Meditation | అనవసరపు ఆందోళనలతో సతమతమవుతున్నారా? అయితే ధ్యానం చేయండి!
ఒత్తిడి, ఆందోళనతో కూడిన జీవనశైలితో మానసిక ప్రశాంతత కరువవుతుంది. ఫలితంగా అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. ప్రశాంతంగా జీవించటానికి ధ్యానం ఒక గొప్ప మార్గం అని నిపుణులు చెబుతున్నారు.
నేటి ఉరుకులు పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతత అనేది ప్రతి ఒక్కరికీ చాలా అవసరం. అయితే చాలా మంది చిన్నపాటి సమస్యలనే పెద్దగా ఊహించుకొని పరిస్థితిని జఠిలం చేసుకుంటున్నారు. దాని గురించే నిరంతరం తీవ్రంగా ఆలోచిస్తూ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. లేని దానిని ఊహించుకుంటూ మానసిక ప్రశాంతతను కోల్పోతున్నారు. దీనిని నుంచి బయటపడాలంటే ధ్యానం అత్యంత ప్రభావవంతమైన మార్గం.
భారతీయ సంస్కృతిలో వేద కాలం నుంచే ధ్యానం ఉనికిలో ఉంది. యోగాతో పాటు ధ్యానం వల్ల కలిగే ప్రయోజనాలను సైన్స్ కూడా అంగీకరించింది. ఇది మీ ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుంది, జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది, రక్తపోటును నియంత్రిస్తుంది, వివిధ వ్యసనాల నుండి కోలుకోవడంలో మీకు సహాయపడుతుంది అలాగే మీరు బాగా నిద్రపోయేలా చేస్తుంది. ఇలా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి ప్రతిరోజు ధ్యానం చేయడం అలవాటు చేసుకోవాలి. అది మీ మానసిక, శారీరక ఆరోగ్యానికి మంచిది. ధ్యానం మీకు ఏ విధంగా సహాయపడుతుందో మరింత వివరంగా తెలుసుకోండి.
వ్యాధుల నుంచి ఉపశమనం
ధ్యానం మీ మనస్సును ప్రశాంతంగా ఉంచడానికి, మీ ఒత్తిడిని తగ్గించడానికి గొప్ప మార్గం. మీరు ఒత్తిడిలేని జీవనం గడిపితే అది అనేక సమస్యలను దూరం చేస్తుంది. ఉబ్బసం, అధిక రక్తపోటు, నిద్రలేమి, తలనొప్పి వంటి సమస్యలతో పాటు క్యాన్సర్, గుండె జబ్బుల వంటి ప్రాణాంతక వ్యాధులు నయమవుతాయని పలు పరిశోధనలు వెల్లడించాయి.
మనసును నియంత్రిస్తుంది
మనం ఒత్తిడి, ఆందోళనకు లోనైనప్పుడు మనస్సు చంచలంగా ఉంటుంది. ఈ సమయంలో శరీరం అనేక రకాల ఇన్ఫ్లమేటరీ రసాయనాలను విడుదల చేస్తుంది. వీటిని సైటోకైన్స్ అంటారు. ఇది మనల్ని డిప్రెషన్‌కు దారి తీస్తుంది. ఒత్తిడికి ప్రతిస్పందనగా శరీరం ఫ్లైట్ మోడ్‌లో ఉంటుంది. దీని కారణంగా గుండె కొట్టుకోవడం వేగంగా జరుగుతుంది. ఇది అనేక రకాల దుష్ప్రభావాలకు దారితీస్తుంది. ధ్యానం చేస్తే మనసు మన నియంత్రణలో ఉంటుంది. కాబట్టి మిగతా సమస్యలను నివారించవచ్చు.
ధ్యానం ఎలా చేయాలి?
ధ్యానంలో చాలా రకాలు ఉన్నాయి. యూట్యూబ్‌లో వెతికితే వందల కొద్దీ వీడియోలు మీకు అందుబాటులో ఉంటాయి. మీరు స్థానికంగా ఏవైనా ధ్యాన కేంద్రాలు ఉంటే ఆ వివరాలు తెలుసుకొని, ఆ కేంద్రంలో గడపండి. మీకు ఏది అందుబాటులో లేకపోతే ఒక దగ్గర ప్రశాంతంగా కూర్వొని శ్వాస వ్యాయామాలతో ప్రారంభించవచ్చు. లోతుగా శ్వాస తీసుకోండి. శ్వాస మీద దృష్టి కేంద్రీకరించండి. మీరు ఊపిరి పీల్చుకున్నప్పుడు, వదులుతున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుందో గమనించండి. శ్వాస శబ్దాన్ని వినండి. మీ ఆలోచనలు తిరుగుతుంటే, మళ్లీ శ్వాసపై దృష్టి పెట్టండి. మీరు ఊపిరి పీల్చుకున్నప్పుడు కళ్ళు మూసుకోండి అప్పుడు మీకెలా అనిపిస్తుందో గమనించండి.
సంబంధిత కథనం