Who will succeed PM Modi?: ‘‘ప్రధాని మోదీ తర్వాత బీజేపీని నడిపించేదెవరు?’’: ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు-who will succeed pm modi prashant kishor says bjps biggest risk is ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Who Will Succeed Pm Modi?: ‘‘ప్రధాని మోదీ తర్వాత బీజేపీని నడిపించేదెవరు?’’: ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు

Who will succeed PM Modi?: ‘‘ప్రధాని మోదీ తర్వాత బీజేపీని నడిపించేదెవరు?’’: ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు

Sudarshan Vaddanam HT Telugu
Feb 02, 2024 05:12 PM IST

Prashant Kishor comments on Modi: ప్రముఖ ఎన్నికల వ్యూహ నిపుణుడు ప్రశాంత్ కిశోర్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బీజేపీ భవిష్యత్తు, విపక్ష కూటమి పొరపాట్లు.. తదితర అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ప్రధాని మోదీపై అధికంగా ఆధారపడుతోందని ఆయన వ్యాఖ్యానించారు.

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (Hindustan Times)

ప్రధాని నరేంద్ర మోదీపై అతిగా ఆధారపడటమే భారతీయ జనతా పార్టీకి భవిష్యత్తులో అతిపెద్ద ముప్పుగా మారుతుందని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యానించారు. ఇండియా ఎక్స్ ప్రెస్ నిర్వహించిన 'ఎక్స్ ప్రెస్ అడ్డా' కార్యక్రమంలో పాల్గొన్న ప్రశాంత్ కిశోర్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

ప్రధాని మోదీనే బీజేపీ ఆధారం..

ప్రధాని నరేంద్ర మోదీ ఇమేజ్ పైననే బీజేపీ ఎక్కువగా ఆధారపడుతోందని ప్రశాంత్ కిషోర్ అన్నారు. అది భవిష్యత్తులో బీజేపీకి ముప్పుగా పరిణమిస్తుందని హెచ్చరించారు. ‘‘అయోధ్యలో నిర్మించిన రామమందిరం అంశం అత్యంత ప్రభావశీలమైనదే అయినా.. మోదీ ఇమేజ్ ను మించిన అంశం కాదు’’ అని విశ్లేషించారు. మండల్, రామమందిరం అంశాల కన్నా మోదీ ప్రభావమే రానున్న ఎన్నికలలో ఎక్కువగా ఉంటుందన్నారు. ‘‘అవును, అయోధ్యలో రామ మందిరం పెద్దది, కానీ మీరు ప్రధాని మోదీని సమీకరణం నుండి తొలగిస్తే, అది అంత ప్రభావవంతంగా ఉండదని బిజెపి కూడా అంగీకరిస్తుంది’’ అని ప్రశాంత్ కిషోర్ విశ్లేషించారు.

ప్రధాని మోదీ తరువాత..

ప్రధాని మోదీ తర్వాత, ఆయన వారుసుడిగా ఎవరు వస్తారని అడిగిన ప్రశ్నకు ప్రశాంత్ కిశోర్ సమాధానమిస్తూ.. ‘‘నాకు తెలియదు కానీ, ఆయన కంటే హార్డ్ కోర్ నాయకుడే వస్తాడు. తనతో పోలిస్తే, మోదీనే ఉదారవాది అనేలా ఆయన వ్యవహార శైలి ఉంటుంది’’ అని నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రశాంత్ కిషోర్ ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. భారత్ లో ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. కానీ, కేంద్ర ఎన్నికల సంఘం ఇంకా తేదీలను ప్రకటించలేదు.

కాంగ్రెస్ కు ప్రశాంత్ కిశోర్ సలహాలు

కాంగ్రెస్ పార్టీ పూర్తిగా పునరుత్తేజం చెందాల్సిన అవసరం ఉందని ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యానించారు. ముఖ్యంగా రానున్న లోక్ సభ ఎన్నికల్లో మంచి ఫలితాలను సాధించాలంటే, కాంగ్రెస్ పూర్తిగా తనను తాను మార్చుకోవాల్సి ఉంటుందని సూచించారు. ఇదే విషయాన్ని కాంగ్రెస్ అగ్ర నేతలకు కూడా చెప్పానని వెల్లడించారు. ఈ విషయాన్ని మరింత వివరిస్తూ.. ‘‘ విమర్శనాస్త్రాలను ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటే అవి లక్ష్యం చేరవు. ఇవ్వాళ్ల రాఫెల్, రేపు హిందుత్వ... ఇలా లక్ష్యాలను మార్చడం ఫలితాలను ఇవ్వదు. ఒకే లక్ష్యంపై వారంతా ఒక్కటిగా పని చేయాలి. అదే విషయాన్ని ప్రజల మనసుల్లోకి చేరవేయాలి’’ అని సూచించారు.

‘ఇండియా’పై పెదవి విరుపు

కాంగ్రెస్ నాయకత్వంలో జాతీయ స్థాయిలో ఏర్పడిన విపక్ష కూటమి ‘ఇండియా’ పనితీరుపై ఆయన పెదవి విరిచారు. ఈ కూటమి 2023 లో కాకుండా, ఇంకా చాలా సంవత్సరాల ముందే ఏర్పడి ఉండాల్సిందని వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఆ కూటమిని అంత సీరియస్ గా తీసుకోలేమన్నారు. విపక్ష కూటమిలో చాలా సైద్ధాంతిక వైరుద్ధ్యాలు ఉన్నాయన్నారు. అంతేకాదు, వివిధ ప్రాంతీయ పార్టీలకు వివిధ ప్రాంతీయ లక్ష్యాలున్నందువల్ల.. దేశవ్యాప్తంగా ఉమ్మడి కార్యాచరణను అమలు చేయడం విపక్ష కూటమి తో సాధ్యం కాదన్నారు.

రాహుల్ గాంధీ బెటరే.. కానీ..

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి బీజేపీ సభ్యుల కంటే సోషల్ మీడియాలో ఎక్కువ రీచ్ ఉందని, కానీ ఆయన సరైన విషయాలు చెప్పకపోవడం వల్ల ఆయన ప్రజలకు అంతగా చేరువ కావడం లేదని ప్రశాంత్ కిషోర్ అన్నారు.

Whats_app_banner