Amit Shah on Alliance : ఎన్డీయేలోకి కొత్త మిత్రులు, ఏపీలో పొత్తులపై అమిత్ షా ఆసక్తికర వ్యాఖ్యలు
Amit Shah on Alliance : ఏపీలో పొత్తులపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయంగా ఎంత పెద్ద కూటమి అంటే అంత మంచిదన్నారు. ఎన్డీయేలోకి త్వరలో కొత్త మిత్రులు వస్తున్నారన్నారు.
Amit Shah on Alliance : ఏపీలో పొత్తులపై దిల్లీ కేంద్రం చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. టీడీపీ అధినేత చంద్రబాబు బీజేపీ పెద్దలతో సమావేశం అయ్యారు. ఆ వెంటనే వైసీపీ అధినేత, సీఎం జగన్ ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఈ తరుణంలో ఏపీలో పొత్తులపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో ఏపీలో పొత్తులు కొలిక్కివస్తాయన్నారు. ఎన్డీయేలోకి కొత్త మిత్రులు వస్తున్నారన్న అమిత్ షా... రాజకీయంగా ఎంత పెద్ద కూటమి ఉంటే అంత మంచిదన్నారు. ఫ్యామిలీ ప్లానింగ్ కుటుంబానికి బాగుంటుంది, రాజకీయాలకు కాదన్నారు. బీజేపీ తన మిత్రులను ఎప్పుడూ బయటకు పంపలేదన్నారు. ఆయా రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ సమీకరణాల దృష్ట్యా బయటకు వెళ్లి ఉండవచ్చన్నారు. ఎకనామిక్ టైమ్స్ సదస్సులో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడారు. ఏపీలో పొత్తులు త్వరలోనే కొలిక్కి వస్తాయని ఈ సదస్సులో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పొత్తులపై ఇప్పుడే ఏం మాట్లాడలేమని స్పష్టం చేశారు. పంజాబ్‌లో అకాలీదళ్‌తో చర్చలు నడుస్తాయన్నారు.
చంద్రబాబు దిల్లీ పర్యటన
టీడీపీ అధినేత చంద్రబాబు ఇటీవలే దిల్లీలో అమిత్ షాతో భేటీ అయ్యారు. అమిత్ షా నివాసానికి వెళ్లిన చంద్రబాబు ఏకాంతంగా భేటీ అయ్యారు. పొత్తులు, సీట్ల సర్దుబాటుపై చర్చించినట్టు సమాచారం. దిల్లీ నుంచి తిరిగి వచ్చిన చంద్రబాబు...హైదరాబాద్ లో జనసేన అధినేత పవన్‌తో సీట్ల కేటాయింపులపై చర్చించినట్టు సమాచారం. చంద్రబాబు దిల్లీ పర్యటన తర్వాత రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి.
ఎన్డీయేలోకి టీడీపీ?
ఇటీవల అమిత్ షాతో చంద్రబాబు భేటీ పూర్తైన తర్వాత ఇరు పార్టీల నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. టీడీపీ అధినేత చంద్రబాబుతో చర్చలపై పెదవి విప్పని బీజేపీ వర్గాలు చర్చల గురించి అధికారికంగా ఎలాంటి ప్రకటనలు, సమాచారం ప్రత్యక్షంగా, పరోక్షంగా తమ నుంచి వచ్చే అవకాశం లేదని బీజేపీ వర్గాలు స్పష్టం చేశాయి. చర్చలపై మాట్లాడేందుకు బీజేపీ నాయకులు ఏమాత్రం ఇష్టపడలేదు. అమిత్ షాతో చంద్రబాబు భేటీ తర్వాత టీడీపీ, బీజేపీ మధ్య ఒక అవగాహన కుదిరినట్లు టీడీపీ వర్గాలు సంకేతాలను ఇచ్చాయి. ఇరు పార్టీల ప్రయోజనాల రీత్యా కలిసి పని చేయడంపై టీడీపీ, బీజేపీ మధ్య ఒక అవగాహన కుదిరినట్లు తెలుస్తోంది. సుమారు గంటపాటు జరిగిన చర్చల్లో ఏపీలో ఇరుపార్టీలను బలోపేతం చేయడంపై చర్చలు జరిగినట్టు తెలుస్తోంది . దేశవ్యాప్తంగా ఎన్డీయే కూటమిని తిరిగి బలోపేతం చేస్తున్నామని, దేశాన్ని బలోపేతం చేయాలంటే అన్ని ప్రాంతాల్లో తమ కూటమి అవసరమని అమిత్ షా పేర్కొన్నట్లు తెలుస్తోంది.
ఇతర రాష్ట్రాల్లో కూడా పలు ప్రాంతీయ పార్టీలు బీజేపీ వైపు చూస్తున్నాయని, ఈసారి 400 సీట్లకు పైగా విజయం సాధించాలనే లక్ష్యం పెట్టుకున్నాయని చంద్రబాబుకు వివరించినట్టు సమాచారం. ఏపీలో బీజేపీ-టీడీపీ మధ్య పొత్తు కుదిరితే బీజేపీ గెలుపు అవకాశాలున్న సీట్ల గురించి కూడా అమిత్ షా ప్రస్తావించినట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రయోజనాల కోసమే తాము రాజకీయ నిర్ణయాలు తీసుకుంటామని చంద్రబాబు భేటీ తర్వాత మీడియాతో అన్నారు.
సంబంధిత కథనం