ధ్యానం అనేది ఒక వ్యక్తి ఏదైనా అంశంపై పూర్తి శ్రద్ధ, అవగాహన కల్పించేందుకు ఇచ్చే ఒక శిక్షణ. పరిపూర్ణ స్పష్టతను, మానసిక ప్రశాంతతను పొందేందుకు చేసే ఒక సాధన. ధ్యానం చేయడం ద్వారా వ్యక్తులు ఒక నిర్ధిష్టం అంశం, ఆలోచన లేదా కార్యాచరణపై మనస్సును కేంద్రీకరించవచ్చు. ధ్యానంలో అనేక రకాలు ఉంటాయి. వాటిలో విపాసన అనేది ఒక ప్రత్యేకమైన అభ్యాసం.
విపాసన ధ్యానం, ఇతర ధ్యాన శైలుల మధ్య వ్యత్యాసం చాలా కీలకం. పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత సాధన చేయడం అవసరం. పురాతన పాళీ భాషలో ధ్యానంను రెండు ప్రధాన రకాలుగా పేర్కొనడమైనది. అందులో ఒకటి విపాసన కాగా, మరొక రకం పేరు సమత. విభిన్న మానసిక నైపుణ్యాలు, పనితీరు, లేదా స్పృహ లక్షణాల ఆధారంగా ధ్యానంను ఇలా రెండుగా వర్గీకరించడమైనది.
విపాసన అంటే 'అంతర్దృష్టి' అనే అర్థం వస్తుంది. అంటే విపాసన అభ్యాసం ద్వారా విషయాన్ని సంపూర్ణ ఏకాగ్రతతో లోతుగా అర్థం చేసుకొని, మనశ్శాంతిని సాధించడం. ఇది చంచలమైన మనస్సును నియంత్రించి, ప్రశాంతత చేకూరుస్తుంది. తద్వారా ఒకే అంశంపై దృష్టి కేంద్రీకరించేలా చేసే స్థితిని కల్పిస్తుంది. వివిధ రకాల ఆలోచనలు చుట్టుముట్టకుండా, మీ అంతరంగాన్ని దృష్టిలో ఉంచుకుని స్వీయ పరిశీలనను అభ్యసించడానికి మిమ్మల్ని ఈ మెడిటేషన్ టెక్నిక్ అనుమతిస్తుంది.
విపసనా ధ్యానం అనేది ఇది బౌద్ధమతంలో ఆచరించే పురాతన ధ్యాన పద్ధతి. సుమారు 2,400 సంవత్సరాల క్రితం బుద్ధుడు సృష్టించినట్లు చరిత్ర చెబుతుంది. ఈ ధ్యాన అభ్యాసం ఆగ్నేయాసియా, శ్రీలంకలో చాలా ఎక్కువగా ఆచరిస్తారు. భారతదేశంలో కూడా చాలా చోట్ల విపాసన ధ్యాన కేంద్రాలు ఉన్నాయి. ఇది మీరు ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవడానికి సహాయపడుతుంది, అంతర్గత ప్రశాంతతను చేకూరుస్తుంది, మీ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
విపాసన ధ్యానం సాధన కోసం ప్రశాంతమైన ప్రదేశం ఉండాలి, నేలపై కూర్చొని, వీపును నిటారుగా ఉంచి విశ్రాంత స్థితిలోకి రావాలి. సాధారణంగా శ్వాస తీసుకుంటూ ఆలోచనలను గమనించాలి. ప్రతిరోజూ ఉదయం 15 నిమిషాలు చేయాల్సి ఉంటుంది. క్రమం తప్పకుండా విపాసన ధ్యానం చేస్తే అంతర్దృష్టి, ఏకాగ్రత మెరుగుపడుతుంది. మీలో ఒంటరితనం భావనలు తగ్గుతాయి. నిరాశ, ఒత్తిడి, ఆందోళనను తొలగించడానికి సహాయపడుతుంది. అందరిలో కలిసిపోయి సంబంధాలను మెరుగుపర్చుకోగలరు.
ఇది జీవితంపై సరైన స్పష్టత, మెరుగైన లక్ష్యాలను ఏర్పర్చుకోవడానికి, తప్పుల నుంచి నేర్చుకునేలా అవగాహనను కల్పిస్తుంది.
వివిధ మానసిక చికిత్సల కోసం నిపుణుల పర్యవేక్షణలో విపాసన ధ్యానం శిక్షణను అందిస్తారు. ఇది మెదడు ప్లాస్టిసిటీని ప్రోత్సహిస్తుంది. చెడు వ్యసనాలకు సంబంధించిన సమస్యలకు చికిత్స చేయడంలో సహాయపడుతుంది.
సంబంధిత కథనం