Rahul Gandhi defamation case : పాపం రాహుల్ గాంధీ.. ఏదీ కలిసి రావట్లేదు!
24 March 2023, 15:46 IST
Rahul Gandhi defamation case Live updates : రాహుల్ గాంధీ.. రెండు దశాబ్దాల క్రితం కాంగ్రెస్ ‘వారసుడి’గా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆయన.. ఇప్పుడు పార్లమెంట్లో అనర్హత వేటుకు గురయ్యారు. ఈ మధ్య కాలంలో ఎన్నో వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు. మోదీని, బీజేపీని ఢీకొట్టే సత్తా ఆయనకు ఉందా? అన్నది చాలా మందికి కలిగే ప్రశ్న!
పాపం రాహుల్ గాంధీ.. ఏదీ కలిసి రావట్లేదు!
Rahul Gandhi defamation case Live : రెండు దశాబ్దాల క్రితం.. రాహుల్ గాంధీ రాజకీయ ఎంట్రీతో కాంగ్రెస్ పార్టీ మురిసిపోయింది. 'వారసుడు వచ్చాడు' అంటూ సంబరాలు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు రాహుల్ గాంధీనేనని భావించింది. కానీ రెండు దశాబ్దాల తర్వాత పరిస్థితులు అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. తాజా పరిణామాలు చూస్తుంటే.. చాలా మంది 'పాపం రాహుల్ గాంధీ' అనుకునే ఉంటారు! మొన్న ఎన్నికల్లో వరుస పరాజయాలు.. నిన్న ఈడీ కార్యాలయాల్లో గంటల కొద్ది ప్రశ్నలు.. నేడు ఏకంగా జైలు శిక్ష! రాహుల్ గాంధీకి, కాంగ్రెస్ పార్టీకి ఏదీ కలిసి రావట్లేదని అనేందుకు ఈ ఉదాహరణలు చాలు. భారత్ జోడో యాత్రతో ప్రజల మధ్య, వార్తల్లో నిలిచిన కాంగ్రెస్ వారసుడు.. ఇప్పుడు ఏకంగా పార్లమెంట్లో సీటు కోల్పోయారు. దాదాపు 8ఏళ్ల పాటు అసలు ఎన్నికల్లో పోటీ చేయలేని పరిస్థితి. రాహుల్ గాంధీ అసలు బీజేపీకి పోటీగా నిలవగలరా? మోదీ మేనియాను తట్టుకుని నిలబడే శక్తి ఆయనకు ఉందా?
వారసుడు ఓడిపోయాడు..!
బీజేపీని, ముఖ్యంగా ప్రధాని మోదీని ఢీకొట్టి నిలిచే సత్తా రాహుల్‌కు ఉందా అన్న ప్రశ్నలు నిత్యం ఉత్పన్నమవుతూనే ఉన్నాయి! అందుకు కారణాలు లేకపోలేదు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాభవం అనంతరం పార్టీ ఇచ్చిన 'అధ్యక్ష' పదవిని రాహుల్ వదులుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆ పీఠంపై ఆయన కూర్చునేందుకు ఇష్టపడనే లేదు. ఇక్కడ అత్యంత ఆందోళనకర విషయం.. వారసత్వంగా వచ్చిన ఉత్తర్‌ప్రదేశ్ అమేఠీ ఎంపీ సీటును ఆయన కోల్పోవడం! అప్పట్లో ఇది అందరిని షాక్‌కు గురిచేసింది. కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న అమేఠీ కూడా రాహుల్‌ను ధిక్కరించడం గమనార్హం.
Rahul Gandhi defamation case : ఇక 'నేషనల్ హెరాల్డ్ కేసు' విచారణలో భాగంగా.. ఈడీ కార్యాలయాల చుట్టూ రాహుల్ గాంధీ తిరగడం కొన్ని నెలల క్రితం హాట్ టాపిక్‌గా మారింది. ఉదయాన్నే ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి వెళ్లడం.. రాత్రికి తిరుగుపయనం అవ్వడం.. కొన్ని రోజుల పాటు రాహుల్ గాంధీకి ఈ పరిస్థితులు తప్పలేదు. అనేక ప్రశ్నలతో ఆయన్ని ఈడీ అధికారులు ఉక్కిరిబిక్కరి చేశారు.
ఇవన్నీ పక్కన పెడితే.. రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు గతంలో అనేకమార్లు ఆయన్ని ఇరకాటంలో పెట్టాయి. ప్రధాని మోదీవైపు ఎక్కుపెట్టిన అస్త్రాలన్నీ.. చివరికి ఆయన్నే గాయపరిచాయి! ఆ మాటలే.. క్షమాపణల నుంచి శిక్ష వరకు తీసుకొచ్చాయి.
'చౌకీదార్ చోర్ హే'..
Rahul Gandhi disqualified from Lok Sabha : రఫేల్ ఒప్పందపై సూప్రీంకోర్టును ఇచ్చిన తీర్పును ప్రస్తావిస్తూ.. ఓ సందర్భంలో 'చౌకీదార్ చోర్ హే'(ప్రధాని మోదీ దొంగ) అంటూ వ్యాఖ్యానించారు రాహుల్ గాంధీ. ఈ విషయాన్ని సుప్రీంకోర్టే వెల్లడించిందన్నారు. ఇది అప్పట్లో తీవ్ర దుమారానికి దారి తీసింది. బీజేపీ శ్రేణులు రాహుల్ గాంధీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాహుల్ గాంధీపై చర్యలు చేపట్టాలని సుప్రీంకోర్టులో కేసు వేశారు బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖి. కొంత కాలం తర్వాత.. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టుకు క్షమాపణలు తెలిపాల్సి వచ్చింది.
'కమాండర్ ఇన్ థీఫ్'..
Rahul Gandhi Modi surname : ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు అనేకమార్లు వివాదాస్పదమయ్యాయి. వీటిల్లో.. మోదీపై రాహుల్ చేసిన 'కమాండర్ ఇన్ థీఫ్' ఆరోపణ ఒకటి. రఫేల్ ఒప్పందాన్ని ఉద్దేశించి ఈ విమర్శలు చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత. ఈ విషయంపై ముంబైలోని ఓ కోర్టు రాహుల్ గాంధీకి సమన్లు జారీ చేసింది.
'మహాత్మా గాంధీని ఆర్ఎస్ఎస్ చంపేసింది'..
2014లో మహారాష్ట్ర ఠాణే భివాండి టౌన్షిప్లో ప్రసంగించారు రాహుల్ గాంధీ. ఈ నేపథ్యంలో 'మహాత్మా గాంధీ హత్య వెనుక ఆర్ఎస్ఎస్ హస్తం ఉంది' అని ఆరోపించారు. ఆ మాటలు విన్న స్థానిక ఆర్ఎస్ఎస్ కార్యకర్త రాజేశ్ కుంటే.. కాంగ్రెస్ నేతకు వ్యతిరేకంగా కోర్టులో కేసు వేశాడు. 2018లో రాహుల్ గాంధీపై కోర్టు అభియోగాలు మోపింది. కానీ ఆయన దోషిగా తేలలేదు. అనంతరం మహాత్మా గాంధీ హత్యపై ఆర్ఎస్ఎస్ను తాను ఎప్పుడు విమర్శించలేదని వివరణ ఇచ్చారు.
మరో ఆర్ఎస్ఎస్ కార్యకర్త అంజన్ బోరా వేసిన కేసులో.. రాహుల్ గాంధీకి సమన్లు పంపించింది గౌహతీలోని ఓ కోర్టు.
'రేప్ ఇన్ ఇండియా'..
Rahul Gandhi MP status : ప్రధాని మోదీ 'మేక్ ఇన్ ఇండియా' నినాదాన్ని ఉద్దేశించి.. రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర దుమారానికి దారి తీశాయి. ఓ సందర్భంలో ఝార్ఖండ్‌కు వెళ్లిన కాంగ్రెస్ నేత.. 'ప్రధాని మోదీ మోదీ మేక్ ఇన్ ఇండియా అంటుంటే.. ఇక్కడ మాత్రం రేప్ ఇన్ ఇండియా పరిస్థితులు కనిపిస్తున్నాయి,' అని అన్నారు. రాహుల్ మాటలు ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నాయంటూ.. ఆయనపై కొందరు దేశద్రోహ కేసు వేశారు.
లండన్‌లో ప్రసంగంపై వివాదం..
రాహుల్ గాంధీ.. ఇటీవలే లండన్ వెళ్లారు. అక్కడ బీజేపీకి వ్యతిరేకంగా పలు వ్యాఖ్యలు చేశారు. దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రమాదంలో ఉందని ఆరోపించారు. దీనిపై బీజేపీ తీవ్రస్థాయిలో మండిపడింది. రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలని పార్లమెంట్‌ను స్తంభింపజేసింది.
Rahul Gandhi Surat court : ఇక ఇప్పుడు.. ‘దొంగలందరికి ఇంటి పేరు మోదీనే ఎందుకు ఉంటుంది?’ అని 2019లో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష పడింది. పార్లమెంట్లో అనర్హత వేటు పడింది. అరెస్ట్‌కు అడుగు దూరంలో నిలబడ్డారు.. కాంగ్రెస్ వారసుడు!