Team India: అతడొక్కడు వచ్చాడంటే ఇక టీమిండియాకు తిరుగుండదు: రవిశాస్త్రి కామెంట్స్ వైరల్
Team India: టీమిండియాలోకి ఆ ఒక్క బౌలర్ వచ్చాడంటే ఇక తిరుగే ఉండదని అన్నాడు మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి. ఇంతకీ అతడు ఆ బౌలర్ ఎవరో తెలుసా? స్టార్ పేస్ బౌలర్ మహ్మద్ షమి. గాయం కారణంగా అతడు పది నెలలుగా టీమ్ కు దూరంగా ఉన్నాడు.
Team India: బంగ్లాదేశ్ ను క్లీన్‌స్వీప్ చేసిన టీమిండియా స్వదేశంలో వరుసగా 18వ టెస్టు సిరీస్ గెలిచింది. వరుసగా మూడోసారీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ చేరేందుకు హాట్ ఫేవరెట్ గా నిలిచింది. ఈ నేపథ్యంలో టీమ్ మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి మహ్మద్ షమిని గుర్తు చేసుకున్నాడు. అసలుసిసలు వికెట్ టేకర్ అయిన షమి కూడా వస్తే ఇక ఇండియన్ టీమ్ కు తిరుగుండదని అతడు అనడం విశేషం.
కాన్పూర్‌లో దుమ్ము రేపేవాడే
మహ్మద్ షమి ఉండి ఉంటే కాన్పూర్ లో రెచ్చిపోయేవాడని ఈ సందర్భంగా రవిశాస్త్రి అన్నాడు. సర్జరీ తర్వాత గాయం నుంచి పూర్తిగా కోలుకున్న అతడు.. న్యూజిలాండ్ తో మూడు టెస్టుల సిరీస్ కు తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అమ్రోహాకు చెందిన షమి.. గ్రీన్ పార్క్ స్టేడియంలో ఎన్నో మ్యాచ్ లు ఆడాడని, అతడు ఉండి ఉంటే మరోలా ఉండేదని అభిప్రాయపడ్డాడు.
"వరల్డ్ క్రికెట్ లో షమికి ఉన్న సీమ్ ప్రజెంటేషన్ చాలా కొద్ది మందికే ఉంది. చాలా కాలంగా అతడు బౌలింగ్ చేస్తున్నాడు. ఇండియన్ టీమ్ పరంగా చూస్తే అతడు ఫూర్తి ఫిట్ గా ఉండాలని ఆశిద్దాం. వరల్డ్ కప్ లో అతడు ఎంత బాగా బౌలింగ్ చేశాడో మనం చూశాం. వైట్ బాల్ తోనే అలా చెలరేగాడు. అలాంటిది రివర్స్ స్వింగ్ అవుతున్న ఈ కండిషన్స్ లో షమి మరింత రెచ్చిపోయేవాడు. ఇక్కడ అతడు చాలా క్రికెట్ ఆడాడు. అతనికి ఈ కండిషన్స్ బాగా తెలుసు. అతడో అసలుసిసలు వికెట్ టేకర్" అని రవిశాస్త్రి అన్నాడు.
బుమ్రాతో కలిస్తే ఇక అంతే..
అటు దినేష్ కార్తీక్ కూడా రవిశాస్త్రి కామెంట్స్ తో ఏకీభవించాడు. షమిలాంటి బౌలర్ బుమ్రాతో కలిస్తే ఇక అంతే అని అన్నాడు. "మహ్మద్ షమి.. ఎంత అద్భుతమైన రికార్డు అతనికి ఉంది. బుమ్రాతో అతడు కలిస్తే తిరుగుండదు. నంబర్స్ చూస్తే అది తెలుస్తుంది" అని కార్తీక్ అభిప్రాయపడ్డాడు.
మహ్మద్ షమి గతేడాది వన్డే వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత ఇప్పటి వరకూ మళ్లీ క్రికెట్ ఆడలేదు. సర్జరీ తర్వాత ప్రస్తుతం అతడు రీహ్యాబిలిటేషన్ లో ఉన్నాడు. చాలా వరకు ఫిట్‌నెస్ సాధించాడు. ఏడాది చివర్లో జరగబోయే ఆస్ట్రేలియా పర్యటనలో షమి అవసరం ఎంతైనా ఉంది. అయితే అది జరగాలంటే అతడు న్యూజిలాండ్ తో సిరీస్ ఆడాల్సిందే.
మూడు టెస్టుల్లో కనీసం రెండు ఆడినా.. షమి ఆస్ట్రేలియాకు వెళ్లడం ఖాయం. చివరిసారి ఆస్ట్రేలియా వెళ్లినప్పుడు షమి కేవలం ఒక టెస్టు మాత్రమే ఆడి గాయం కారణంగా తిరిగి వచ్చేశాడు. కంగారూ గడ్డపై హ్యాట్రిక్ సిరీస్ విజయాలు సాధించాలంటే షమి కీలకం కానున్నాడు. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ సిరీస్ లో అతడు ఎలా రాణిస్తాడన్నది చూడాలి.