Ind vs Aus: బుమ్రా బౌలింగ్ చాలా ఈజీ.. అతని కంటే ఆ టీమిండియా పేసరే డేంజర్: ఆస్ట్రేలియా ఓపెనర్ కామెంట్స్-india vs austalia border gavaskar trophy usman khawaja about jasprit bumrah perth test ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ind Vs Aus: బుమ్రా బౌలింగ్ చాలా ఈజీ.. అతని కంటే ఆ టీమిండియా పేసరే డేంజర్: ఆస్ట్రేలియా ఓపెనర్ కామెంట్స్

Ind vs Aus: బుమ్రా బౌలింగ్ చాలా ఈజీ.. అతని కంటే ఆ టీమిండియా పేసరే డేంజర్: ఆస్ట్రేలియా ఓపెనర్ కామెంట్స్

Hari Prasad S HT Telugu
Nov 18, 2024 09:42 AM IST

Ind vs Aus: బుమ్రా బౌలింగ్ చాలా ఈజీ అంటూ ఆస్ట్రేలియా ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ప్రారంభానికి ముందు టీమిండియా స్టార్ పేసర్ పై మానసికంగా పైచేయి సాధించే ప్రయత్నం చేశాడు.

బుమ్రా బౌలింగ్ చాలా ఈజీ.. అతని కంటే ఆ టీమిండియా పేసరే డేంజర్: ఆస్ట్రేలియా ఓపెనర్ కామెంట్స్
బుమ్రా బౌలింగ్ చాలా ఈజీ.. అతని కంటే ఆ టీమిండియా పేసరే డేంజర్: ఆస్ట్రేలియా ఓపెనర్ కామెంట్స్ (AFP)

Ind vs Aus: ఆస్ట్రేలియా ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా.. టీమిండియాతో సిరీస్ కు ముందు మాటల యుద్ధానికి దిగాడు. అందరూ బుమ్రాను గొప్ప బౌలర్ అంటారు కానీ.. అతని బౌలింగ్ చాలా ఈజీగా అన్నట్లుగా ఖవాజా మాట్లాడాడు. ఈ నెల 22 నుంచి పెర్త్ లో తొలి టెస్ట్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఖవాజా కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. బుమ్రా కంటే షమి బెటరని కూడా అతడు అన్నాడు.

బుమ్రా బౌలింగ్‌లో ఔటవని ఖవాజా

నిజానికి ఖవాజా కామెంట్స్ వెనుక ఓ బలమైన కారణమే ఉంది. ఇప్పటి వరకూ ఏడు టెస్ట్ ఇన్నింగ్స్ లో బుమ్రాను ఖవాజా ఎదుర్కొన్నాడు. 155 బంతులు ఆడినా.. ఒక్కసారి కూడా బుమ్రాకు తన వికెట్ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో స్టార్ పేస్ బౌలర్ ను అతడు సులువుగా తీసి పారేశాడు.

"తొలిసారి అతన్ని ఎదుర్కొన్నప్పుడు అతని యాక్షన్ చూడాలి. అది కాస్త భిన్నంగా, వింతగా ఉంటుంది. ఇతర బౌలర్లతో పోలిస్తే అతని బాల్ రిలీజ్ పాయింట్ వేరుగా ఉంటుంది. కాస్త ముందుకు వచ్చి విసురుతున్నట్లుగా అనిపిస్తుంది. పాపింగ్ క్రీజు దగ్గరే చాలా మంది బంతి రిలీజ్ చేస్తారు.

కానీ బుమ్రా మాత్రం ఇంకాస్త ముందుకు వచ్చి వేస్తున్నట్లుగా ఉంటుంది. అందుకే బంతి ఊహించినదాని కంటే చాలా త్వరగా దూసుకొస్తున్నట్లు అనిపిస్తుంది. ఒకసారి అతని యాక్షన్ కు అలవాటు పడితే సులువే. అతని బౌలింగ్ లో చాలా ఆడాను. అతడు నన్ను ఔట్ చేయలేకపోయాడు" అని ఖవాజా అన్నాడు.

బుమ్రా బౌలింగ్ లో ఎవరైనా సులువుగా ఆడగలరని కూడా ఈ సందర్భంగా ఖవాజా చెప్పాడు. "ఎవరైనా ఆడొచ్చు. అయితే తొలిసారి అతన్ని ఎదుర్కొన్నప్పుడు మాత్రం కాస్త వింతగా అనిపిస్తుంది. కాస్త రిథమ్ అందుకున్నారంటే తర్వాత మెరగవుతారు. కానీ అతడో క్లాస్ బౌలర్" అని ఖవాజా అన్నాడు.

బుమ్రా కంటే షమి డేంజర్

అందరూ బుమ్రా గురించే మాట్లాడుతారు కానీ.. అతని కంటే షమి డేంజర్ అని కూడా ఈ సందర్భంగా ఖవాజా అనడం విశేషం. "అందరూ బుమ్రా గురించే మాట్లాడుతారు కానీ వాళ్ల దగ్గర చాలా మంది మంచి బౌలర్లు ఉన్నారు. షమి ఫిట్ గా ఉన్నప్పుడు అతన్ని తక్కువ అంచనా వేశారు. అతని గురించి ఎవరూ మాట్లాడలేదు" అని ఖవాజా అన్నాడు.

ఇక ఇండియన్ స్పిన్నర్లు కూడా పేసర్లకు అందించే సహకారంతో వాళ్ల బౌలింగ్ లైనప్ పటిష్టంగా ఉందని అతడు అభిప్రాయపడ్డాడు. బుమ్రాలాంటి బౌలర్లను ఎదుర్కొనే సమయంలో తన మైండ్ సెట్ ఎలా ఉంటుందో ఖవాజా వివరించాడు. "అతడు నన్ను ఎక్కడ ఔట్ చేస్తాడన్న ఆలోచన నాకు ఉండదు.

అతని బౌలింగ్ లో పరుగులు ఎలా చేయాలో ఆలోచిస్తా. అతడు లయ తప్పితే నేను లబ్ధి పొందుతాను. బాగా బౌలింగ్ చేస్తే గౌరవిస్తాను" అని ఖవాజా అన్నాడు. ఇండియా, ఆస్ట్రేలియా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరిగే ఐదు టెస్టుల్లో తొలి టెస్టు ఈ నెల 22 నుంచి పెర్త్ లో ప్రారంభం కానుంది.

Whats_app_banner