PM Modi : కాంగ్రెస్ కు కనీసం 40 సీట్లు రావాలని కోరుకుంటున్నా - ప్రధాని మోదీ సెటైర్లు
PM Modi in Rajya Sabha: రాజ్యసభలో కాంగ్రెస్ విపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే చేసిన వ్యాఖ్యల(అబ్ కీ బార్, 400 పార్)పై స్పందించారు ప్రధాని మోదీ. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కనీసం 40 సీట్లు రావాలని తాను ప్రార్థిస్తున్నట్లు సెటైర్లు విసిరారు.
PM Modi in Rajya Sabha: 'అబ్ కీ బార్, 400 పార్' అంటూ కాంగ్రెస్ విపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే రాజ్యసభలో చేసిన వ్యాఖ్యలపై స్పందించారు ప్రధాని మోదీ. బుధవారం రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ప్రసంగించిన మోదీ…. కాంగ్రెస్ ను టార్గెట్ చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కు 40 సీట్లు కూడా రాకపోవచ్చని టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ…. సెటైర్లు విసిరారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కనీసం 40 సీట్లు గెలుచుకోవాలని తాను ప్రార్థిస్తున్నట్లు చురుకలు అంటించారు.
“నేను మల్లిఖార్జున ఖర్గే 'అబ్ కీ బార్ 400 పార్' ప్రసంగం వింటున్నప్పుడు… అంతగా మాట్లాడే స్వేచ్ఛ అతనికి ఎలా వచ్చిందని నేను ఆశ్చర్యపోయాను. ఆ ఇద్దరు కమాండర్లు అక్కడ లేరని నేను గమనించాను. మాకు 400 సీట్లు రావాలని ఖర్గే ఆశించారు. ఖర్గే జీ ఐసా మౌకా ఫిర్ కహాన్ మిలేగా (అలాంటి అవకాశం ఎప్పుడు వస్తుందో) ఆలోచించి ఫోర్లు, సిక్సర్లు కొట్టండి" అంటూ తనదైనశైలిలో సెటైర్లు విసిరారు ప్రధాని మోదీ.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు ప్రధాని మోదీ. కాంగ్రెస్ పాలనలో కేవలం కుటుంబ సభ్యులకు మాత్రమే భారతరత్న అవార్డులు ఇచ్చారని దుయ్యబట్టారు. కుటుంబ సభ్యుల పేర్లతో రోడ్లకు పేరు పెట్టిందని ఆక్షేపించారు. “కాంగ్రెస్ పార్టీని ఎవరు స్థాపించారని నేను అడగను, మీరు రాజ్‌పథ్‌ను కర్తవ్య పథంగా ఎందుకు మార్చలేదు, సాయంత్రం 5 గంటలకు బడ్జెట్‌ను ఎందుకు నిర్వహించలేదు. ప్రాంతీయ భాషలపై ఎందుకు దృష్టి పెట్టలేదు?" అని ప్రధాని మోదీ ప్రశ్నించారు.
కాంగ్రెస్ కుల గణన డిమాండ్‌పై ప్రధాని మోదీ మాట్లాడుతూ… కాంగ్రెస్ ఎప్పుడూ దళిత, గిరిజన, ఆదివాసీలకు వ్యతిరేకమని అన్నారు. తాను రిజర్వేషన్లకు వ్యతిరేకమని నెహ్రూ అన్నారని గుర్తు చేశారు. ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు కూడా వ్యతిరేకం అన్నారని… దీనిపై నెహ్రూ ఆనాడు ముఖ్యమంత్రులకు రాసిన లేఖ రికార్డుల్లో ఉందని అన్నారు ప్రదాని మోదీ.
శామ్ పిట్రోడాను ఉద్దేశించి పలు వ్యాఖ్యలు చేశారు ప్రధాని మోదీ. "కాంగ్రెస్ పార్టీ మార్గదర్శకులైన ఒకరు ప్రస్తుతం అమెరికాలో కూర్చున్నారు. అతను ఇటీవలే మాట్లాడుతూ రాజ్యాంగం రూపకల్పన విషయంలో నెహ్రు పాత్రను పెద్దదిగా చూపిస్తూ… అంబేడ్కర్ కృషిని తగ్గించే ప్రయత్నం చేశారని దుయ్యబట్టారు.
వివక్ష లేదు - ప్రధాని మోదీ
ఉత్తరాది, దక్షణాది రాష్ట్రాలకు నిధుల పంపిణీ వివాదంపై స్పందించారు ప్రధాని మోడీ. "కొందరు కావాలనే దేశాన్ని ఇలా విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి రాష్ట్రానికి న్యాయంగా అందాల్సిన నిధులు అందుతున్నాయి. ఏ రాష్ట్రాలపై వివక్ష లేదు.. అన్ని ప్రాంతాలను సమానంగా చూస్తాం. పేదరికంలో ఉన్న రాష్ట్రాలకు కొన్ని ఎక్కువ నిధులు అవసరం.. మా రాష్ట్రం.. మా ట్యాక్స్ అంటున్నారు..ఇదేం వితండవాదం..? నది మా రాష్ట్రంలో ప్రవహిస్తుంది కాబట్టి నీళ్లన్నీ మాకే కావాలంటే ఎలా?.. మా రాష్ట్రంలో బొగ్గు ఉంది.. మేమే వాడుకుంటామంటే కుదురుతుందా? అని మోదీ కామెంట్స్ చేశారు.
కేంద్ర బడ్జెట్ సమావేశాల్లో భాగంగా శుక్రవారం ఖర్గే రాజ్యసభలో మాట్లాడారు. బీజేపీని పరోక్షంగా ప్రస్తావిస్తూ 'అబ్ కీ బార్, 400 పార్' అంటూ వ్యాఖ్యానించారు. ఇది కాస్త ఆసక్తికర పరిణామాంగా మారింది. ఫలితంగా అధికార బీజేపీ ఎంపీలు బల్లాలను బలంగా కొడుతూ స్వాగతించారు. నరేంద్ర మోదీ సైతం చిరునవ్వులు చిందించారు. ఇందుకు సంబధించిన వీడియో 'క్లిప్'ను కూడా బీజేపీ అధికారిక 'ఎక్స్' ఖాతాలో షేర్ చేసింది. ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ కామెంట్స్ నే కోడ్ చేస్తూ ప్రసంగించారు ప్రధాని మోదీ.
సంబంధిత కథనం