Telugu News  /  Lifestyle  /  Practicing Daily 5 Minutes Of Breathing Exercises Like Pranayama Will Make Wonders For Your Health
Breathing Exercises
Breathing Exercises (iStock)

Breathing Exercises । ప్రతిరోజూ 5 నిమిషాలు శ్వాస వ్యాయామాలు చేయండి చాలు.. ఎన్నో ప్రయోజనాలు!

29 December 2022, 15:20 ISTHT Telugu Desk
29 December 2022, 15:20 IST

Breathing Exercises: ప్రతిరోజూ కేవలం 2-5 నిమిషాల పాటు శ్వాస వ్యాయామాలు చేయడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

ఈ శీతాకాలంలో ఉదయం వేళ కొన్ని చోట్ల తీవ్రమైన చలిగాలులు వీస్తున్నాయి, అంతటి చల్లటి వాతావరణంలో బయటకు వెళ్లాలంటే కూడా కష్టంగా ఉంటుంది. చాలా మంది మార్నింగ్ వాక్‌లు చేసే అలవాటు ఉన్నవారు ఉదయం వేళల్లో నడకకు వెళ్లడం ఇప్పటికే మానేసి ఉండవచ్చు. వాతావరణం చల్లగా ఉంటే త్వరగా లేవాలనిపించదు, ఏ పని చేయాలనిపించదు, సోమరితనం పెరుగుతుంది. ఆహార ప్రణాళికలు కూడా మారిపోతాయి. ఇలాంటపుడు ఫిట్‌నెస్ కూడా దెబ్బతింటుంది. ఈరోజుల్లో ప్రతీ ఒక్కరికి ఫిట్‌నెస్ అనేది చాలా కీలకమైనది. ఎవరికి ఏ అనారోగ్యం ముంచుకొస్తుందో చెప్పలేం. శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గడం వలన వారి ఆరోగ్యానికి రక్షణ కరువు అవుతుంది. తరచూ ఇన్ఫెక్షన్ల బారినపడటం, మధుమేహం, గుండె జబ్బులు అనేవి సర్వసాధారణమైపోయాయి. అందువల్ల ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండటం చాలా ముఖ్యం.

ట్రెండింగ్ వార్తలు

మీకు బయటకు వెళ్లి వ్యాయామం చేసేంత సమయం లేకపోతే ఇంట్లో ఉండి కూడా మీ ఫిట్‌నెస్ ని కాపాడుకోవచ్చు. మీరు ఫిట్‌గా ఉండటానికి ఇంట్లోనే శ్వాస వ్యాయామాలు చేయవచ్చు. ఇందుకు ఎక్కువ సమయం కూడా అవసరం లేదు. ప్రతిరోజూ కేవలం 2-5 నిమిషాల పాటు శ్వాస వ్యాయామాలు చేయడం ద్వారా మీ శరీరాన్ని కూడా మీ మనసును ఫిట్‌గా ఉంచుకోవచ్చు. నెమ్మదిగా మీ సౌకర్యాన్ని బట్టి వ్యాయామ సమయాన్ని పొడగించుకోవచ్చు. లేదా మీకు సమయం దొరికినపుడే రోజులో రెండు సార్లు కొన్ని నిమిషాలు ప్రాక్టీస్ చేయండి.

Breathing Exercises Benefits- శ్వాస వ్యాయామాలతో ప్రయోజనాలు

శ్వాస వ్యాయామాలు చేయడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి, అందులో కొన్ని ముఖ్యమైన కొన్ని ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.

రక్త ప్రసరణ మెరుగుపడుతుంది

శ్వాస వ్యాయామాలు చేసేటపుడు మీరు లోతైన శ్వాస తీసుకున్నప్పుడు, డయాఫ్రాగమ్ పైకి , క్రిందికి కదలిక జరుగుతుంది. తద్వారా వివిధ శరీర భాగాలకు రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఈ రకంగా అవయవాలు పనితీరు కూడా పెరుగుంది. శరీరం నుండి విషాన్ని తొలగించడంలోనూ ఇది సహాయపడుతుంది.

మెరుగైన ఆక్సిజన్ రవాణా

రక్తప్రసరణ మెరుగుపడటం వలన అన్ని భాగాలకు ఆక్సిజన్ చేరుతుంది. మనకు ఆక్సిజన్ ఎంత ముఖ్యమో తెలిసిందే. ఆక్సిజన్ ను ప్రాణవాయువు అంటారు. ఆక్సిజన్ తగినంతగా లేకపోతే, మన సిస్టమ్‌లో కార్బన్ డయాక్సైడ్‌ పెరుగుతుంది. ఇది విషంలా పని చేస్తుంది తద్వారా మనకు అలసట, మగత, తల తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. శ్వాసకోశ సమస్య ఉన్నవారిలో ఇలాంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. అయితే శ్వాస వ్యాయామాలు చేయడం ద్వారా శ్వాసకోశ సమస్యలు పరిష్కారం అవుతాయి. ఎక్కువ ఆక్సిజన్ పీల్చుకోగలుగుతాము.

ఒత్తిడి, ఆందోళనలు తగ్గుతాయి

శ్వాస వ్యాయామాలు మనం ఆక్సిజన్ తీసుకునే సామర్థ్యాన్ని పెంచుతాయి, మన మనస్సును ప్రశాంతపరుస్తాయి. ఈ రకంగా ఒత్తిడి, ఆందోళనలను తగ్గించడంలో ఇవి అత్యంత ప్రభావవంతమైనవిగా నిరూపితమయ్యాయి.

హృదయ ఆరోగ్యం

క్రమం తప్పకుండా బ్రీతింగ్ వ్యాయామాలు చేయడం వల్ల మన రక్తపోటు స్థాయిలు మెయింటైన్ చేయడానికి సహయపడతాయి. హైపర్ టెన్షన్ ఉన్న రోగులకు శ్వాస వ్యాయామాలు ఎంతో మేలు చేస్తాయి. ఇది స్ట్రోక్, గుండె జబ్బుల సంభావ్యతను తగ్గిస్తుంది.

ముఖంలో ప్రకాశం

ప్రాణాయామం వంటి శ్వాస వ్యాయామాలు రక్త ప్రసరణను మెరుగు పరుస్తాయి, ఆక్సిజన్ సరఫరాను పెంచుతాయి అని ఇది వరకే చెప్పుకున్నాం. ఈ రెండూ కూడా చర్మ ఆరోగ్యానికి కీలకం. రక్తం నిర్విషీకరణ జరగటం వలన చర్మం యవ్వనంగా, మెరుస్తూ ఉంటుంది. ఫలితంగా ముఖంలో మంచి ప్రకాశం వస్తుంది.