Friday Feelings | నిన్నటి వరకు తనే సర్వస్వం.. నేడు ఎవరిదారి వారిది, తప్పెవరిది?
Friday Feelings: భావోద్వేగాలు తాత్కాలికమైనవి, అవి కాలంతో పాటు ఆవిరవుతాయి. బాధ, కోపం, ద్వేషం వంటి భావోద్వేగాలను అదుపు చేయలేకపోతే అది అనర్థాలకు దారితీస్తుంది. ఇక్కడ మీలో ప్రేరణ కలగ చేసే ఒక ఆసక్తికరమైన కథ ఉంది చదవండి.
Friday Feelings: స్వప్న, పవన్ ఇద్దరూ మంచి స్నేహితులు. చిన్నప్పటి నుంచి ఒకే అపార్టుమెంటులో పక్కపక్క ఫ్లాట్స్‌లో పెరగటం వలన వీరి మధ్య స్నేహం బలంగా ఉండేది. ఇద్దరూ కలిసి సినిమాలు, షికార్లకు వెళ్లడం, షాపింగ్‌లు చేయడం చేసేవారు. ఏది చేసినా ఇద్దరూ కలిసే చేసేవారు. పవన్ ఇంట్లో దాచే రహస్యాలు, అలవాట్లు, అభద్రతాభావాలు అన్నీ స్వప్నకు తెలుసు. పవన్ ఏది చెప్పిన స్వప్న ఓపికగా వినేది, ధైర్యం చెప్పేది, పవన్‌ను వెన్నంటూ ప్రోత్సహించేది. అలాగే స్వప్న కూడా తనకు సంబంధించిన ఏ విషయం కూడా పవన్ వద్ద దాచేది కాదు. లవర్స్ కూడా ఈర్ష్యపడేంత గొప్పగా పవన్, స్వప్నల బంధం ఉండేది. అంత గొప్పగా, ప్రేమగా కలిసి ఉండేవారు.
ఒకరోజు స్వప్న తాను చేస్తున్న ఉద్యోగంలో తనకు ప్రమోషన్ వచ్చిందని చెప్పి పవన్‌కు ట్రీట్ ఇవ్వడానికి తీసుకెళ్తుంది. ఇద్దరూ కలిసి ఒక రెస్టారెంట్లో కలిసి కూర్చున్నప్పుడు. పవన్ స్వప్నని ఇలా అడుగుతాడు 'పెళ్లిపై నీ ఒపినియన్ ఏంటి స్వప్న.. ఆరెంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటావా? లేక లవ్ మ్యారేజ్ చేసుకుంటావా'? అని. అప్పుడు స్వప్న.. 'నన్ను నాకంటే బాగా అర్థం చేసుకునే వాడిని, నా గురించి అన్నీ తెలిసిన వాడినే నేను పెళ్లి చేసుకుంటాను' అని చెబుతుంది.
స్వప్న మాటలతో పవన్ ఎంతో హ్యాప్పీగా ఫీల్ అవుతాడు. ఎందుకంటే పవన్‌ది కూడా సేమ్ ఫీలింగ్. ఇక ఆలస్యం కూడదని స్వప్నతో పవన్ తన ప్రేమ ప్రతిపాదనను తెలియజేస్తాడు. పెళ్లి చేసుకుందాం అని చెబుతాడు. పవన్ మాటలకు ఆశ్చర్యపోయిన స్వప్న. తానెప్పుడు అలా భావించలేదని, నిన్ను ఎప్పుడూ ఒక మంచి స్నేహితుడిగానే చూశానని అంటుంది. దీంతో ఖంగుతున్న పవన్, నిన్ను నాకంటే బాగా ఎవరు అర్థం చేసుకోగలరు, ఎవరు ప్రేమించగలరు అని అంటాడు. దానికి స్వప్న తాను ఇప్పటికే తన కొలీగ్‌తో ప్రేమలో ఉన్నానని, అతడు నా ప్రేమను అంగీకరించాక ఆ విషయం నీకు చెబుతానని అనుకున్నాను అని స్వప్న అంటుంది. స్వప్న మాటలకు పవన్ ఫ్యూజులు ఎగిరిపోతాయి.
దీంతో పవన్, స్వప్నల మధ్య మాటలు కరువయ్యాయి. పవన్ స్వప్నను అవాయిడ్ చేయడం ప్రారంభిస్తాడు, ఆమె ఎప్పుడు ఎదురయినా, పలకరించినా పట్టించుకోకుండా వెళ్లిపోతాడు. స్వప్న కూడా కొన్నాళ్లు చూసి తన పనుల్లో తాను బిజీ అయిపోతుంది. అయితే పవన్ మాత్రం ఎప్పుడూ బాధతో, దు:ఖంతో ఏదో కోల్పోయినవాడిలా తయారవుతాడు. స్వప్న తన కొలీగ్‌తో కలిసి తిరగటం, పవన్‌తో కంటే కూడా అతడితో చాలా చనువుగా మెలగడం చూస్తాడు. స్వప్న తనకు చాలా క్లోజ్ అనుకుంటాడు కానీ, స్వప్నకు ఆమె ప్రియుడికి మధ్య ఉన్న సాన్నిహిత్యం చూసి.. తనకు, స్వప్నకు మధ్య ఎంత గ్యాప్ ఉండేదో అప్పుడు అర్థం చేసుకుంటాడు.
పవన్ ప్రవర్తనలో విచిత్రమైన మార్పును చూసి అతడి తండ్రి ఏం జరిగిందో అడుగుతాడు. అప్పుడు పవన్ తన గోడునంతా తన తండ్రితో చెప్పుకుంటాడు. నాలో ఏం తక్కువ, నేను ఎంతగా ఇష్టపడ్డాను, అయినా స్వప్న నాకు దూరం ఎలా అయింది అంటూ తనపై ద్వేషం వెల్లగక్కుతాడు.
అప్పుడు పవన్ తండ్రి ఇందులో నీతప్పు లేదు, తన తప్పు లేదు. కేవలం తను నిన్ను ప్రేమిస్తుందని నువ్వు ఊహించుకున్నావు, ఆమె ఊహించుకోలేదు అంతే . కాబట్టి ఇది ఎవరి తప్పు కాదు. కేవలం పరిస్థితులు, భావోద్వేగాల ప్రభావం. కొన్నాళ్లు నీ పని మీద దృష్టి పెట్టు అప్పుడు కూడా నీకు స్వప్న మీద ఇదే స్థాయిలో ద్వేషం ఉంటే చెప్పు అంటాడు.
తండ్రి చెప్పినట్లుగా పవన్ ఆలోచిస్తాడు. ఇందులో ఇద్దరి తప్పు లేదు అనే తన తండ్రిమాట గుర్తు చేసుకొని కరెక్టే కదా అనుకుంటాడు. మూడు నాలుగు నెలలు గడుస్తాయి. స్వప్న లేకపోయినా పవన్ ఆనందగా బ్రతకడం అలవాటు చేసుకుంటాడు. ఈ కొన్ని నెలల్లో పవన్ సాధారణ స్థితికి వస్తాడు. అతడికి స్వప్న మీద కోపం గానీ, ద్వేషం గానీ ఎలాంటివి ఉండవు. కానీ స్వప్నతో తన జ్ఞాపకాలు ఎప్పటికీ మధురమైనవే.
మళ్లీ స్వప్న తనతో స్నేహంగా ఉంటే బాగుండు అని కోరుకుంటాడు. ఒక రోజు స్వప్న ఎదురుపడగా పవన్ తనను చూసి ఒక చిరునవ్వు నవ్వుతాడు. అందుకు స్వప్న పవన్ వైపు కోపంగా చూస్తూ పవన్ దగ్గరకు వచ్చి కడుపులో ఒక్కటి గుద్దుతుంది. దీంతో మళ్లీ మాటలు కలుస్తాయి, వారి మధ్య స్నేహం చిగురిస్తుంది. అప్పట్నించీ వారి మధ్య స్వచ్ఛమైన స్నేహం ఎప్పట్లాగే కొనసాగుతుంది.
నీతి: ఈ కథతో ఒరిగే నీతి ఏమిటంటే.. కోపం, ద్వేషం వంటి భావోద్వేగాలు తాత్కాలికమైనవి.. కాలంతో పాటు భావోద్వేగాలు ఆవిరవుతాయి, కానీ జ్ఞాపకాలు పదిలంగా ఉంటాయి. అందుకే మంచి జ్ఞాపకాలు పెంచుకోండి, కోపాలు, ద్వేషాలు కాదు.
సంబంధిత కథనం
టాపిక్