Rahul Gandhi disqualification : రాహుల్ గాంధీపై అనర్హత వేటు- ఎన్నికలకూ దూరమే!
24 March 2023, 14:53 IST
Rahul Gandhi disqualified : కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీపై పార్లమెంట్లో అనర్హత వేటు పడింది. ఆయన తన వయనాడ్ సీటును కోల్పోయారు.
రాహుల్ గాంధీ
Rahul Gandhi disqualified : అనుకున్నదే జరిగింది! పరువు నష్టం కేసులో రెండేళ్ల జైలు శిక్షకు గురైన కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీపై లోక్‌సభలో అనర్హత వేటు పడింది. ఫలితంగా.. రాహుల్ గాంధీ తన వయనాడ్ సీటును కోల్పోయారు. లోక్‌సభ సెక్రటేరియట్.. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. తాజా పరిణామాలతో కాంగ్రెస్‌కు అతిపెద్ద షాక్ తగిలినట్టు అయ్యింది.
"వయనాడ్ నుంచి ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్న శ్రీ రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేస్తున్నాము. పరువు నష్టం కేసులో ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష పడటమే ఇందుకు కారణం. ఆయన దోషిగా తేలిన రోజు.. అంటే 2023 మార్చ్ 23 నుంచి రాహుల్ గాంధీపై అనర్హత వేటు అమల్లోకి వస్తుంది. 1951 రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ ఆర్టికల్ 102 (1)(ఈ) ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నాము," అని లోక్‌సభ సెక్రటేరియట్ ప్రకటనలో పేర్కొంది.
ఈ విధంగా అనర్హత వేటుకు గురయ్యే వారు.. మరో 8ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయలేరని చట్టాలు చెబుతున్నాయి.
ఇదీ కేసు..
Rahul Gandhi latest news : 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు కర్ణాటకలో పర్యటించారు రాహుల్ గాంధీ. కోలర్‌లో నిర్వహించిన ఓ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో బీజేపీపై, మోదీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. "దొంగలందరికి.. మోదీ అనే ఇంటి పేరే ఎందుకు ఉంటోంది?" అని అన్నారు. దేశం నుంచి పారిపోయిన నీరవ్ మోదీ, లలిత్ మోదీలతో పాటు ప్రధాని నరేంద్ర మోదీకి కూడా ఈ ఇంటి పేరు ఉండటంతో.. రాహుల్ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది. ఈ క్రమంలో.. 2019లో గుజరాత్‌లోని సూరత్ జిల్లా కోర్టులో రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా పిటిషన్ దాఖలైంది.
ఈ వ్యవహారంపై విచారణ పూర్తి చేసిన అనంతరం గురువారం కీలక తీర్పును వెలువరించింది సూరత్‌లోని జిల్లా కోర్టు. రాహుల్ గాంధీని దోషిగా తేలుస్తూ.. రెండేళ్ల జైలు శిక్షను విధించింది. 30 రోజుల బెయిల్‌తో పాటు తీర్పును సవాలు చేసేందుకు అవకాశాన్ని ఇచ్చింది.
నెక్స్ట్ ఏంటి..?
Rahul Gandhi defamation case : రాహుల్ గాంధీకి శిక్షపడటం, అనర్హత వేటుకు గురవడం వంటి అంశాలపై కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేసింది. కాగా.. రాహుల్ గాంధీపై వచ్చిన తీర్పును ఎగువ కోర్టులో కాంగ్రెస్ సవాలు చేసే అవకాశం ఉంది. అక్కడ కూడా సానుకూలంగా తీర్పు రాకపోతే.. సుప్రీంకోర్టుకైనా వెళ్లేందుకు సన్నద్ధమవుతున్నట్టు సమాచారం.
సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పుపై ఎగువ కోర్టులో స్టే పడినా లేదా పూర్తిగా కొట్టివేసినా.. రాహుల్ గాంధీ జైలుకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఆయనపై వేసిన అనర్హత వేటును కూడా ఉపసంహరించుకోవాల్సి ఉంటుంది.