Gongura Pulusu Recipe: పుల్లగా, కారంగా అదిపోయే రుచితో గోంగూర పులుసు.. తయారు చేసుకోండిలా..-gongura pulusu recipe this stew is delicious with spice and sour ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Gongura Pulusu Recipe: పుల్లగా, కారంగా అదిపోయే రుచితో గోంగూర పులుసు.. తయారు చేసుకోండిలా..

Gongura Pulusu Recipe: పుల్లగా, కారంగా అదిపోయే రుచితో గోంగూర పులుసు.. తయారు చేసుకోండిలా..

Chatakonda Krishna Prakash HT Telugu
Nov 24, 2024 06:00 PM IST

Gongura Pulusu Recipe: గోంగూర పులుసు కారంగా, పుల్లగా రుచికరంగా ఉంటుంది. అన్నంలో కలుపుకొని తింటే అదిరిపోతుంది. ఈ గోంగూర పులుసు ఎలా చేసుకోవాలో ఇక్కడ చూడండి.

Gongura Pulusu Recipe: పుల్లగా, కారంగా అదిపోయే రుచితో గోంగూర పులుసు.. తయారు చేసుకోండిలా..
Gongura Pulusu Recipe: పుల్లగా, కారంగా అదిపోయే రుచితో గోంగూర పులుసు.. తయారు చేసుకోండిలా..

గోంగూరతో చేసే పప్పు, చట్నీలు, కర్రీలు అంటే చాలా మందికి ఎంతో ఇష్టం. గోంగూరతో చాలా రకాల వెరైటీలు చేయవచ్చు. గోంగూరతో పప్పు, చట్నీలే కాకుండా పుసులు కూడా అదిరిపోతుంది. పుల్లపుల్లగా, కారంకారంగా వావ్ అనేలా ఉంటుంది. నోటికి అద్భుతమైన రుచిని ఇస్తుంది. ఈ గోంగూర పులుసు ఎలా చేసుకోవాలో ఇక్కడ చూడండి.

గోంగూర పులుసుకు కావాల్సిన పదార్థాలు

  • 250 గ్రాముల గోంగూర
  • పాపు కప్పు శనగపప్పు (గంటపాటు నానబెట్టుకోవాలి)
  • రెండు టమాటాలు (కట్ చేసుకోవాలి)
  • మూడు ఉల్లిపాయలు (పెద్ద ముక్కలుగా చేసుకోవాలి)
  • మూడు టేబుల్ స్పూన్‍ల నూనె
  • మూడు పచ్చిమిర్చి (తరగాలి)
  • మూడు ఎండుమిర్చి
  • ఒకటిన్నర టీస్పూన్‍ల కారం
  • ఓ కప్పు నీరు
  • ఓ టేబుల్ స్పూన్ శనగపిండి
  • కాస్త చింతపండు (మోస్తరు నిమ్మకాయ సైజ్)
  • ఓ టీస్పూన్ ఆవాలు, ఓ టీస్పూన్ జీలకర్ర, ఓ టీస్పూన్ మినపప్పు, చిటికెడు పసుపు, రెండు రెబ్బల కరివేపాకు, చిటికెడు ఇంగువ (ఆప్షనల్)

గోంగూర పులుసు తయారీ విధానం

  • నీటితో బాగా కడిగిన గోంగూరను ముందుగా ప్రెజర్ కుక్కర్‌లో వేయాలి. దాంట్లోనే ఓ కప్పు నీరు, నానబెట్టుకున్న శనగపప్పు, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఓ ఉల్లిపాయ ముక్కలు, చింతపండు వేసి కుక్కర్ మూతపెట్టాలి.
  • వీటన్నింటినీ కుక్కర్‌లో మూడు విజిల్స్ వచ్చేవరకు ఉడికించుకోవాలి.
  • ఆ తర్వాత గోంగూర సహా మిగిలిన అన్నీ మెత్తగా అయ్యేలా పప్పుగుత్తితో మ్యాష్ చేయాలి.
  • మళ్లీ స్టవ్ ఆన్ చేసి మ్యాష్ చేసుకున్న దాన్ని కలపాలి. పులుసును ఉడుకుపట్టనివ్వాలి. శనగపిండిని నీటిలో కలుపుకొని దాంట్లో వేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. బాగా మిక్స్ చేయాలి.
  • పులుసు కాస్త ఉడుకుపట్టి దగ్గర పడ్డాక స్టవ్ ఆపేయాలి. కుక్కర్ దింపేసుకోవాలి.
  • పోపు కోసం మరో ప్యాన్‍ను స్టవ్‍పై పెట్టి నూనె పోసి వేడిచేయాలి. ఆవాలు, ఎండుమిర్చి ముక్కలు వేయాలి. ఆవాలు చిట్లిన తర్వాత మినపప్పు వేసి రంగు మారే వరకు వేపాలి. ఆ తర్వాత జీలకర్ర, తొక్క తీసిన వెల్లుల్లి రెబ్బలు, పసుపు, ఇంగువ, కారం పొడి, కరివేపాకు వేసి తక్కువ మంటపై వేపాలి.
  • వేపుకున్న పోపును గోంగూర పులుసులో కలుపుకోవాలి. రుచి చూసి ఉప్పు అడ్జస్ట్ చేసుకోవాలి. అంతే గోంగూర పులుసు రెడీ అయిపోయింది.

అన్నంతో తింటే గోంగూర పులుసు అదిరిపోతుంది. రొట్టెలు, చపాతీలతోనూ తినొచ్చు. పుల్లగా, కారంగా టేస్ట్ అద్భుతంగా అనిపిస్తుంది. తర్వాతి రోజు కూడా ఈ పులుసును తినొచ్చు. పులుపు తక్కువగా ఉండాలని అనుకుంటే చింతపండును స్కిప్ చేయవచ్చు. అయితే, చింతపండు వేస్తే మంచి రుచి వస్తుంది. కుక్కర్ లేకపోతే ప్యాన్‍లోనూ ఈ పద్ధతిలోనే గోంగూర పులుసు చేసుకోవచ్చు. అయితే, గోంగూర సరిగా ఉడికేలా చూసుకోవాలి.

Whats_app_banner