Stress Busters | రోజంతా పని ఒత్తిడితో అలసిన మనసుకు విశ్రాంతి కలిగించే మార్గాలు ఇవిగో!
Stress Busters: రోజంతా పని ఒత్తిడితో సతమతమవుతున్నారా? ఆందోళన వద్దు. మీ మనసును, తనువును శాంతపరిచి, మీరు మంచి విశ్రాంతిని పొందేందుకు మార్గాలు చూడండి.
Stress Busters: ఉదయం సూర్యోదయానికి ముందు నిద్రలేచిన దగ్గరి నుంచి, మళ్లీ సూర్యాస్తమయం అయ్యే వరకు రోజంతా అనేక పనులు. ఆఫీసుకు వెళ్లడం, ట్రాఫిక్ జామ్‌లను ఛేదించడం, గంటల కొద్దీ కంప్యూటర్ల ముందు పనిచేయడం, మళ్లీ ట్రాఫిక్ గండాలను ఎదుర్కోవడం, చివరకు ఎప్పుడో చీకటి పడేటపుడు ఇంటికి చేరుకోవడం.. ఇలా చాలా మందికి జీవితాలు తమ వృత్తిజీవితంతోనే గడిచిపోతున్నాయి. ఈ మధ్యలో ఇంటి పనులు చూసుకోవడం, కుటుంబ సభ్యులను చూసుకోవడం అన్నీ కలిపి తలను ఖైమా చేసేంత ఒత్తిడిని కలిగిస్తాయి.
జీవితం ఎప్పుడూ ఒత్తిడితో కూడుకున్నదే. ఈ రోజూవారి ఒత్తిడిని ఎదుర్కొనేందుకు మీ శరీరానికి మాత్రమే కాకుండా మీ మనసుకు కూడా విశ్రాంతి కల్పించడం అవసరం. మీ తనువు, మనస్సులను శాంతపరిచే కొన్ని మార్గాలు ఇక్కడ చూడండి.
1. ధ్యానం- Mindful Meditation
శరీరానికి, మనసుకు రెండింటికీ విశ్రాంతినిచ్చే చక్కటి వ్యాయామం ధ్యానం. రోజంతా పనిచేసి, అలసిపోయి ఇంటికి వచ్చినపుడు ప్రశాంతంగా కూర్చొని కొన్ని నిమిషాలు ధ్యానం చేయండి. మనస్సును శాంతపరచడానికి, ఒత్తిడిని తగ్గించడానికి, మీ శ్రేయస్సును మెరుగుపరచడానికి ఈ మైండ్‌ఫుల్‌నెస్ టెక్నిక్‌ని సాధన చేయాలి. ఇది దీనికి ఎక్కువ శారీరక శ్రమ అవసరం లేదు. మీ మనస్సును ప్రశాంతంగా ఉంచడానికి, విశ్రాంతిని కల్పించడానికి వివిధ యోగాసనాలు కూడా ప్రభావం చూపుతాయి.
2. చిన్నపిల్లలతో సమయం గడపండి- Play With Kids
మీ ఇంట్లో ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే వారే మీస్ట్రెస్ బస్టర్స్. వారిని కౌగిలించుకోండి, వారితో కాసేపు ఆడుకోండి. లేదా మీ పెంపుడు జంతువుతో కూడా ఆడుకోవచ్చు. మీరు అనుభవిస్తున్న ఒత్తిడి, ఆందోళన, బాధల గురించి మీ పెట్ తో మాట్లాడండి. వారు తిరిగి మాట్లాడలేనప్పటికీ, మీరు ఒక రకమైన ఊరట పొందుతారు.
3. గోరు వెచ్చని స్నానం చేయండి- Take a Shower Bath
మీ శరీరాన్ని బబుల్ బాత్‌లో నానబెట్టి హాయిగా విశ్రాంతి తీసుకోండి. లేదా చల్లని షవర్ కింద ఉండండి. మంచి సువాసన కలిగిన సబ్బులు, బాతింగ్ లవణాలతో స్నానం చేయండి. స్నానం చేస్తూనే మంచి సంగీతాన్ని ప్లే చేయండి, కాసేపు అలా ఎంజాయ్ చేయండి.
4. ఒక కప్పు టీ తాగండి- Have A Cup of Tea
మీ బాల్కనీలో కూర్చొని ఒక వేడివేడి కప్పు టీని ఆస్వాదించండి. సాధారణ టీకి బదులుగా హెర్బల్ టీలు తాగితే మరీ మంచిది. అనేక రకాల హెర్బల్ టీలు విశ్రాంతి భావాలను ప్రోత్సహించడంలో, మీ అలసటను తగ్గించడంలో సహాయపడతాయి. గ్రీన్ టీ, ఊలాంగ్ టీ, బ్లాక్ టీలతో సహా కొన్ని టీలలో ఎల్-థియానైన్ అనే అమినో యాసిడ్ ఉంటుంది, ఇది మీ మూడ్ ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
5. స్నేహితుడితో మాట్లాడండి- Talk To A Friend
ఎవరైనా దూరపు స్నేహితుడికి ఫోన్ చేసి మాట్లాడండి, వారి క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకోండి. మీకు సంబంధించిన ఏవైనా కథలు చెప్పండి, వారు ఉండే చోటులో జరిగే విశేషాలను అడిగి తెలుసుకోండి. స్నేహితులతో క్షేమ సమాచారాలు తెలుసుకోవడం, విశేషాలు పంచుకోవడం కూడా మీ మనసును రిలాక్స్ చేస్తాయి.
6. గార్డెనింగ్ చేయండి- Gardening
మీ ఇంట్లో మొక్కలకు నీరు పోయడం, కేర్ చేయడం కూడా మంచిదే. గార్డెనింగ్ ఎంతో ఆహ్లాదకరమైనది, గార్డెనింగ్ చేసే వ్యక్తుల్లో శారీరక, మానసిక ఆరోగ్యం ఎంతో మెరుగ్గా ఉంటుందని. ఇదిక్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు, ఇతర మానసిక రుగ్మతలను నివారించడంలోనూ ముఖ్య పాత్ర పోషిస్తుందని ఇటీవలి అధ్యయనాలు పేర్కొన్నాయి.
నేటి డిజిటల్ ప్రపంచంలో ఎలక్ట్రానిక్ పరికరాలు, స్ట్రీమింగ్ సాధనాలను నుండి మిమ్మల్ని మీరు అన్‌ప్లగ్ చేసుకోవడం మీకు కష్టంగా అనిపించవచ్చు. కానీ వాటిని పక్కనబెట్టి, పైన పేర్కొన్న చిట్కాలు ప్రాక్టీస్ చేయడం నేర్చుకోండి. కొన్నిరోజుల్లోనే మీలో మార్పును గమనిస్తారు.
సంబంధిత కథనం