Yoga For Mind Relaxation | ఒత్తిడి తగ్గించి, మనసును శాంతపరిచే యోగ ముద్రలు!
Yoga For Mind Relaxation: మెదడు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం చాలా ముఖ్యం. ఈ ఆసనాలు వేస్తే ఒత్తిడి తగ్గుతుంది. పని మీద ఏకాగ్రత పెరుగుతుంది.
ప్రతి ఒక్కరి జీవితంలో ఒడిదుడుకులు, కష్టాలు, సంతోషాలు సర్వసాధారణం. కొందరు ఎలాంటి కష్టాన్నైనా ధైర్యంగా ఎదుర్కొంటారు, మరికొందరు చిన్న చిన్న సమస్యలకు కూడా మానసిక చిత్రవధలకు గురవుతారు. కానీ సుఖం, కష్టం మన చేతుల్లోనే ఉంటాయనేది అందరూ గ్రహించాల్సిన వాస్తవం. ఒత్తిడి పెరిగితే భవిష్యత్తులో తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది.
ఆనందాన్ని అందరూ కోరుకుంటారు, అందంగా కనిపించాలని అందరికీ ఉంటుంది. అందంగా ఉండాలన్నా, ఆనందంగా ఉండాలన్నా మీరు మానసికంగా దృఢంగా, ప్రశాంతంగా ఉండాలి. తలనిండా ఆలోచనలు పెట్టుకుంటే ఏ పని సరిగ్గా చేయలేం, ఆ ఆలోచనలకు విరామం ఇచ్చి ఏకాగ్రత సాధించాలి. ఇందుకోసం మెదడు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం చాలా ముఖ్యం. మెదడు కల్లోలంగా ఉంటే, ఏకాగ్రత సాధించలేము. మన వయసు పెరుగుతున్నట్లే మెదడు కూడా వృద్ధాప్యం ఎదుర్కొంటుంది, మెదడు చురుగ్గా, మీ నియంత్రణలో ఉండాలంటే మంచి ఆహారంతో పాటు కొంత వ్యాయామం కూడా అవసరం.
Yoga For Mind Relaxation- మనసును శాంతపరిచే యోగ ముద్రలు
కొన్ని రకాల యోగాసనాలు, ధ్యాన ముద్రలు మెదడు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మెదడును మీ నియంత్రణలో ఉంచుతాయి. తద్వారా ఆలోచనలపై స్పష్టత లభిస్తుంది, మీకు ప్రశాంతత లభిస్తుంది. జీవితంలో ఆనందం చేరువవుతుంది. మరి అలాంటి వ్యాయామాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
భ్రమరీ ప్రాణాయామం
భ్రమరీ ప్రాణాయామం మీ శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది శ్వాసను నియంత్రించే ఒక బ్రీతింగ్ టెక్నిక్ ఇది శరీరం రికవరీ సామర్థ్యాన్ని పెంచడానికి సహాయపడుతుంది. ఈ ఆసనం ఆచరిస్తున్నపుడు ఏర్పడే ప్రకంపనాలతో ఒత్తిడి, ఆందోళనలు తగ్గుముఖం పడతాయి, మానసిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఏకాగ్రత మెరుగుపడుతుంది. ఈ ఆసనం వేసేందుకు ముందుగా పద్మాసనం లేదా సుఖాసనంలో కూర్చుని, మీ అరచేతులను మీ ముఖంపై ఉంచండి. చూపుడు వేళ్లతో కళ్లపై సున్నితంగా నొక్కండి. మధ్య వేళ్లను ముక్కు పక్కన, పెదవులపై ఉంగరపు వేళ్లను, నోటి చివర చిన్న వేళ్లను తాకండి. బొటనవేళ్లతో చెవులను సున్నితంగా కప్పండి. ఇప్పుడు ముక్కు ద్వారా లోతైన శ్వాస తీసుకోండి, శబ్దం చేస్తూ గాలిని వదిలివేయండి.
ప్రాణ ధారణ
ప్రాణ ధారణ అనేది ధ్యానంలోని ఒక రూపం. ఇది మీ ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది, మీ పనితీరు మెరుగుపడుతుంది. ఈ ఆసనం ఆచరించడానికి సౌకర్యవంతమైన భంగిమలో కూర్చోండి. రిలాక్స్ అవ్వండి, మీ కళ్ళు మూసుకుని, నెమ్మదిగా శ్వాస పీల్చుకోండి, నెమ్మదిగా వదలండి. మీరు 3 సెకన్ల పాటు శ్వాస తీసుకుంటే, 5-6 సెకన్ల పాటు శ్వాస వదలండి. మొదటి రోజు మీకు వీలైనన్ని సార్లు చేయండి, ప్రతి రోజు సామర్థ్యం పెంచండి.
షణ్ముఖి ముద్ర
ఏకాగ్రతను పెంపొందించడానికి ఈ యోగాసనం చాలా ఉపయోగపడుతుంది. అంతే కాదు మీ చర్మం మెరుస్తుంది. ఈ ఆసనం వేయడానికి పద్మాసనంలో కూర్చోవాలి. వీపును నిటారుగా, ఛాతీ, భుజాలను గట్టిగా ఉంచండి. ఇప్పుడు మీ రెండు బొటనవేళ్లను రెండు చెవులపై ఉంచండి, కనుబొమ్మ, రెండు కళ్ల మధ్య చూపుడు వేలును ఉంచండి. మధ్య వేళ్లను ముక్కు పక్కన, ఉంగరపు వేలును ముక్కు కింద, చిటికెన వేలును పెదవుల పక్కన పెట్టి, ముక్కును రెండు వైపులా కొద్దిగా నొక్కాలి. ఇప్పుడు నెమ్మదిగా ఊపిరి పీల్చుకోండి.
రోజూ ఈ ఆసనాలు వేస్తే ఒత్తిడి తగ్గుతుంది. పని మీద ఏకాగ్రత పెరుగుతుంది. ప్రతిరోజూ 10 నిమిషాలు ఈ ఆసనాలకు కేటాయించండి, మానసిక సమస్యల నుండి బయటపడండి.
సంబంధిత కథనం