Prajwal Revanna : కర్ణాటకను కుదిపేస్తున్న సెక్స్ కుంభకోణం.. దేశాన్ని విడిచి వెళ్లిపోయిన రేవన్న!
29 April 2024, 11:13 IST
Prajwal Revanna sex scandal : కర్ణాటక ఎంపీ, మాజీ ప్రధాని దేవే గౌడ మనవడు ప్రజ్వల్ రేవన్నపై తీవ్ర లైంగిక దాడి ఆరోపణలు వచ్చాయి. చాలా మంది మహిళలపై ఆయన లైంగిక దాడికి పాల్పడినట్టు వార్తలు వస్తున్నాయి. వీటన్నింటి మధ్య.. ఆయన ఇండియాను విడిచి వెళ్లిపోయారు.
లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ ప్రజ్వల్ రేవన్న..
Prajwal Revanna : 2024 లోక్‌సభ ఎన్నికల మధ్య.. కర్ణాటకను సెక్స్ కుంభకోణం కుదిపేస్తోంది. ఎన్నికల వేళ బీజేపీ పొత్తు కుదుర్చుకున్న జేడీఎస్‌కు చెందిన హసన్ ఎంపీ, మాజీ ప్రధానమంత్రి మంత్రి హెచ్డీ దేవేగౌడ మనవడు.. ప్రజ్వల్ రేవన్నపై వచ్చిన లైంగిక దాడి ఆరోపణలు సంచలనం సృష్టించాయి. ఓ మహిళను ఆయన చాలా కాలం పాటు లైంగికంగా హింసించాడని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు సంబంధించిన అశ్లీల దృశ్యాలు.. హసన్ జిల్లాలో సర్క్యులేట్ అవుతున్నాయి.
ఎవరీ ప్రజ్వల్ రేవన్న? అసలేం జరిగింది?
మాజీ ప్రధాని, జేడీఎస్ నేత హెచ్డీ దేవే గౌడ మనవడు ఈ ప్రజ్వల్ రేవన్న. ఈయన దేవేగౌడ కుమారుడు హెచ్డీ రేవన్న కుమారుడు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి.. రేవన్నకు బాబాయ్ వరుస అవుతారు. ప్రస్తుతం.. ఎంపీ ప్రజ్వల్ రేవన్న.. హసన్ నియోజకవర్గానికి ఎంపీగా ఉన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల రెండో దశలో భాగంగా.. ఆయన బరిలో దిగిన హసన్ నియోజకవర్గంలో శుక్రవారం పోలింగ్ జరిగింది.
ఓ మహిళ.. లైంగిక దాడికి గురవుతున్న దృశ్యాలు శుక్ర, శనివారాల్లో వైరల్ అయ్యాయి. ఆ వీడియోలో నిందితుడుగా ఉన్నది హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవన్న అని సమాచారం. బాధితురాలు ప్రజ్వల్ రేవన్న ఇంట్లో పని చేసినట్టు తెలుస్తోంది. ఆమె ఫిర్యాదుతో.. రేవన్నపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అంతేకాదు.. ప్రజ్వల్ రేవన్న తండ్రి హెచ్డీ రేవన్నపైనా ఆరోపణలు చేసింది ఆ మహిళ.
HD Ravanna Prajwal Revanna news : "హెచ్డీ రేవన్న, ప్రజ్వల్ రేవన్నలు.. తమ ఇంట్లో పనిచేసే మహిళా సిబ్బందిపై లైంగిక దాడి చేశారు. వారిలో నేను కూడా ఉన్నాను. నేను ఉద్యోగంలో చేరిన నాలుగో నెలకు.. నన్ను ప్రజ్వల్ రేవన్న తన క్వార్టర్స్‌కి పిలిచాడు. ఇంట్లో మొత్తం ఆరుగురు మహిళా సిబ్బంది ఉన్నారు. అందరు జాగ్రత్తగా ఉండాలని సిబ్బందిలోని పురుషులు చెప్పేవారు," అని ఆ మహిళ చెప్పుకొచ్చింది.
"భార్య ఇంట్లో లేనప్పుడు.. హెచ్డీ రేవన్న.. మహిళా సిబ్బందిని స్టోర్‌రూమ్‌కి పిలిచేవాడు. పండ్లు ఇస్తున్నట్టు నటించి.. ముట్టుకునేవాడు. మా చీరలకు పిన్నులు తీసేసి, లైంగిక దాడి చేసేవాడు," అని బాధితురాలు ఆరోపించింది.
అంతేకాదు.. ప్రజ్వల్ రేవన్న.. వీడియో కాల్స్‌లో తన కూతురితోనూ అసభ్యకరంగా ప్రవర్తించినట్టు బాధితురాలు తెలిపింది. చాలాసార్లు ఫోన్ల మీద ఫోన్లు చేస్తుండటంతో.. తన కూతురు, ప్రజ్వల్ రేవన్న నెంబర్ని బ్లాక్ చేసినట్టు వివరించింది.
Karnataka sex scandal : తనతో పాటు చాలా మంది బాధితులు ఉన్నారని, వారు గొంతు విప్పేందుకు ప్రయత్నిస్తుండటం చూసి.. తాను ముందుకు వచ్చానని బాధితురాలు చెప్పుకొచ్చింది.
కాగా.. బాధితురాలు.. ప్రజ్వల్ రేవన్నకు బంధువని తెలుస్తోంది! ఆమె.. హెచ్డీ రేవన్న భార్య భవానీ రేవన్నకు బంధువని సమాచారం.
మరోవైపు.. ఆదివారం ఉదయం ప్రజ్వల్ రేవన్న ఇండియాని విడిచి.. జర్మనీ వెళ్లారు. ఆయన జర్మనీ ఎందుకు వెళ్లారో తెలియరాలేదు. కానీ.. వెళ్లే ముందు ఆయన కూడా పోలీసు కేసు పెట్టారు. వీడియోలను మార్ఫ్ చేసి, తనని ఇరికిస్తున్నారని పేర్కొన్నారు.
మరోవైపు.. ఇదంతా రాజకీయ కుట్ర అని, ప్రజ్వల్ రేవన్న పేరును చెడగొట్టేందుకు, ఎన్నికల్లో ఓడించేందుకు ఇలాంటి పనులు చేస్తున్నారని.. బీజేపీ, జేడీఎస్ ఎలక్షన్ ఏజెంట్ ఆరోపించారు.
Hasan sex scandal : "మార్ఫ్డ్ వీడియోలను సర్క్యులేట్ చేసి.. హసన్ ప్రజలు ప్రజ్వల్ రేవన్నకు ఓటు వేయవద్దని నవీన్ గౌడ, అతని మద్దతుదారులు చెబుతున్నారు. పెన్‌డ్రైవ్, సీడీలు, వాట్సాప్‌ల ద్వారా ప్రజ్వల్ రేవన్న పేరును నాశనం చేసేందుకు ఇలాంటి పనులు చేస్తున్నారు. ఇందులో నిజం లేదు," అని ఎలక్షన్ ఏజెంట్ పూర్ణచంద్ర తెలిపారు.
రాజకీయ దుమారం..
ఇక 2024 లోక్‌సభ ఎన్నికల మధ్యలో ఈ హసన్ సెక్స్ కుంభకోణం వార్తలకు ఎక్కడంతో.. కర్ణాటకలో ఈ విషయంపై రాజకీయ దుమారం చెలరేగింది.
ప్రజ్వల్ రేవన్న అశ్లీల దృశ్యాలకు సంబంధించి.. పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసుకోగా.. అధికారంలోని కాంగ్రెస్ ప్రభుత్వం.. దర్యాప్తు చేపట్టేందుకు సిట్‌ని నియమించింది.
అంతేకాదు.. ఈ విషయంపై బీజేపీ, జేడీఎస్‌లు స్పందించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది.
Hasan sex scandal victim : ప్రజ్వల్ రేవన్నపై వచ్చిన లైంగిక దాడి ఆరోపణల మీద.. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి స్పందించారు.
"నేరం ఎవరు చేసినా శిక్ష పడాల్సిందే. కానీ సిట్ బృందం దర్యాప్తు ముగిసేంతవరకు వేచి చూద్దాము. నిజం తెలుస్తుంది. ఇది నాకు సంబంధించినది కాదు. సిట్ దర్యాప్తునకు ఆదేశించారు. ఒకవేళ.. ప్రజ్వల్ రేవన్న దేశాన్ని విడిచిపెట్టి వెళ్లిపోతే.. ఆయన్ని వెనక్కి తీసుకొచ్చే బాధ్యత.. సిట్ టీమ్‌దే," అని హెచ్డీ కుమారస్వామి తెలిపారు.
ఈ పూర్తి వ్యవహారంపై బీజేపీ మౌనంగా ఉండిపోయింది. హసన్ సెక్స్ కుంభకోణం నుంచి దూరం జరిగిపోయింది. ప్రజ్వల్ రేవన్నకు సంబంధించిన అశ్లీల వీడియోలకు తమకు సంబంధం లేదని చెప్పింది. తాము కామెంట్లు చేయమని స్పష్టం చేసింది.