Hug Day 2023 | ఒక వెచ్చని కౌగిలింతతో కలిగే ప్రయోజనాలు ఎన్నో!
Hug Day 2023: వాలెంటైన్స్ వారంలో ఈరోజు హగ్ డే. కౌగిలించుకొని ప్రేమను వ్యక్తపరిచే రోజు ఇది. అయితే ఒక చిన్న కౌగిలింతతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయట, రోజుకి ఎన్ని కౌగిళ్ళు అవసరమో కూడా చెబుతున్నారు. ఇంకా చదవండి..
Hug Day 2023: ఇది ప్రేమికుల వారం, ప్రేమికుల రోజు (Valentine's Day) కు వారం రోజుల ముందు నుంచే ప్రేమికులు ఒక వారం పాటు వివిధ రూపాలలో తమ ప్రేమను వ్యక్తం చేస్తూ వేడుక చేసుకుంటారు. ఈ వరుసలో ఫిబ్రవరి 12న కౌగిలింత రోజు (Hug Day) గా జరుపుకుంటారు. మన ప్రేమ, ఆప్యాయతలను మాటల్లో చెప్పలేనపుడు ఒక కౌగిలింత ఇవ్వడం ద్వారా ఆత్మీయంగా వ్యక్తపరిచినట్లు అవుతుంది. ఒక కౌగిలింత ఎన్నో అర్థాలను సూచిస్తుంది.
మన స్నేహితులు లేదా ఆత్మ బంధువులను స్వాగతం పలుకుతూ, క్షేమమేనా అంటూ ఆత్మీయంగా ఆలింగనం చేసుకుంటారు. శుభాభినందనలు తెలియజేయటానికి వ్యక్తిని దగ్గరికి తీసుకుంటారు. ప్రేమ, భయం, బాధ, విచారం ఇలా ఎలాంటి భావోద్వేగాన్ని వ్యక్తపరచటానికైనా కౌగిలింత అనేది ఒక గొప్ప భావవ్యక్తీకరణగా ఉంటుంది.
అంతేకాదు, ఒకరికి కౌగిలింత ఇవ్వడం ద్వారా అనేక ప్రయోజనాలు కూడా ఉంటాయని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. బాధ, విచారణలో ఉన్నపుడు ఇచ్చే కౌగిలింతతో గొప్ప ఊరట, ఉపశమనం లభిస్తుంది, ప్రేమతో ఇచ్చే కౌగిలింతతో సాన్నిహిత్యం పెరుగుతుంది బంధాలు బలపడతాయి.
Hugging Benefits- కౌగిలితో కలిగే ప్రయోజనాలు
ప్రియమైన వ్యక్తి అందించే ఒక వెచ్చని కౌగిలింతతో ఇంకా ఎన్ని ప్రయోజనాలు ఉంటాయో ఇక్కడ చూడండి.
కౌగిలింత ఒత్తిడిని తగ్గిస్తుంది
మీ ప్రియమైన వ్యక్తి జీవితంలో బాధాకరమైన సంఘటనలతో ఒత్తిడి, ఆందోళనలను ఎదుర్కొంటే వారిని గట్టిగా హత్తుకోండి. మీ వెచ్చటి స్పర్శ ద్వారా వారు బాధ నుంచి సాంత్వన పొందుతారు, ఇది వారిలో ఒత్తిడిని తగ్గించి, ఓదార్పు భావాన్ని ఇస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.
రోగాలను నయం చేస్తుంది
కౌగిలింతలు ఒత్తిడి-తగ్గించే ప్రభావాలను కలిగి ఉండటం ద్వారా అవి మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడానికి కూడా పని చేస్తాయి. ఒక అధ్యయనం ప్రకారం, వివిధ అనారోగ్యాలతో బాధపడుతున్న 400 మంది పెద్దలను ప్రతిరోజూ కౌగిలించుకోవడం వారిలో రికవరీ రేటు గణనీయంగా మెరుగుపడినట్లు వెల్లడైంది. వారిలో రోగ లక్షణాల తీవ్రత తగ్గింది, రోగనిరోధక శక్తి పెరిగింది.
గుండె ఆరోగ్యానికి మంచిది
ప్రేమించే వ్యక్తులను కౌగిలించుకోవడం ద్వారా గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందని అధ్యయనాలు పేర్కొన్నాయి. తమ ప్రియమైన భాగస్వామి 10 నిమిషాల పాటు హగ్ చేసుకోవడం ద్వారా అధిక రక్తపోటు స్థాయిలు అదుపులోకి వస్తాయి, హృదయ స్పందనలు సాధారణ స్థితిలోకి వస్తాయని నివేదికలు పేర్కొన్నాయి.
కౌగిలింతలు సంతోషపరుస్తాయి
ఆనందం కలిగినపుడు శరీరంలో ఆక్సిటోసిన్ అనే రసాయనం విడుదలవుతుంది. ఈ రసాయనం మనలోని ఒత్తిడి, బాధలను ఒక్కసారిగా తీసివేసి మనల్ని ఆనందంలో ముంచెత్తుతుంది, సంతషంగా ఉంచుతుంది. మహిళలు తమ శిశువులను దగ్గరకు తీసుకున్నప్పుడు, ఇష్టమైన వ్యక్తిని కౌగిలించుకున్నప్పుడు వారిలో ఆక్సిటోసిన్ విడుదలవుతున్నట్లు పరిశోధకులు గమనించారు.అదే సమయంలో పురుషులు, తమకు నచ్చిన అమ్మాయిని పక్కన కూర్చున్నప్పుడు, వారితో మాట్లాడుతున్నపుడు, వారు తాకినపుడు లేదా వారిని కౌగిలించుకున్నపుడు ఆక్సిటోసిన్ సానుకూల ప్రభావాలను ఉన్నట్లు పరిశోధకులు తమ నివేదికల్లో పొందుపరిచారు.
రోజుకి ఎన్ని కౌగిలింతలు అవసరం?
ఫ్యామిలీ థెరపిస్ట్ వర్జీనియా సతీర్ ప్రకారం, మనం ఆరోగ్యంగా బ్రతకడానికి రోజుకు కనీసం నాలుగు కౌగిలింతలు కావాలని పేర్కొన్నారు. వివిధ సమస్యలను ఎదుర్కొంటున్నపుడు రోజుకి 8, మెరుగైన జీవితం కోసం రోజుకు 12 కౌగిలింతలు అవసరం అవుతాయి.
మరి, ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పుడు మీ భాగస్వామికి మీ వెచ్చని కౌగిలిలో బంధించండి, మీ బంధాన్ని ఆరోగ్యంగా ఉంచుకోండి.
సంబంధిత కథనం