: విరాట్ కోహ్లి అంటేనే వికెట్ల మధ్య చిరుతలా పరుగెత్తుతాడన్న పేరుంది. అలాంటి ప్లేయర్ తాను కచ్చితంగా క్రీజులో నిలదొక్కుకోవాల్సిన సమయంలో రనౌటవడం అభిమానులకు అస్సలు మింగుడు పడటం లేదు. న్యూజిలాండ్ తో శుక్రవారం (నవంబర్ 1) మొదలైన మూడో టెస్టు తొలి రోజు ఆటలో కోహ్లి రనౌటైన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
విరాట్ కోహ్లి షాకింగ్ రనౌట్
న్యూజిలాండ్ తో మూడో టెస్టు తొలి రోజు ఆట మరో 15 నిమిషాలు మిగిలి ఉన్నంత వరకూ టీమిండియాదే పైచేయి. న్యూజిలాండ్ ను 235 పరుగులకే కట్టడి చేసి.. వికెట్ నష్టానికి 78 పరుగులతో రెండో రోజు కాన్ఫిడెంట్ గా ప్రారంభించే అవకాశం ఉండేది. కానీ ఆ స్కోరు నుంచి సడెన్ గా ఇండియన్ టీమ్ 4 వికెట్లకు 84 పరుగులకు పరిమితమైపోయింది.
అందులో విరాట్ కోహ్లి చేజేతులా రనౌట్ కావడం కూడా ఓ భాగం కావడం గమనార్హం. రెండో టెస్టులో ఓ ఫుల్ టాస్ బంతికి అతడు ఎలా ఔటయ్యాడో.. ఈ రనౌట్ కూడా అలాంటిదే. ఇన్నింగ్స్ 19వ ఓవర్లో మిడాన్ వైపు బంతిని కొట్టిన కోహ్లి వెంటనే సింగిల్ కోసం పరుగెత్తాడు. అయితే అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న మ్యాట్ హెన్రీ మెరుపు వేగంతో కదిలి బంతిని నేరుగా వికెట్లకేసి కొట్టాడు.
కోహ్లి అప్పటికే డైవ్ చేసినా క్రీజుకు చాలా దూరంలోనే ఉండిపోయినట్లు రీప్లేల్లో తేలింది. కీలకమైన సమయంలో లేని పరుగు కోసం కోహ్లి ఔటైన తీరు అతనికే కాదు అభిమానులను, టీమ్ మేనేజ్మెంట్ ను కూడా షాక్ కు గురి చేసింది. అంతకుముందు బంతికే ఫోర్ కొట్టి ఊపు మీద కనిపించిన అతడు.. సడెన్ గా ఔటవడంతో టీమ్ కూడా తడబడింది.
78/1 నుంచి 84/4 వరకు..
స్వదేశంలో 12 ఏళ్ల తర్వాత టెస్టు సిరీస్ కోల్పోయిన తీరు నుంచి ఈ సిరీస్ లో టీమిండియా ఆటతీరు మొత్తం అయోమయంగానే సాగుతోంది. ముఖ్యంగా విరాట్ కోహ్లి ఆట ఎవరికీ అంతుబట్టడం లేదు. సీనియర్ మోస్ట్ బ్యాటర్ గా బాధ్యతను భుజాలపై వేసుకోవాల్సిన అతడు.. రెండో టెస్టులో ఫుల్ టాస్ బంతికి ఔటైన విధానం ఇంకా మరచిపోక ముందే.. ఇలా రనౌట్ అవడం మరిన్ని విమర్శలకు దారి తీసింది.
తొలి రోజు వికెట్ నష్టానికి 78 పరుగులతో ఉన్న టీమ్.. పది నిమిషాల వ్యవధిలో మరో మూడు వికెట్లు కోల్పోయి 4 వికెట్లకు 84 పరుగులతో ముగించింది. ఇప్పటికీ ఇంకా న్యూజిలాండ్ కంటే 151 పరుగులు వెనుకబడే ఉంది. శుభ్‌మన్ గిల్ (31), పంత్ (1) క్రీజులో ఉన్నారు. రోహిత్ (18) ఊపు మీద కనిపించినా త్వరగానే ఔటయ్యాడు. యశస్వి (30) కాసేపు ఆడి వెనుదిరిగాడు. నైట్ వాచ్‌మన్ గా వచ్చిన సిరాజ్ తొలి బంతికే డకౌటయ్యాడు.
దీంతో ఈ టెస్టులో పైచేయి సాధించే అవకాశాన్ని టీమిండియా కోల్పోయింది. తొలి రోజు నుంచే పిచ్ స్పిన్ కు అనుకూలిస్తుండటంతో రెండో రోజు మిగిలిన బ్యాటర్లు ఎంత వరకూ క్రీజులో నిలదొక్కుకుంటారన్నది అనుమానమే. ఈసారి కూడా కుప్పకూలితే మాత్రం వైట్ వాష్ కు సిద్ధపడాల్సిందే.