Congress: “పుల్వామా దాడి ఎలా జరిగింది? దేశభక్తి అంటే మోదీకి తెలుసా?”: కాంగ్రెస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు
Sukhjinder Singh Randhawa Comments: ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ నాయకుడు సుఖ్‍జిందర్ సింగ్ రంఢావా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశభక్తి అంటే మోదీ అర్థం తెలియదంటూ మాట్లాడారు.
Sukhjinder Singh Randhawa Comments: కాంగ్రెస్ నేత, ఆ పార్టీ రాజస్థాన్ ఇన్‍చార్జ్ సుఖ్‍జిందర్ సింగ్ రంఢావా (Sukhjinder Singh Randhawa) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi)పై తీవ్ర ఆరోపణలు చేశారు. 2019లో భారత జవాన్‍లపై పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిపై అనుమానాలు వ్యక్తం చేశారు. మోదీని ఫినిష్ చేసేందుకు ఆలోచించండంటూ మాట్లాడారు. ఆయన వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రధాని మోదీని కించపరిస్తారా అంటూ మంఢావాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాలివే..
మోదీని ఫినిష్ చేస్తేనే: సుఖ్‍జిందర్
Sukhjinder Singh Randhawa: అదానీ గ్రూప్‍పై హిండెన్‍బర్గ్ వెల్లడించిన రిపోర్టుపై కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తూ జైపూర్‌లో కాంగ్రెస్ పార్టీ సోమవారం ధర్నా నిర్వహించింది. ఆ కార్యక్రమంలో సుఖ్‍జిందర్ మాట్లాడారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. “నేను నాయకులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మనలో మనం గొడవ పడడం ముగిద్దాం. మోదీ ముగింపు గురించి ఆలోచిద్దాం. మనం మోదీని ఫినిష్ చేస్తేనే.. హిందుస్థాన్ మనుగడ ఉంటుంది. ఒకవేళ ఉంటే.. హిందుస్థాన్ ఫినిష్ అవుతుంది” అని సుఖ్‍జిందర్ సింగ్ రంఢావా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
పుల్వామా ఎలా జరిగింది?: సుఖ్‍జిందర్
పుల్వామా ఉగ్రదాడిపై అనుమానాలు వ్యక్తం చేశారు సుఖ్‍జిందర్ సింగ్. “పుల్వామా ఎలా జరిగింది? విచారణ జరిపించండి. ఎన్నికల కోసం ఆయన ఇది చేశారా?” అని రంఢావా అన్నారు. “మా కంటే ఎక్కువ దేశభక్తులు లేరని వాళ్లు (బీజేపీ) చెబుతారు, దేశభక్తి అంటే మోదీకి అర్థం కూడా తెలియదు. భారత దేశ స్వాతంత్య్రం కోసం ఏ బీజేపీ నాయకుడు పోరాడారు?” అని సుఖ్‍జిందర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 2019 ఫిబ్రవరిలో పుల్వామాలో భారత జవాన్లపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ ఘటనలో 40 మంది సైనికులు అమరులయ్యారు.
అమరులను అవమానిస్తారా?
పుల్వామా దాడి, ప్రధాని మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సుఖ్‍జిందర్ సింగ్‍పై బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమర జవాన్లను, ప్రధానమంత్రి స్థానాన్ని రంఢావా అవమానించారని విమర్శించారు. దేశ ప్రతిష్టను భంగం కలిగేలా మాట్లాడుతున్నారని అన్నారు. ఇక సుఖ్‍జిందర్ క్షమాపణ చెప్పాలని మరికొందరు బీజేపీ నేతలు డిమాండ్ చేశారు.