మీ సబ్బులో ఉప్పుందా? ఉప్పునీటితో స్నానం చేయడం ద్వారా కలిగే ప్రయోజనాలు
ఉప్పునీటి స్నానాల గురించి విన్నారా? మనం స్నానం చేయడానికి రకరకాల సబ్బులు, షవర్ జెల్స్ ఉపయోగిస్తాం, కానీ ఉప్పుతో స్నానం చేయడం ద్వారా కలిగే ప్రయోజనాల గురించి తెలుసా? ఇలా స్నానం చేయడానికి కూడా ఎన్నో రకాల లవణాలు అందుబాటులో ఉన్నాయి.
ప్రతిరోజూ ఒకటికి రెండు సార్లు స్నానం చేయడం అనేది ఆరోగ్యమైన జీవనశైలిలో ఒక భాగం. శరీరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా చర్మ సమస్యలు దరిచేరకపోవడంతో పాటు మానసిక ఉల్లాసం లభిస్తుంది. ఇదిలాఉంటే, మీరెప్పుడైనా ఉప్పునీటి స్నానాల గురించి విన్నారా? మనం స్నానం చేయడానికి రకరకాల సబ్బులు, షవర్ జెల్స్ ఉపయోగిస్తాం, కానీ ఉప్పుతో స్నానం చేయడం ద్వాత రా కలిగే ప్రయోజనాల గురించి తెలుసా? ఇలా స్నానం చేయడానికి కూడా ఎన్నో రకాల లవణాలు అందుబాటులో ఉన్నాయి.
బాత్ సాల్ట్..
మనదేశంలో బాత్ టబ్ లో స్నానం చేయడం చాలా అరుదు, చాలా కొద్ది మంది మాత్రమే అలాంటి విలాసవంతమైన విధానాన్ని అనుసరిస్తారు. అలా బాత్ టబ్ లలో స్నానం చేసే చోట బాత్ సాల్ట్‌ల వినియోగం ఎక్కువగా ఉంటుంది. సుగంధద్రవ్యాలను ఉపయోగించి చేసే ఈ ఉప్పును మనం స్నానం చేసే నీటిలో కలుపుకొని కొంతసేపు ఉంచాలి. అనంతరం ఆ నీటితో స్నానం చేయడం ద్వారా శరీరం అందులోని ఖనిజ లవణాలను శోషిస్తుంది. ఇది ఒక థెరపీ లాగా పని చేసి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంతో పాటు మరెన్నో శారీరక, మానసిక ఆరోగ్య ప్రయోజనాలు కలిగిస్తుంది. ఈ రకమైన స్నానాన్ని బాలెనోథెరపీ కూడా అంటారు.
అయితే అందరికీ బాత్ టబ్ లో స్నానం సాధ్యం కాకపోవచ్చు, అలాంటపుడు మనం స్నానం చేసే ఒక బకెట్ నీటిలో కొంత ఉప్పు కలిపితే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
జుట్టురాలడం తగ్గించవచ్చు
కొంత మంది తమకు నీరు పడట్లేదు, చర్మం నల్లగా మారుతుంది, జుట్టు ఊడిపోతుంది లాంటి సమస్యలు చెబుతారు. అయితే ఉప్పునీటితో స్నానం చేయడం ద్వారా అలాంటి సమస్యలను కొద్దిగా తగ్గించవచ్చునని నిపుణులు అంటున్నారు. నది లేదా చెరువు నుంచి సరఫరా అయ్యే జలం పలుచగా ఉంటుంది. దీనితో ఎలాంటి సమస్య ఉండదు. బోర్ నుంచి వచ్చే జలం కొంత కఠినంగా ఉంటుంది. ఈ నీటితో స్నానం చేయడం ద్వారా సమస్యలు వస్తున్నాయనుకుంటే బకెట్ గోరువెచ్చని నీటిలో కొద్దిగా ఉప్పు చేర్చండి. ఉప్పులో ఉండే సోడియం, పొటాషియం కఠిన జలంలో ఉండే కాల్షియం, మెగ్నీషియంతో చర్యజరిపి అయాన్‌లను భర్తీ చేస్తుంది. దీనివల్ల ఇక్కడ నీరు సమతుల్యమై అందులోని కాఠిన్యాన్ని తీసివేస్తుంది.
కండరాల ఒత్తిడి తగ్గిస్తుంది
కాళ్ల కండరాలు పట్టేసినపుడు గోరువెచ్చని నీటిలో కొద్దిగా సముద్రపు ఉప్పును వేసి ఆ నీటిలో కాసేపు మీ పాదాలను ఉంచినపుడు ఎంతో ఉపశమనం లభిస్తుంది. భుజాల నొప్పి, ఒళ్లు నొప్పులు ఉన్నపుడు కూడా గోరువెచ్చటి ఉప్పునీటితో స్నానం చేస్తే కండరాలు సడలింపు జరిగి, నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
ఆరోగ్యమైన చర్మం కోసం
మామూలు నీటికి బదులు లవణాలు కలిగిన నీటితో స్నానం చేస్తే చర్మం మృదువుగా మారుతుంది. దురద, చికాకు ఇతర చర్మ సమస్యలు దూరమవుతాయి. శరీరం లవణాలను శోషించుకుంటుంది కాబట్టి అందులో ఉండే మినరల్స్ మీ చర్మం ఆరోగ్యంగా, హైడ్రేటెడ్‌గా ఉండటానికి సహాయపడుతుంది.
ఇవే కాకుండా సముద్రపు లవణాలతో స్నానం చేస్తే రక్త ప్రసరణ మెరుగుపడుతుంది, కండరాల తిమ్మిరిని తగ్గిస్తుంది, కీళ్లలో దృఢత్వం పెరిగి ఆర్థరైటిస్ లేదా వెన్నునొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు. శరీరంలోని మలినాలు తొలగిపోయి అతిపెద్ద అవయమైన-మీ చర్మాన్ని శుభ్రపరచడానికి, డీటాక్సిఫై చేయడానికి సహాయపడుతుంది.
కొద్దిసేపు సముద్రపు అలల వద్ద మీ శరీరాన్ని ఉంచినపుడు కూడా ఇలాంటి ప్రయోజనాలు కనిపిస్తాయి. సముద్రం అనేక లవణాలకు సహజసిద్ధమైన వనరు. అయితే మీకు సముద్రం అందుబాటులో లేనపుడు మార్కెట్లో సీ సాల్ట్, ఈప్సమ్ సాల్ట్, హిమాలయన్ పింక్ సాల్ట్ లాంటి బాత్ సాల్ట్స్ ఉపయోగించవచ్చు.
ఇదంతా తెలిస్తే.. మీ టూత్ పేస్టులో ఉప్పుందా అనే ప్రకటన లాగా, మీ సబ్బులో ఉప్పుందా అని ప్రకటనలు కూడా రావొచ్చేమో. అయితే ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే.. ప్రతిరోజు ఉప్పునీటితో స్నానం కూడా మంచిది కాదు, వారానికి లేదా రెండు వారాలకోసారి చేయాలి. నీరు మరీ వేడిగా కాకుండా గోరువెచ్చగా ఉండేలా చూసుకుంటే మానసిక ప్రశాంతత లభిస్తుంది.
సంబంధిత కథనం