INDIA bloc chief: విపక్ష కూటమి ‘ఇండియా’ చీఫ్ గా మల్లిఖార్జున్ ఖర్గే; కన్వీనర్ పదవి వద్దన్న నితీశ్ కుమార్
INDIA bloc chief: లోక్ సభ ఎన్నికలు సమీపిస్తుండడంతో విపక్ష పార్టీల జాతీయ కూటమి ‘ఇండియా’ తన కార్యాచరణను వేగవంతం చేసింది. శనివారం కూటమి నేతలు వర్చువల్ గా సమావేశమయ్యారు.
INDIA bloc chief: ప్రతిపక్ష కూటమి ‘ఇండియా (INDIA bloc)’ అధ్యక్షుడిగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) నియమితులయ్యారు. కూటమి చీఫ్ గా ఎవరిని నియమించాలనే విషయంలో గత కొన్ని వారాలుగా కూటమి నేతల మధ్య తర్జనభర్జనలు కొనసాగాయి. అనంతరం, శనివారం వర్చువల్ గా సమావేశమైన ఇండియా కూటమి నేతలు మల్లిఖార్జున్ ఖర్గేను తమ చైర్ పర్సన్ గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
నితీశ్ వద్దన్నారు..
కాగా, ఇండియా కూటమి (INDIA bloc)లో కీలకమైన మరో పదవి కన్వీనర్. ఈ పదవికి బిహర్ సీఎం, జేడీయూ నేత నితీశ్ కుమార్ (Nitish Kumar) పేరును కూటమి నేతలు ప్రతిపాదించి, ఆమోదం తెలిపారు. కానీ, కన్వీనర్ పదవిని స్వీకరించడానికి నితీశ్ కుమార్ అంగీకరించలేదని సమాచారం. అయితే, కన్వీనర్ పదవికి నితీశ్ కుమార్ ను ఎంపిక చేయడాన్ని టీఎంసీ వ్యతిరేకించిందని, అందువల్లనే ఆయన ఆ పదవిని తిరస్కరించారని తెలుస్తోంది. కాగా, వర్చువల్ గా జరిగిన ఈ భేటీకి సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ హాజరు కాలేదు. వారికి సమావేశంలో తీసుకున్న నిర్ణయాల గురించి తెలియజేస్తామని కూటమి నేతలు తెలిపారు.
సీట్ల పంపకం..
ప్రస్తుతం విపక్ష కూటమి ఇండియా నేతల మధ్య రానున్న లోక్ సభ ఎన్నికలకు సంబంధించి సీట్ల పంపకంపై చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ ఓటమి లక్ష్యంగా దేశ వ్యాప్తంగా ఉన్న 28 పార్టీలు ‘ఇండియా’ పేరుతో ఒక కూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే. శనివారం వర్చువల్ గా జరిగిన ఈ సమావేశం గురించి శుక్రవారం సాయంత్రం పార్టీకి సమాచారం అందిందని, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీకి కొన్ని ముందస్తు అపాయింట్మెంట్లు ఉండడం వల్ల ఆమె హాజరు కాలేదని టీఎంసీ వర్గాలు తెలిపాయి.