Relaxation Techniques । మీ మనసును శాంతపరిచి, మీకు విశ్రాంతి కలిగించే పద్ధతులు ఇవిగో!
Relaxation Techniques: సెలవు రోజు కూడా సరైన విశ్రాంతి పొందలేకపోతున్నారా? మీ ఒత్తిడిని తొలగించి, మీ మనసును శాంతపరిచి, మీకు విశ్రాంతి కలిగించే కొన్ని పద్ధతులు ఇక్కడ చూడండి.
వీకెండ్ వచ్చిందంటే ఎవరికైనా కలిగే భావన రిలాక్సేషన్. వారం అంతా వివిధ రకాల పని ఒత్తిళ్లు, ఆఫీస్ చికాకులు అనుభవించిన తర్వాత, వారాంతంలో వచ్చిన సెలవు రోజున ఆ చికాకులన్నీ పక్కనపెట్టి హాయిగా కాస్త విశ్రాంతి తీసుకోవాలని అనిపిస్తుంది. అయినప్పటికీ వారాంతంలో కూడా ఇంటి పనులు, సొంత పనులతో కొంత ఒత్తిడి అనేది ఉంటుంది, మనశ్శాంతి అనేది కరువు అవుతుంది. మీరు ఈ ఒత్తిడి నుంచి బయటడి, హాయిగా విశ్రాంతి పొందాలంటే కొన్ని రకాల రిలాక్సేషన్ పద్ధతులు ఉపయోగపడతాయి. విశ్రాంతి అనేది మన మనశ్శాంతిని మనమే ఆస్వాదించడం. దైనందిన జీవితంలో ప్రతీ వ్యక్తికి విశ్రాంతి అనేది అవసరం. ఇది మీ మనస్సు, శరీరంపై ఒత్తిడి ప్రభావాలను తగ్గించే ప్రక్రియ. రిలాక్సేషన్ టెక్నిక్‌లు ఒత్తిడి నిర్వహణలో సహాయపడే గొప్ప మార్గం. ఈ పద్ధతులు గుండె జబ్బులు, గుండె నొప్పి, గాయం వంటి వివిధ దీర్ఘకాలిక శారీరక, మానసిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగించడంలో సహాయపడతాయి.
రిలాక్సేషన్ టెక్నిక్‌లను ఉపయోగించి మీరు చేయవలసిందల్లా మీ శరీరాన్ని సడలించడం. ఈ పద్ధతులు మీ శరీర సహజ సడలింపు ప్రతిస్పందనను సక్రియం చేయగలవు. ఇది ఒత్తిడిని అడ్డుకుంటుంది, మీ మనస్సును శాంతపరుస్తుంది, మీ శరీరాన్ని తిరిగి సమతుల్యతలోకి తీసుకువస్తుంది.
Relaxation Techniques- విశ్రాంతిని అనుభూతి చెందే పద్ధతులు
మసాజ్, ధ్యానం, తాయ్ చి, యోగా, అరోమాథెరపీ, హైడ్రోథెరపీ, బయోఫీడ్బ్యాక్, సంగీతం, కళలు, వ్యాయామాలు మొదలైనవి ఎన్నో మీకు విశ్రాంతి కలిగిస్తాయి. అయితే విశ్రాంతి కలిగించే కొన్ని సరళమైన పద్ధతులు కూడా ఉన్నాయి. రిలాక్సేషన్ టెక్నిక్‌ల కోసం ఇక్కడ కొన్ని ఉదాహరణలు అందిస్తున్నాం చూడండి.
లోతైన శ్వాసను ప్రాక్టీస్ చేయండి
మీరు పరధ్యానంలో ఉన్నారా? లోతైన శ్వాస ప్రయత్నించండి. లోతైన శ్వాసలు తీసుకోవడం అనేది సరళమైన, శక్తివంతమైన రిలాక్సేషన్ టెక్నిక్. మీరు ఇలా చేస్తున్నప్పుడు మీ మనస్సును భావోద్వేగాలు, ప్రతికూల ఆలోచనల నుండి విడదీయడంపై దృష్టి పెడతారు. ఈ రకమైన శ్వాస వ్యాయామం నిద్రలేమి సమస్యలు, భోజనం సరిగా చేయని లేదా అతిగా తినడం వంటి సమస్యలు ఉన్నవారికి ప్రత్యేకంగా సహాయపడుతుంది.
బాడీ స్కాన్ మెడిటేషన్
మీరు తరచుగా ఒత్తిడి కారణంగా మీ శరీరం ప్రదర్శించే సంకేతాలను విస్మరిస్తున్నారా? ఇది త్వరలో తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. బాడీ స్కాన్ మెడిటేషన్ అనేది మీరు మీలోలోపల అనుభవిస్తున్న, మీరు గుర్తించలేని టెన్షన్‌ను, మీ మానసిక వ్యధను విడుదల చేయడానికి ఒక గొప్ప మార్గం. ఈ టెక్నిక్‌లో బొటనవేలు నుండి ప్రారంభించి,తల వరకు వివిధ శరీర భాగాలను సక్రియం చేస్తూ శారీరక అనుభూతులను క్రమక్రమం గాకదిలించడం జరుగుతుంది.
గైడెడ్ ఇమేజరీ
మీరు మీ మనసులో ఒక సుందర దృశ్యాన్ని ఊహించుకోవడం ద్వారా మీ ఒత్తిడి స్థాయిలు తగ్గుతాయని మీకు తెలుసా? సౌందర్య లహరి స్వప్న సుందరి అంటూ కలలను ఊహించుకోవడం ద్వారా ఒక మంచి అనుభూతి కలుగుతుంది. పారిస్ వెళ్లి ఈఫిల్ టవర్ మీద సెల్ఫీ తీసుకోవాలనే ఊహ ఎంతో బాగుంటుంది. దీనినే 'గైడెడ్ ఇమేజరీ' అంటారు. ఈ ప్రత్యేకమైన రిలాక్సేషన్ టెక్నిక్ ద్వారా, మీరు ఏకాగ్రత, విశ్రాంతి తీసుకోవడానికి మీ మనస్సులో సుందరమైన ప్రదేశాలు, చిత్రాలను ఊహించుకుంటారు.
మైండ్‌ఫుల్‌నెస్ మెడిటేషన్
ఇది చాలా ప్రజాదరణ పొందిన రిలాక్సేషన్ టెక్నిక్. ఇది ధ్యానం చేసే పద్ధతుల్లో ఒక పద్ధతి. ఈ మైండ్‌ఫుల్‌నెస్ మెడిటేషన్ మీలోని బుద్ధిని తట్టిలేపుతుంది. గతాన్ని, భవిష్యత్తును మరిచిపోయి ప్రస్తుత క్షణాలను మీ పంచేంద్రియాల ద్వారా మీరు అనుభవించగలిగడం ఇందులో ప్రధానం. మీ కళ్ళు ఏమి చూస్తున్నాయి? మీరు కళ్లు మూసుకున్నప్పుడు ఏం కనిపిస్తుంది. మీరు చేతులతో తాకుతున్నది ఏమిటి? అది మీకు ఎలాంటి అనుభూతులు కలిగిస్తుంది? మీ చుట్టూ ఉన్న వాసనలు ఏమిటి, అవి మిమ్మల్ని రిలాక్స్‌గా ఉంచుతున్నాయా లేదా ఒత్తిడికి గురిచేస్తున్నాయా? ఇలా ఈ ధ్యానం భావోద్వేగాలన్నింటినీ తాకి, ఆపై మీరు ఒత్తిడి అధిగమించడంలో మీకు సహాయపడుతుంది. చాలా విశ్రాంతిగా అనుభూతి చెందుతారు.
మ్యూజిక్ థెరపీ
ఉదయం లేచిన దగ్గర్నించీ ఒక్కొక్కరి మూడ్ ఒక్కోలా ఉంటుంది. మూడ్ మారాలంటే కొన్ని సార్లు అది మన నియంత్రణలో ఉండకపోవచ్చు. కానీ సంగీతానికి ఆ శక్తి ఉంది. మీరు ఎలాంటి వాతావరణాన్నైనా ఆహ్లాదకరంగా మార్చాలనుకుంటే సంగీతం ఒక్కటే సాధనం. ఇది మీ మానసిక స్థితిని మార్చగలదు, మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. మనకు తెలియకుండానే సంగీతం మన మనస్సుపై మంచి ప్రభావాన్ని చూపుతుంది. మధురమైన సంగీతం మీ మెదడులో ఎండార్ఫిన్‌లను విడుదల చేయడమే దీనికి కారణం. స్లో టెంపోతో సాగే శ్రావ్యమైన ఇన్స్ ట్రుమెంటల్ మ్యూజిక్ ద్వారా మీ అలసట దూరం అవుతుంది. మీ ఒత్తిడి, ఆందోళన తగ్గిపోయి ప్రశాంతంగా ఉంటారు. దీంతో మీకు మంచి విశ్రాంతి లభించిన అనుభూతి ఉంటుంది.
సంబంధిత కథనం
టాపిక్