Periods | పీరియడ్స్ రక్తం రంగును బట్టి కూడా సంతాన లేమిని నిర్ధారించవచ్చు!
మహిళలకు నెలనెలా పీరియడ్స్ రూపంలో రక్తం బయటకు వెళ్తుంది. అయితే ఈ రక్తం రంగును బట్టి కూడా స్త్రీలలో వంధ్యత్వం, లేదా బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ లేదా లైంగికంగా సంక్రమించే వ్యాధులను నిర్ధారించవచ్చు అని డాక్టర్స్ అంటున్నారు. ఈ స్టోరీ పూర్తిగా చదివితే మీకే అర్థం అవుతుంది.
కౌమారదశ ముగించుకొని రజస్వల అయిన అమ్మాయిలు ప్రతినెలా ఎదుర్కొనే ఒక సమస్య పీరియడ్స్. ఈ సమయంలో యోని మార్గం నుంచి రక్తం బయటకు వస్తుంది. శరీరంలోని హార్మోన్ల మార్పుల వల్ల పీరియడ్స్ అనేవి కలుగుతాయి. ఇందుకు ప్రతి అమ్మాయికి ఆమె శరీర తత్వాన్ని బట్టి ఒక షెడ్యూల్ అంటూ ఉంటుంది. స్త్రీలలో అండాశయాలు ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్లను విడుదల చేస్తాయి. ఈ హార్మోన్లు గర్భాశయంలో లైనింగ్ నిర్మించడానికి కారణమవుతాయి. ఈ అంతర్నిర్మిత లైనింగ్ అండం ఫలదీకరణకు తోడ్పడుతుంది.
ఒకవేళ ఫలదీకరణ జరగకపోతే లైనింగ్ విరిగిపోయి రక్తస్రావం అవుతుంది. అండాశయం నుంచి విడుదలయ్యే ఈ రక్తాన్ని పీరియడ్స్ అంటారు. ఈ ప్రక్రియ జరగడానికి సుమారు నెలరోజులు పడుతుంది. అండం ఫలదీకరణ జరగపోతే గర్భాధారణ జరగనట్లు అని అర్థం. ఇలాంటి సందర్భంలో లైనింగ్ విచ్ఛిన్నం అవుతూ ప్రతినెలా రుతుస్రావం జరుగుతుంది. అందుకే స్త్రీలు ప్రతినెలా పీరియడ్స్ భరించాల్సి ఉంటుంది. ఈ సమయంలో కొన్ని టేబుల్ స్పూన్ల మలిన రక్తాన్ని వారు కోల్పోతారు. పీరియడ్స్ సమయంలో అమ్మాయిలు తమ ప్యాడ్, టాంపోన్ లేదా మెన్‌స్ట్రువల్ కప్‌ని రోజుకు 3-6 సార్లు మార్చుకోవాల్సి ఉంటుంది.
సాధారణంగా పీరియడ్స్ 5 రోజుల పాటు ఉంటుంది. కానీ కొంతమందికి తక్కువగా, మరి కొంతమందికి ఎక్కువ రోజులు కూడా ఉండవచ్చు. అయితే కొంతమంది స్త్రీలకు నెలసరి సరిగ్గా ఉండదు. కొన్నిసార్లు రెండు నెలలైనా వారికి పీరియడ్స్ రావు. కొన్నిసార్లు ఔషధాలు వాడితేనే పీరియడ్స్ కలుగుతాయి. ఇది హార్మోన్ల అసమతుల్యత వలన ఏర్పడుతుంది.
ఇంకా ఏదైనా అనారోగ్య సమస్య ఉన్నప్పుడు పీరియడ్స్ సమయంలో బయటకు విడుదలయ్యే రక్తం రంగులోనూ తేడా ఉంటుంది. ఇలా రంగులో తేడా ఉంటే అది స్త్రీలలో వంధ్యత్వం లేదా బ్యాక్టీరియా సంక్రమణ లేదా లైంగికంగా సంక్రమించే వ్యాధులకు సంకేతం అని కూడా గుర్తించవచ్చట.
డాక్టర్ అనన్య MBBS, MS OBG- ఆయు హెల్త్ హాస్పిటల్ వారు హెచ్‌టి లైఫ్‌స్టైల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పీరియడ్స్ రక్తం రంగు మారడం గురించి వివరించారు.
ప్రకాశవంతమైన ఎరుపు రంగు: పీరియడ్స్ ప్రారంభంలో తేలికపాటి పొత్తికడుపు నొప్పి ఉంటుంది. అదే సమయంలో ప్రకాశవంతమైన ఎరుపు రక్తస్రావంను గమనిస్తే అది గర్భస్రావం/ ఫైబ్రాయిడ్ గర్భాశయం / గర్భాశయ పాలిప్ /ఎక్టోపిక్ గర్భం తదితర పరిస్థితులను సూచిస్తుంది.
బ్రౌన్ లేదా బ్లాక్ మిష్ బ్రౌన్ కలర్: పీరియడ్స్ బ్లడ్ మొదట్లో ప్రకాశవంతమైన ఎరుపు రంగులో ఉంటుంది, పీరియడ్స్ పురోగమిస్తున్న కొద్దీ నెమ్మదిగా రక్తం గోధుమ లేదా నలుపు గోధుమ రంగులోకి మారుతుంది. గర్భాశయ లైనింగ్ నెమ్మదిగా పడిపోవడం లేదా మునుపటి రుతుచక్రపు లైనింగ్ అవశేషాలు బయటకు రావడం వలన కావచ్చు.
వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలి?
- పీరియడ్స్ బ్లడ్ రంగు అసాధారణమైన బూడిద, పసుపు, నారింజ, ఆకుపచ్చ రంగులో బయటకు వస్తున్నప్పుడు లేదా దుర్వాసనతో వస్తుంటే అది లైంగికంగా సంక్రమించే వ్యాధుల (STD)కు సంకేతం కావచ్చు. వెంటనే వైద్యులను సంప్రదించాలి.
- అలాగే తరచుగా పీరియడ్స్ మిస్ అవుతుంటే లేదా 7-8 రోజుల కంటే ఎక్కువ కాలం పాటు పీరియడ్స్ రావడం, ముద్దలు ముద్దలుగా పీరియడ్స్ రావడం ఉన్నప్పుడు ఫెర్టిలిటీ డాక్టరును సంప్రదించాలి.
సంబంధిత కథనం