TDP BJP Alliance: బీజేపీ పొత్తు టీడీపీకి భారంగా మారుతోందా? ఎటూ తేల్చుకోలేని పరిస్థితుల్లో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు
TDP BJP Alliance: సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీని ఓడించేందుకు ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వకూడదనే నిర్ణయం టీడీపీ భారంగా మారేట్టు ఉంది. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ, జనసేనలతో టీడీపీ సీట్లకు భారీగా గండి పడుతుందని ప్రచారం జరుగుతోంది.
TDP BJP Alliance: ఏపీలో వైసీపీని ఓడించేందుదుకు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీలనివ్వకూడదనే నిర్ణయం టీడీపీకి భారంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. పార్టీల బలాబలాలతో సంబంధం లేకుండా గణనీయమైన స్థాయిలో సీట్ల కోసం బీజేపీ పట్టుబడుతుండటం టీడీపీకి మింగుడు పడటం లేదని చెబుతున్నారు.
అమిత్‌షాతో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చర్చలు జరిపి నాలుగు రోజులైనా ఎన్నికల పొత్తులపై ఎలాంటి ప్రకటన వెలువడలేదు. మరోవైపు చంద్రబాబుతో సంప్రదింపుల కోసం పవన్ కళ్యాణ్ కూడా విజయవాడ చేరుకున్నారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటన ముగిసిన వెంటనే పవన్ కళ్యాణ ఢిల్లీ వెళతారని ప్రచారం జరిగింది.
పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లకుండా విజయవాడ వచ్చారు. అటు చంద్రబాబు కూడా నాలుగు రోజులుగా విజయవాడ తిరిగి రాలేదు. దీంతో పార్టీ వర్గాల్లో కూడా ఏమి జరుగుతుందో తెలియక గందర గోళానికి గురవుతున్నారు.
వచ్చే ఎన్నికల్లో ఎన్నికల పొత్తుపై స్పష్టమైన ప్రకటన బీజేపీ, టీడీపీలు ఇంత వరకు చేయలేదు. బీజేపీతో జనసేనకు పొత్తు ఉన్నా టీడీపీతో ఆ పార్టీ జట్టు కట్టింది. సీట్ల సర్దుబాటుపై కూడా ప్రాథమిక అవగాహన కుదిరింది. మరోవైపు బీజేపీని కూడా తమతో కలుపుకుపోవాలని పవన్ కళ్యాణ్ బలంగా కోరుకుంటున్నారు. వైసీపీని ఓడించడానికి బీజేపీ ఓటు బ్యాంకు కూడా పనికొస్తుందని పవన్ భావిస్తున్నారు.
చంద్రబాబు కూడా బీజేపీకి దగ్గరయ్యేందుకు గత కొన్నేళ్లుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయితే బీజేపీ మాత్రం ఎటూ తేల్చడం లేదు. ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీ చేయడానికి పలు షరతులు విధిస్తున్నట్టు పొలిటికల్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
2014లో బీజేపీ-జనసేన-టీడీపీ కూటమి విజయం సాధించింది. అప్పట్లో జనసేన అభ్యర్థులు పోటీ చేయలేదు. బీజేపీ అభ్యర్థులు కొన్ని చోట్ల మాత్రమే విజయం సాధించారు. టీడీపీ విజయం సాధించడానికి తాము ఉపయోగపడినా తమకు టీడీపీ ఓటు బదిలీ కాలేదని బీజేపీ అనుమానిస్తోంది. గతంలో పలు సందర్భాల్లో బీజేపీ దోషిని చేసేలా చంద్రబాబు వ్యవహరించడంతో ఇప్పుడు పూర్తి స్థాయిలో పైచేయి కోసం ఆ పార్టీ ప్రయత్నిస్తోంది.
ఏపీలో టీడీపీతో కలిసి పోటీ చేయాలంటే తాము కోరుకున్న సీట్లను ఇవ్వాలని ప్రతిపాదిస్తున్నట్లు చెబుతున్నారు. నాలుగు సీట్లలో టీడీపీ పోటీ చేస్తే కనీసం తమకు రెండైనా ఇవ్వాలని ప్రతిపాదన తెచ్చినట్టు చెబుతున్నారు. దీని ప్రకారం బీజేపీకి కనీసం యాభై సీట్లైన కేటాయించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. జనసేనకు అందులో సగమైన ఇవ్వాల్సి ఉంటుంది. ఏపీలో ఉన్న 175 సీట్లలో యాభై సీట్లు బీజేపీకి, 25సీట్లు జనసేనకు ఇవ్వాల్సి వస్తే తాము నష్టపోతామనే భావన టీడీపీలో ఉంది.
మరోవైపు బీజేపీని వీడి ఎన్నికల్లో పోటీ చేస్తే ఇబ్బందులు తప్పవనే భావన కూడా టీడీపీ నేతల్లో ఉంది. ప్రస్తుతం ఏపీలో బీజేపీకి నమ్మకమైన రాజకీయ భాగస్వామిగా వైసీపీ ఉంది. రెండు పార్టీల మధ్య పొత్తు లేకపోయినా పూర్తి అవగాహన మాత్రం ఉంది. బీజేపీని నమ్మించాలంటే ఆ పార్టీ పెట్టే షరతుల్ని అంగీకరించాల్సి ఉంటుందని బీజేపీ నేతలు చెబుతున్నారు.
ఖచ్చితంగా గెలుపు అవకాశాలు ఉన్న స్థానాలను మాత్రమే బీజేపీ- జనసేనలకు కేటాయించాలని టీడీపీ భావిస్తోంది. ఈ మేరకు రెండు పార్టీలను ఒప్పించే ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు ఢిల్లీ వెళ్లాల్సిన పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబుతో భేటీ తర్వాత ఢిల్లీ వెళతారని చెబుతున్నారు.