Mindfulness Meditation । మీలోని భయాలను తొలగించి మిమ్మల్ని ప్రశాంతంగా ఉంచే ధ్యానం ఇదే!
Mindfulness Meditation: మీలోని అనవసరపు భయాలు, ఆందోళనను తగ్గించి, మీ ఆలోచనలకు చెరిపేసి, మీ ఒత్తిడిని తొలగించే ధ్యానంలోని రకాలు ఇక్కడ తెలుసుకోండి.
తీవ్ర గందరగోళంలోనూ వ్యక్తులను ప్రశాంతంగా ఉంచే ఒక సాధనం ధ్యానం. ఈ ధ్యానం అనేది మెదడు కెమిస్ట్రీని మారుస్తుంది, సానుకూలత, ఆశావాదం, ఆనందాన్ని పెంపొందిస్తుంది. ధ్యానం మీ ఊహాశక్తిని పెంచుతుంది, సృజనాత్మకతను మెరుగుపరుస్తుంది. కష్టాలతో కూడిన జీవితాన్ని గడుపుతున్నప్పుడు, ఒత్తిడి, ఆందోళనలతో మీ మనసు నిండిపోయి ఉంటుంది. ఈ పరిస్థితి మిమ్మల్ని అతిగా ఆలోచించేలా చేస్తుంది, అయినప్పటికీ మీ ఆలోచనల్లో ఎలాంటి స్పష్టత లేకుండా చేస్తుంది. కానీ ప్రశాంతంగా కొద్దిసేపు ఆలోచిస్తే సమస్యకు ఏదో ఒక మార్గం లభిస్తుంది. ధ్యానం అందుకు సహాయపడుతుంది. కొత్తగా, సృజనాత్మకతతో ఆలోచించగలము.
ధ్యానం చేయడానికి చాలా మార్గాలు ఉన్నాయి, ఇందులో మీ అవసరానికి, మీ సౌకర్యానికి తగినట్లుగా ఏదో ఒక ఫార్మాట్ ఎంచుకోవచ్చు. మీలోని అనవసరపు భయాలు, ఆందోళనను తగ్గించి, మీ ఆలోచనలకు చెరిపేసి, మీ ఒత్తిడిని తొలగించే ధ్యానంలోని రకాలు ఇక్కడ తెలుసుకుందాం.
మైండ్‌ఫుల్‌నెస్ మెడిటేషన్
అత్యంత ప్రజాదరణ పొందిన ధ్యానం రకం . ప్రముఖ యోగా గురువులు పెద్ద మొత్తంలో ఛార్జీలు తీసుకొని సాధన చేయించే ధ్యానం ఇదే. ఈ రకమైన ధ్యానం మన బుద్ధిని తట్టిలేపుతుంది. గతాన్ని, భవిష్యత్తును మరిచిపోయి ప్రస్తుత క్షణాలను మీ పంచేంద్రియాల ద్వారా మీరు అనుభవించగలిగడం ఇందులో ప్రధానం. మీ కళ్ళు ఏమి చూస్తున్నాయి? మీరు భయంలో ఉన్నారా లేదా దేనికైనా ఆకర్షణను కలిగి ఉన్నారా? మీరు తాకినది ఏమిటి? ఇది మిమ్మల్ని ఉత్తేజపరుస్తుందా లేదా భయపెడుతుందా? మీ చుట్టూ ఉన్న వాసనలు ఏమిటి, అవి మిమ్మల్ని రిలాక్స్‌గా ఉంచుతున్నాయా లేదా ఒత్తిడికి గురిచేస్తున్నాయా? ఇలా ఈ ధ్యానం భావోద్వేగాలన్నింటినీ తాకి, ఆపై వాటిని అధిగమించడంలో మీకు సహాయపడుతుంది. మీరు యోగాతో ఈ అవగాహన పద్ధతులను మిళితం చేస్తే, ప్రయోజనాలు రెట్టింపు అవుతాయి.
మంత్ర ధ్యానం
ఈ రకమైన ధ్యానం నిజంగా మన మనస్సును కలుషితం చేయకుండా విచ్చలవిడి ఆలోచనలను నిరోధించడానికి సహాయపడుతుంది. ఈ మంత్ర ధ్యానం కొన్ని పదాలు లేదా పదబంధాలను ఉపయోగించే చేసే ప్రభావవంతమైన ఏకాగ్రత వ్యాయామం. ఇందులో మంత్రం ఓం, క్లీమ్, హ్రీమ్, గామ్ వంటి బీజాక్షరాలు కావచ్చు లేదా అవి ఓం నమ: శివాయ వంటి మొత్తం వాక్యాలు కావచ్చు. మీరు మనస్సును స్థిరంగా ఉంచడానికి ఒక శక్తివంతమైన మంత్రంను పఠించవచ్చు. ఈ ధ్యానం చేయడానికి ముందుగా వదులుగా ఉండే బట్టలు ధరించండి. అనంతరం ఒక చోట సౌకర్యవంతంగా కూర్చొండి, మీ వెన్నెముకను నిటారుగా ఉంచండి. అప్పుడు మీ మంత్ర జపం ప్రారంభించండి. మీరు మీ మంత్రం జపించేటపుడు మెల్లగా గుసగుసగా చెప్పవచ్చు, లేదా బిగ్గరగా ఉచ్ఛరించవచ్చు లేదా మౌనంగా మీ మనసులోనే అనుకోవచ్చు. మీరు మీ కళ్లు మూసుకొని లయబద్ధంగా జపిస్తూ ఉంటే, అందులో లీనమై మిమ్మల్ని మీరు మరిచిపోతారు. మీ మనస్సును కలిచివేసే అపసవ్య ఆలోచనలు చెదిరిపోతాయి.
దయ, కరుణ ధ్యానం
ఇది మన సానుకూల ఉద్దేశాలను ఇతరుల వైపు మళ్లించే ప్రార్థనలకు సమానం. మన ఏకాగ్రతతో మన ఆత్మీయులకు దయ, కరుణను పంపుతాము. లేదా మనకు మనంగా మనపైనే దయ, కరుణలను చూపుకుంటాము. ఉదాహరణకు ఓ తల్లి తన గర్భంలోని బిడ్డకోసం మనసులోనే ప్రార్థిస్తూ నిద్రపో, హాయిగా ఉండూ అని చెప్పడం లేదా మీకు మీరుగా మీ బాధలన్నీ త్వరలోనే తొలగిపోతాయని నచ్చజెప్పుకోవడం, లేదా మీ ఆత్మీయులు ఆనందంగా ఉండాలని ప్రార్థించడం ఈ ధ్యానంలో భాగం. ఇది మిమ్మల్ని బాధల నుంచి ఊరట కల్పిస్తుంది.
సంబంధిత కథనం