Rahul Gandhi : రాహుల్ గాంధీపై అనర్హత వేటు ఖాయమేనా? నెక్స్ట్ ఏంటి?
Rahul Gandhi defamation case : రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష పడింది. మరి నెక్స్ట్ ఏంటి? చట్టాల ప్రకారం ఆయనపై పార్లమెంట్లో ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది?
Rahul Gandhi defamation case live updates : పరువు నష్టం కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీకి గుజరాత్‌లోని సూరత్ కోర్టు.. రెండేళ్ల జైలు శిక్ష విధించడం వార్తల్లో నిలిచింది. కోర్టు తీర్పుతో కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీపై పార్లమెంట్లో అనర్హత వేటు పడే అవకాశం ఉందని పలువురు న్యాయ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. చట్టం ప్రకారం.. రాహుల్ గాంధీ, తన వయనాడ్ సీటును కోల్పోయే ప్రమాదం ఉందని చెబుతున్నారు.
రాహుల్ గాంధీపై కేసు ఇది..
2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు కర్ణాటకలో పర్యటించారు రాహుల్ గాంధీ. కోలర్‌లో నిర్వహించిన ఓ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో బీజేపీపై, మోదీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. "దొంగలందరికి.. మోదీ అనే ఇంటి పేరే ఎందుకు ఉంటోంది?" అని అన్నారు. దేశం నుంచి పారిపోయిన నీరవ్ మోదీ, లలిత్ మోదీలతో పాటు ప్రధాని నరేంద్ర మోదీకి కూడా ఈ ఇంటి పేరు ఉండటంతో.. రాహుల్ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది. ఈ క్రమంలో.. 2019లో గుజరాత్‌లోని సూరత్ జిల్లా కోర్టులో రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా పిటిషన్ దాఖలైంది.
Rahul Gandhi defamation case : ఈ వ్యవహారంపై విచారణ పూర్తి చేసిన అనంతరం గురువారం కీలక తీర్పును వెలువరించింది సూరత్‌లోని జిల్లా కోర్టు. రాహుల్ గాంధీని దోషిగా తేలుస్తూ.. రెండేళ్ల జైలు శిక్షను విధించింది. 30 రోజుల బెయిల్‌తో పాటు తీర్పును సవాలు చేసేందుకు అవకాశాన్ని ఇచ్చింది.
రాహుల్ గాంధీకి నెక్స్ట్ ఏంటి?
రాహుల్ గాంధీకి 30 రోజుల పాటు బెయిల్ లభించినా.. సూరత్ కోర్టు తీర్పుతో ఆయనపై అనర్హత వేటు పడే అవకాశం ఉందని న్యాయశాఖ నిపుణులు చెబుతున్నారు. 1951 రిప్రసెంటేటివ్ ఆఫ్ ది పీపుల్ యాక్ట్ సెక్షన్ 8(3) ప్రకారం.. పార్లమెంట్ సభ్యుడిని ఏదైనా కోర్టు దోషిగా తేలుస్తూ.. కనీసం 2ఏళ్ల జైలు శిక్ష విధించినట్టు అయితే, సంబంధిత ఎంపీపై అనర్హత వేటు పడాలి!
Rahul Gandhi Jail sentence : ఇక రాహుల్ గాంధీ వేసిన సెక్షన్ 499 (క్రిమినల్ డిఫమేషన్ కేసు).. చాలా అరుదైనదని న్యాయశాఖ నిపుణులు చెబుతున్నారు. ఇక సూరత్ కోర్టు తీర్పుతో.. రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేసి, వయనాడ్ సీటును ఖాళీగా ఉందని ప్రకటించే అధికారం లోక్‌సభ సెక్రటేరియట్‌కు ఉంది. సూరత్ కోర్టు తీర్పుపై.. ఎగువ కోర్టులేవీ స్టే విధించకపోతే ఇదే జరుగుతుంది. ఈ తీర్పును ఎగువ కోర్టులు కొట్టివేయకపోతే.. మరో 8ఏళ్ల పాటు రాహుల్ గాంధీ ఎలాంటి ఎన్నికల్లోనూ పోటీచేయలేరు కూడా!
Rahul Gandhi latest news : అయితే.. సూరత్ కోర్టు తీర్పును ఎగువ కోర్టులో సవాలు చేసేందుకు రాహుల్ గాంధీ న్యాయ బృందం సన్నద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. సూరత్ తీర్పును అక్కడ కొట్టివేయకపోతే.. రాహుల్ బృందం సూప్రీంకోర్టుకు కూడా వెళ్లేందుకు సిద్ధంగా ఉందని సమాచారం.