Lok Sabha elections : కర్ణాటకలో బీజేపీ- జేడీఎస్ కూటమి ఫలితాల్ని ఇచ్చేనా? కాంగ్రెస్ జోరు కొనసాగేనా?
Lok Sabha elections 2024 : లోక్‌సభ ఎన్నికల వేళ కర్ణాటకలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. బీజేపీ- జేడీఎస్‌లు కూటమిగా ఏర్పడి విజయం కోసం కృషిచేస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల జోరును కొనసాగించాలని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా కృషిచేస్తోంది. మరి గెలుపెవరిది? ప్రజలు ఎవరి పక్షాన ఉన్నారు?
2024 Lok Sabha elections Karnataka : 2024 ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది.. దేశవ్యాప్తంగా రాజకీయ వేడి పెరుగుతోంది. ఈసారి కూడా గెలిచి హ్యాట్రిక్ సాధించాలని బీజేపీ భావిస్తోంది. అదే సమయంలో.. ప్రధాని నరేంద్ర మోదీని గద్ద దించేందుకు విపక్షాలన్నీ 'ఇండియా' కూటమిగా ఏర్పడి పావులు కదుపుతున్నాయి. రెండు పక్షాలకి కూడా దక్షిణాది రాష్ట్రాలు చాలా కీలకం! వీటిల్లో కర్ణాటక రాజకీయాలు చాలా ఆసక్తికరంగా మారాయి. నేతల రాకపోకలు పెరిగాయి. ప్రజలను ఆకర్షించేందుకు పార్టీలు ఇప్పటికే వ్యూహాలు రచిస్తున్నాయి. మరి కర్ణాటకలో ఏ పార్టీ బలం ఎంత? గత ఎన్నికల్లో ఏం జరిగింది? వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము రండి..
కర్ణాటకలో 2019 లోక్‌సభ ఎన్నికల లెక్కలు..
కర్ణాటకలో మొత్తం 28 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. వీటికి.. 2019లో రెండు దశల్లో ఎన్నికలు జరిగాయి. బీజేపీ 27 స్థానాల్లో పోటి చేయగా.. మరొక స్థానాన్ని, ఎన్డీ కూటమిలో ఉండి స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీచేసిన సుమలతకు అప్పగించింది కమలదళం. ఇక కాంగ్రెస్ 21 సీట్లల్లో, జేడీఎస్ 7 స్థానాల్లో పోటీ పడ్డాయి. అప్పట్లో.. ఈ రెండు పార్టీలు కూటమిగా ఉండేవి. బీఎస్పీ సైతం 28 సీట్లల్లో పోటీ చేసింది.
Karntaka Lok Sabha elections : ఇక ఫలితాల విషయానికొస్తే.. కాంగ్రెస్- జేడీఎస్‌కు గట్టి షాకే తగిలింది! రాష్ట్రంలో.. అప్పట్లో ఈ రెండు పార్టీల కూటమి అధికారంలో ఉంది. కానీ రెండు చొరకటి, అంటే.. మొత్తం మీద, 28 సీట్లల్లో గెలిచింది రెండు చోట్లే! అధికార పక్షానికి షాక్ ఇస్తూ.. బీజేపీ ఏకంగా 25 నియోజకవర్గాల్లో భారీ విజయాన్ని దక్కించుకుంది. కమలదళం మద్దతుతో పోటీ చేసిన సుమలత సైతం.. గెలుపొందారు. ఫలితంగా.. 28 స్థానాల్లో ఎన్డీఏ కూటమికి 26 సీట్లు దక్కాయి!
బీఎస్పీ ఖాతా కూడా తెరవలేదు.
పార్టీల వారీగా ఓట్లు శాతాన్ని పరిగణలోకి తీసుకుంటే.. బీజేపీకి 51.75శాతం ఓట్లు పడ్డాయి. ఇండిపెండెంట్‌కు 3.9శాతం ఓట్లు పడ్డాయి. కాంగ్రెస్‌కు అది 32.11శాతంగా ఉంది. జేడీఎస్‌కు 9.7శాతం ఓట్లు మాత్రమే పడ్డాయి. బీఎస్పీకి అత్యల్పంగా. 1.18శాతం మంది ఓట్లు వేశారు.
కర్ణాటకలో నేటి రాజకీయాలు..
Lok Sabha elections BJP : 2019 లోక్‌సభ ఎన్నికల తర్వాత.. కర్ణాటకలో పెను మార్పులే చోటుచేసుకున్నాయి. కొంతకాలానికే.. అధికారంలో ఉన్న కాంగ్రెస్- జేడీఎస్ ప్రభుత్వం కూలిపోయింది. కొందరు ఎమ్మెల్యేలు వెళ్లి బీజేపీలో చేరారు. ఫలితంగా.. మెజారిటీతో బీజేపీ ప్రభుత్వాన్ని స్థాపించింది. యడియూరప్ప మరోమారు సీఎం అయ్యారు.
పరిస్థితులు ప్రశాంతంగా ఉన్నాయనుకున్న సమయంలో.. యడియూరప్పను సీఎం పదవి నుంచి తప్పించింది కమలదళం హైకమాండ్. ఇది రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆయన స్థానంలో.. బసవరాజ్ బొమ్మైని ముఖ్యమంత్రిని చేసింది.
కానీ బీజేపీ ప్రభుత్వంపై అనేక ఆరోపణలు వచ్చాయి. మరీ ముఖ్యంగా.. '40 పర్సెంట్ కమిషన్ గవర్న్మెంట్' అంటూ విమర్శలు వెల్లువెత్తాయి. దీనిని ఉపయోగించుకుని, ప్రజల్లోకి వెళ్లింది కాంగ్రెస్. 224 సీట్లున్న అసెంబ్లీకి గతేడాది మేలో ఎన్నికలు జరిగాయి. ఈసారి.. ఒంటరిగానే పోటీ చేసింది కాంగ్రెస్.
Lok Sabha elections Congress : ఫలితాల విషయానికి వచ్చేసరికి.. కాంగ్రెస్ ప్రభంజనం సృష్టించింది. బీజేపీ అనూహ్య రీతిలో కుప్పకూలింది. మెజారిటీకి 113 సీట్లు అవసరం ఉండగా.. కాంగ్రెస్ పార్టీ 135 చోట్ల గెలిచింది. బీజేపీకి 66 సీట్లు వచ్చాయి. జేడీఎస్ 19 సీట్లతోనే సరిపెట్టుకుంది.
ఈ ఉత్సాహంతో కాంగ్రెస్ పార్టీ మంచి జోరు మీద కనిపిస్తోంది. హామీనిచ్చిన పథకాలను అమలు చేస్తూ వెళుతోంది. తమ పథకాలపైనే ఆశలు పెట్టుకుని, ఈసారి లోక్‌సభ ఎన్నికల్లోకి వెళ్లాలని భావిస్తోంది కాంగ్రెస్. సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌లు.. అన్ని దగ్గరుండి చూసుకుంటున్నారు. గెలుపుపై పార్టీ ధీమాగా ఉంది.
JDS Lok Sabha elections : వాస్తవానికి 2019లో కూడా కాంగ్రెస్ అధికారంలో ఉంది. కానీ అప్పుడు.. అనూహ్యంగా చతికిలపడింది. ఈసారి అలా జరగకుండా.. పక్కా ప్రణాళికలు రచిస్తోంది కాంగ్రెస్ పార్టీ.
కాంగ్రెస్ పార్టీ బలహీనపడిందని దేశవ్యాప్తంగా వార్తలు వినిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఉత్తరాదిన ఒక్కటే రాష్ట్రంలో (హిమాచల్ ప్రదేశ్) అధికారంలో ఉంది. దక్షిణాదిలో కర్ణాటక, తెలంగాణల్లో ప్రభుత్వాన్ని స్థాపించింది. దక్షిణాదిన తన బలాన్ని నిరూపించుకోవడం అత్యావశ్యకం.
బీజేపీ- జేడీఎస్ మైత్రితో ఫలితం ఉంటుందా..?
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఆ రాష్ట్రంలో పలు కీలక, ఆసక్తికర పరిమాణాలు చోటుచేసుకున్నాయి. ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన జేడీఎస్.. దారుణంగా ఓటమి పాలైంది. గొప్ప ప్రాంతీయ పార్టీగా ఇప్పటివరకు మంచి గుర్తింపు ఉన్న ఆ పార్టీ, తన వైభవాన్ని కోల్పోతోందని, రాష్ట్రంపై పట్టు కోల్పోతోందని వాదనలు వినిపించాయి. ఇదే సమయంలో.. బీజేపీ- జేడీఎస్‌ల మధ్య పొత్తు కుదిరింది! ఇప్పుడు ఈ రెండు పార్టీలు కలిసి.. లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేయనున్నాయి. మరి.. బలహీనంగా ఉన్న జేడీఎస్‌తో బీజేపీకి లాభం ఉంటుందా? లేదా? అనేది వేచి చూడాలి.
BJP JDS alliance in Karnataka : ఇక 2024 లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించి.. హ్యాట్రిక్ కొట్టాలని దృఢ సంకల్పంతో ఉంది బీజేపీ. ఈ నేపథ్యంలో.. దక్షిణాదిలో గెలవడం ఆ పార్టీకి చాలా అవసరం. ఇదే విషయంపై బీజేపీ అగ్రనేత అమిత్ షా ఫోకస్ చేసినట్టు కనిపిస్తోంది. ఇటీవలే ఆయన కర్ణాటక నేతలో చర్చలు జరిపారు. తాను చేసిన ప్లాన్‌ని వివరించారని తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో ఆ ప్లాన్‌ని అమలు చేస్తే.. లోక్‌సభ ఎన్నికల్లో కచ్చితంగా విజయం సాధిస్తామని బీజేపీ నేతలు చెబుతుండటం గమనార్హం.
కర్ణాటక ఎన్నికల్లో కులాల ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. 2023 అసెంబ్లీ ఎన్నికలు ఇందుకు ఉదాహరణ. రాష్ట్రంలో లింగాయత్‌లు, ఒక్కలిగల ప్రభావం అధికంగా ఉంటుంది. ఉత్తర కర్ణాటకలో లింగాయత్ ఓటర్లు ఎక్కువగా ఉంటే.. బెంగళూరు సహా దక్షిణ కన్నడలో ఒక్కలిగలు అధికంగా ఉన్నారు. వీరిని ప్రసన్నం చేసుకునేందుకు అనాదిగా పార్టీలు తీవ్రంగా కృషిచేస్తూనే ఉన్నాయి. 2024 లోక్‌సభ ఎన్నికల్లోనూ ఇది కీలకంగా మారబోతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మరి కర్ణాటక ప్రజలు ఎవరి పక్షాన ఉన్నారు? అసెంబ్లీ ఎన్నికల్లో చతికిలపడిన బీజేపీ.. పుంజుకుని, లోక్‌సభ సమరంలో విజయం సాధిస్తుందా? లేక కాంగ్రెస్.. వచ్చే ఎన్నికల్లోనూ తన జోరును కొనసాగిస్తుందా? ఈ రెండు పార్టీల హోరాహోరీ సమరం మధ్యలో జేడీఎస్ పరిస్థితి ఎలా ఉంటుంది? వంటి ప్రశ్నలకు సమాధానం కోసం 2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాల వరకు ఎదురు చూడాల్సిందే!
సంబంధిత కథనం