Nighttime Routine | మీ పడకను ఆ పనికి మాత్రమే రిజర్వ్ చేయండి.. రాత్రికి ఇలా సెట్ చేసుకోండి!
Nighttime Routine: నిద్రవేళకు ముందు ఎలాంటి అలవాట్లు ఉండాలి, మీ పడకమంచాన్ని ఎందుకోసం ఉపయోగించాలి. సమ్మగా నిద్ర రావడానికి కొన్ని చిట్కాలు చూడండి.
Nighttime Routine: రాత్రి సరిగ్గా నిద్రపట్టక బెడ్‌లో ఎక్కువగా దొర్లుతున్నారా? ఈరోజు ఇది చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య. నేడు మనం అనుసరిస్తున్న జీవనశైలిలో నిద్ర ప్రాముఖ్యత గురించి మరింత అవగాహన అవసరం. ఎందుకంటే చెడు నిద్ర చక్రాలు మన ఆరోగ్యంపై వివిధ మార్గాల్లో ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. నిద్ర లేని రాత్రులు, అలసటతో కూడిన ఉదయం చాలా సమస్యలను కలిగిస్తుంది. సరైన నిద్రలేకపోవడం వలన ఊబకాయం, గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటిస్‌కు దారితీస్తుంది. ముఖ్యంగా మహిళల్లో త్వరగా మెనోపాజ్ రావడానికి గల ఒక కారణం నిద్రలేమి.
నిద్ర రాకపోవడానికి అనేక కారణాలు ఉండవచ్చు. కానీ కొన్ని దైనందిన జీవితంలో చిన్నచిన్న మార్పులు చేసుకోవడం, కొన్ని సాధారణ చిట్కాలు పాటించడం ద్వారా మీరు హాయిగా నిద్రపోవచ్చు. ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకోండి.
నిద్ర, సెక్స్ కోసం మీ బెడ్ రిజర్వ్ చేయండి
కొంతమంది రోజులో ఎక్కువ భాగం వారు పడుకునే బెడ్ పైనే ఉంటారు. ఫోన్ కాల్‌లకు సమాధానం ఇవ్వడానికి, ఇమెయిల్‌లకు ప్రతిస్పందించడానికి మీ పడకను కార్యాలయంగా ఉపయోగించవద్దు. దానిపైనే అర్థరాత్రి వరకు టీవీ చూడటం కూడా మానుకోండి. మంచం నిద్రపోవడానికి ఉద్దీపనగా ఉండాలి, మెలకువ కోసం కాదు. కాబట్టి మీ మంచాన్ని నిద్ర- సెక్స్ కోసం మాత్రమే రిజర్వ్ చేయండి. ఈ రెండు సందర్భాల్లో మినహా మీ మంచానికి దూరంగా ఉండండి.
పడకను సౌకర్యవంతంగా ఉంచండి
మీ పడకగదిలో టెలివిజన్ మాత్రమే పరధ్యానం కాదు. వాతావరణం మీ నిద్ర నాణ్యతను కూడా ప్రభావితం చేస్తుంది. కాబట్టి మీ పడకగది వీలైనంత సౌకర్యవంతంగా ఉండేలా చూసుకోండి. పడకగది నిశ్శబ్దంగా, చీకటిగా, చల్లని వాతావరణంతో ఉండాలి. ఇవన్నీ నిద్రావస్థను ప్రోత్సహిస్తాయి.
కథలు చదవండి లేదా వినండి
మీరు చిన్నతనంలో ఉన్నప్పుడు మీ అమ్మమ్మ తాతయ్యలు లేదా మీ తల్లి మీకు రాత్రిపూట ఏవైనా కథలు చెబుతూ ఉండేవారు కావచ్చు. ఈ ఓదార్పునిచ్చే ఆచారం మిమ్మల్ని నిద్రపోయేలా చేసింది. వయసు పెరిగినప్పటికీ కూడా దీని ప్రభావం మీపై ఉంటుంది. కాబట్టి మీరు మంచం ఎక్కి నిద్రపోయే ముందు ఏవైనా కథలు చదవండి లేదా వినండి లేదా ప్రశాంతమైన సంగీతాన్ని వినండి.
ఒక గ్లాసు పాలు తాగండి
ట్రిప్టోఫాన్, మెలటోనిన్ అనేవి పాలలోని రెండు సమ్మేళనాలు నిద్ర కలిగించడానికి సహాయపడతాయి. ఇవి మీ మానసిక స్థితిని మెరుగుపరుస్తాయి, విశ్రాంతిని ప్రోత్సహిస్తాయి. కాబట్టి నిద్రవేళకు ముందు ఒక గ్లాసు గోరువెచ్చని పాలు తాగండి.
రాత్రికి తినండి, కానీ తక్కువగా
నిద్రవేళకు రెండు లేదా మూడు గంటలలోపు భారీ భోజనం చేయడం మానుకోండి. మీరు పడుకునే ముందు ఆకలితో ఉన్నట్లయితే, అల్పాహారం తీసుకోండి. ఆపిల్ లేదా కొన్ని హోల్-వీట్ క్రాకర్స్ వంటి ఆరోగ్యకరమైన చిరుతిండిని మాత్రమే తినండి. చక్కెర ఎక్కువ కలిగినవి, కెఫీన్ కలిగిన పానీయాలు, ఆల్కాహల్ పానీయాలకు దూరంగా ఉండండి. ఇవి రాత్రి సమయంలో మీ నిద్రకు భంగం కలిగిస్తాయి. అలాగే మీకు గుండెల్లో మంటను కలిగించే సిట్రస్ పండ్లు, పండ్ల రసాలు వంటివి, మసాలా పదార్థాలకు దూరంగా ఉండండి.
చివరగా ఒక్కమాట.. పగటి కలలు రాత్రివేళ వద్దు, పగటి ఆలోచనలు, ఆందోళనలను నిద్రవేళకు ముందు వదిలేయండి. తియ్యని కలలు కంటూ హయిగా నిద్రపోండి.
సంబంధిత కథనం