AP BJP and Janasena: ఏపీలో పొత్తులపై అధిష్టానానిదే తుది నిర్ణయం- పురంధేశ్వరి
AP BJP and Janasena: ఏపీలో రాజకీయ పొత్తులపై బీజేపీ అధిష్టానమే తుది నిర్ణయం తీసుకుంటుందని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి స్పష్టం చేశారు. జనసేనతో పొత్తు కొనసాగుతుందన్నారు.
AP BJP and Janasena: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల వాతావరణం క్రమంగా వేడెక్కుతోంది. ఎన్నికల సన్నద్ధతపై బీజేపీ దృష్టి సారించింది. సార్వత్రిక ఎన్నికల కసరత్తులో భాగంగా విజయవాడలోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో పదాధికారులు, ముఖ్యనేతల సమావేశాన్ని నిర్వహించారు.
ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి, జాతీయ కార్యదర్శి సత్యకుమార్, ఇతర ముఖ్య నేతలు సమావేశంలో పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో పొత్తులు, ఇతర అంశాలపై నేతల అభిప్రాయాలు తీసుకున్నారు. ఏపీలో జనసేన బీజేపీ మిత్రపక్షాలేనని పురందేశ్వరి స్పష్టం చేశారు.
వైఎస్ షర్మిల ఏ పార్టీలో చేరితే మాకెందుకు? బీజేపీని బలోపేతం చేయడం కోసమే తాము పనిచేస్తున్నట్లు చెప్పారు. పొత్తులతో పాటు పార్టీని బలోపేతం చేయడంపై చర్చించినట్టు వివరించారు. పొత్తులపై రాష్ట్ర పార్టీ అభిప్రాయాలను అధిష్ఠానానికి వివరిస్తామని, అంతిమ నిర్ణయం అధిష్ఠానం తీసుకుంటుందని స్పష్టం చేశారు. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమిపై పురందేశ్వరి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వకూడదనే జనసేన అధ్యక్షుడి ప్రకటనల నేపథ్యంలో బీజేపీ ఊగిసలాట ఎదుర్కొంటోంది.
ఎన్నికల దృష్ట్యా తీసుకోవాల్సిన నిర్ణయాలపై చర్చించినట్టు బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ చెప్పారు. హామీలు అమలు చేయని ప్రభుత్వంపై పోరాడాలని, భాజపాపై అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టాలని నిర్ణయించామన్నారు. ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చేలా కార్యాచరణ రూపొందిస్తామన్నారు.
బీజేపీలో కొత్త నేతల చేరికలపై దృష్టి సారించామన్నారు. ఎన్నికల మేనిఫెస్టో కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. పొత్తుల అంశంపై సమావేశంలో చర్చించామన్నారు. పొత్తుల అంశంపై మేం ఒక్కరమే తీసుకునే నిర్ణయం కాదని, తమతో పొత్తు పెట్టుకోవాలనుకొనే వారు కూడా స్పందించాల్సి ఉంటుందన్నారు. తాము మాత్రమే పొత్తు విషయంలో ఎందుకు మాట్లాడాలని అవతలి పక్షం కూడా మాట్లాడాల్సి ఉందన్నారు.
తమతో పొత్తు కోరేవారు అధిష్ఠానంతో మాట్లాడాలని, పవన్ కళ్యాణ్ లోకేష్‌తో ఎందుకు మాట్లాడించలేదన్నారు. ఏపీలో బీజేపీ బలహీనంగా ఉంది. తెదేపాతో పొత్తులో కలిసి రావాలని జనసేన అధినేత పవన్ చెబితే సరిపోదని, పొత్తు కోరేవారు ముందుకు వస్తేనే సమస్య పరిష్కారం అవుతుందన్నారు.బీజేపీ పదాధికారుల సమావేశం ముగిసిన తర్వాత జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్.. భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరితో భేటీ అయ్యారు.