Meditation Day | హ్యాపిగా ఉండాలంటే ధ్యానం చేయండి.. ఒత్తిడి తగ్గించుకోండి..
మన చుట్టూ ఉన్న ప్రపంచంలో కూరుకుపోయి.. ఒక్క క్షణం కూడా తీరిక లేనప్పుడు.. కాస్త బ్రేక్ కావాలని.. ఒత్తిడి తగ్గించుకోవాలని చేసే ప్రయత్నమే మెడిటేషన్. ధ్యానం అనేది ఎప్పటినుంచో ఆచరిస్తున్న ఓ సరళమైన వ్యాయామం అని చెప్పవచ్చు. ఇది మనకు ఒత్తిడి, ఆందోళనను తగ్గించుకోవడానికి సహాయం చేస్తుంది. ప్రపంచ మెడిటేషన్ దినోత్సవం సందర్భంగా దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
World Meditation Day | మెడిటేషన్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక మతాలలో.. ముఖ్యంగా బౌద్ధమతం, ఇతర తూర్పు విశ్వాసాలలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. అయితే దేవుడిని నమ్మనివారు సైతం ఒత్తిడిని తగ్గించుకోవడానికి, వారి మనసును క్లియర్‌గా, శాంతంగా ఉంచుకోవడానికి ధ్యానం చేస్తారు. మీరు ఆధ్యాత్మిక వ్యక్తి అయినా కాకపోయినా అనే విషయం పక్కన పెడితే.. నేటి ఆధునిక ప్రపంచంలో ధ్యానం అనేది చాలా ముఖ్యమైనది. రోజువారీ కార్యకలాపాలతో.. హడావిడి జీవితాల్లో ఒక్క క్షణం కూడా శాంతి లేకుండా గడిపేస్తున్నవారికి ధ్యానం చాలా అవసరం.
ధ్యానం ఎలా చేయాలి
ధ్యానం గురించిన మరో గొప్ప విషయం ఏమిటంటే దీనిని ఎవరైనా.. ఎక్కడి నుంచైనా చేయవచ్చు. కూర్చుని ఉన్నా, నిలబడి ఉన్నా, మంచం మీద పడుకున్నా.. జస్ట్ మీ కళ్ళు మూసుకుని.. మీ శ్వాస తీసుకోవడంపై దృష్టి పెట్టాలి. మీ మనస్సులో ఆలోచనలు రాకుండా చూసుకోవాలి. పూర్తి ఫోకస్ అంతా శ్వాసమీదనే ఉండాలి. ఆలోచనలు వస్తుంటే.. మళ్లీ శ్వాస మీద దృష్టి పెట్టాలి. కొంత సేపు తర్వాత మీ కళ్లు తెరిచి.. మీ దినచర్యను కొనసాగించాలి. అయితే ధ్యానం వల్ల కలిగే లాభాలేంటో చుద్దాం.
ఆందోళన తగ్గించుకోవడానికై..
ఆందోళన అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ మానసిక ఆరోగ్య రుగ్మతలలో ఒకటిగా ఉంది. ఇది తీవ్రమైన సందర్భాల్లో వైద్యులు మందులు సూచించినప్పటికీ.. వారిలో ఆందోళన అలానే మిగిలిపోతుంది. ఆందోళన ఎక్కువైనప్పుడు వారి హృదయ స్పందన వేగం ఎక్కువై.. హానికరమైన ఆలోచనలు వస్తాయి. వాటిని నిరోధించడానికి ధ్యానం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఆందోళన వల్ల కలిగే ఇబ్బందులను తగ్గించడానికి ధ్యానం అత్యంత సాధారణ సమగ్ర మార్గాలలో ఒకటని చెప్పవచ్చు.
ఒత్తిడిని తగ్గించుకోడం
మన జీవితం ఒత్తిడితో కూడుకున్నదేననడంలో ఎటువంటి సందేహం లేదు. ఒత్తిడి అనేది సాధారణ శారీరక ప్రతిస్పందన అయినప్పటికీ.. స్థిరమైన ఒత్తిడి శరీరంలో తీవ్రమైన సమస్యలను కలిగిస్తుంది. కాబట్టి మనం ఒత్తిడికి గురికాకూడదు. బిజీగా ఉన్న ప్రపంచం నుంచి కాస్త సమయాన్ని వెచ్చించి.. మీపై అంతర్గతంగా దృష్టి పెట్టడానికి ధ్యానం ఒక గొప్ప మార్గం. ధ్యానం చేస్తున్నప్పుడు చేసే శ్వాస వ్యాయామాలు రక్తపోటును తగ్గిస్తాయి. ఒత్తిడి స్థాయిలను తగ్గించి.. మనస్సును ప్రశాంతంగా ఉంచుతాయి. దీర్ఘకాల ఒత్తిడి నుంచి కోలుకోవడానికి శరీరానికి సహాయం చేస్తాయి.
పరధ్యానం తగ్గుతుంది..
గతంలో కంటే ఎక్కువ విషయాలు ఇప్పుడు మానవ మెదడులో తిరుగుతూ ఉంటాయి. ఇంటర్నెట్, స్మార్ట్‌ఫోన్‌లు.. వంటివి మనలో అనవసరమైన ఆలోచనలను రెట్టింపు చేస్తున్నాయి. దీనివల్ల మనలో చాలా మంది ఏకాగ్రతను కోల్పోతున్నారు. అలాంటి వారు ధ్యానం చేయడం వల్ల వర్తమానం గురించి ఆలోచించడం.. ప్రస్తుత క్షణంలో జీవించడం.. పరధ్యానాన్ని తగ్గించుకోవడం.. అవసరమైన క్షణంలో ఏకాగ్రతతో ఉండేందుకు సహాయం చేస్తుంది.
అంతేకాకుండా వ్యసనాలను అధిగమించడంలో సహాయపడుతుంది. మాదకద్రవ్యాల దుర్వినియోగం నుంచి ఆహార వ్యసనం వరకు.. సాంప్రదాయ డి-అడిక్షన్ ప్రోగ్రామ్‌ల కంటే అతీంద్రియ ధ్యానం మరింత ప్రభావవంతంగా ఉంటుందని పరిశోధనలు నిరూపిస్తున్నాయి. ఎందుకంటే ధ్యానం బాహ్య కారకాలు లేకుండా సహజంగా సంతోషంగా ఉండటానికి మెదడుకు శిక్షణ ఇస్తుంది. కాబట్టి మీరు కూడా రోజూ ధ్యానం చేసి.. మీలోని ఒత్తిడిని తగ్గించుకుని.. హ్యాపిగా ఉండండి.
సంబంధిత కథనం