Rahul Gandhi disqualification : రాహుల్​ గాంధీపై అనర్హత వేటు- ఎన్నికలకూ దూరమే!-rahul gandhi s disqualification effective from date of his conviction march 23 lok sabha secretariat ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Rahul Gandhi's Disqualification Effective From Date Of His Conviction March 23: Lok Sabha Secretariat.

Rahul Gandhi disqualification : రాహుల్​ గాంధీపై అనర్హత వేటు- ఎన్నికలకూ దూరమే!

Sharath Chitturi HT Telugu
Mar 24, 2023 02:53 PM IST

Rahul Gandhi disqualified : కాంగ్రెస్​ సీనియర్​ నేత రాహుల్​ గాంధీపై పార్లమెంట్​లో అనర్హత వేటు పడింది. ఆయన తన వయనాడ్​ సీటును కోల్పోయారు.

రాహుల్​ గాంధీ
రాహుల్​ గాంధీ (PTI)

Rahul Gandhi disqualified : అనుకున్నదే జరిగింది! పరువు నష్టం కేసులో రెండేళ్ల జైలు శిక్షకు గురైన కాంగ్రెస్​ సీనియర్​ నేత రాహుల్​ గాంధీపై లోక్​సభలో అనర్హత వేటు పడింది. ఫలితంగా.. రాహుల్​ గాంధీ తన వయనాడ్​ సీటును కోల్పోయారు. లోక్​సభ సెక్రటేరియట్​.. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. తాజా పరిణామాలతో కాంగ్రెస్​కు అతిపెద్ద షాక్​ తగిలినట్టు అయ్యింది.

ట్రెండింగ్ వార్తలు

"వయనాడ్​ నుంచి ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్న శ్రీ రాహుల్​ గాంధీపై అనర్హత వేటు వేస్తున్నాము. పరువు నష్టం కేసులో ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష పడటమే ఇందుకు కారణం. ఆయన దోషిగా తేలిన రోజు.. అంటే 2023 మార్చ్​ 23 నుంచి రాహుల్​ గాంధీపై అనర్హత వేటు అమల్లోకి వస్తుంది. 1951 రిప్రజెంటేషన్​ ఆఫ్​ పీపుల్​ యాక్ట్​ ఆర్టికల్​ 102 (1)(ఈ) ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నాము," అని లోక్​సభ సెక్రటేరియట్​ ప్రకటనలో పేర్కొంది.

ఈ విధంగా అనర్హత వేటుకు గురయ్యే వారు.. మరో 8ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయలేరని చట్టాలు చెబుతున్నాయి.

ఇదీ కేసు..

Rahul Gandhi latest news : 2019 లోక్​సభ ఎన్నికలకు ముందు కర్ణాటకలో పర్యటించారు రాహుల్​ గాంధీ. కోలర్​లో నిర్వహించిన ఓ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో బీజేపీపై, మోదీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. "దొంగలందరికి.. మోదీ అనే ఇంటి పేరే ఎందుకు ఉంటోంది?" అని అన్నారు. దేశం నుంచి పారిపోయిన నీరవ్​ మోదీ, లలిత్​ మోదీలతో పాటు ప్రధాని నరేంద్ర మోదీకి కూడా ఈ ఇంటి పేరు ఉండటంతో.. రాహుల్​ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది. ఈ క్రమంలో.. 2019లో గుజరాత్​లోని సూరత్​ జిల్లా కోర్టులో రాహుల్​ గాంధీకి వ్యతిరేకంగా పిటిషన్​ దాఖలైంది.

ఈ వ్యవహారంపై విచారణ పూర్తి చేసిన అనంతరం గురువారం కీలక తీర్పును వెలువరించింది సూరత్​లోని జిల్లా కోర్టు. రాహుల్​ గాంధీని దోషిగా తేలుస్తూ.. రెండేళ్ల జైలు శిక్షను విధించింది. 30 రోజుల బెయిల్​తో పాటు తీర్పును సవాలు చేసేందుకు అవకాశాన్ని ఇచ్చింది.

నెక్స్ట్​ ఏంటి..?

Rahul Gandhi defamation case : రాహుల్​ గాంధీకి శిక్షపడటం, అనర్హత వేటుకు గురవడం వంటి అంశాలపై కాంగ్రెస్​ పార్టీ ఇప్పటికే తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేసింది. కాగా.. రాహుల్​ గాంధీపై వచ్చిన తీర్పును ఎగువ కోర్టులో కాంగ్రెస్​ సవాలు చేసే అవకాశం ఉంది. అక్కడ కూడా సానుకూలంగా తీర్పు రాకపోతే.. సుప్రీంకోర్టుకైనా వెళ్లేందుకు సన్నద్ధమవుతున్నట్టు సమాచారం.

సూరత్​ కోర్టు ఇచ్చిన తీర్పుపై ఎగువ కోర్టులో స్టే పడినా లేదా పూర్తిగా కొట్టివేసినా.. రాహుల్​ గాంధీ జైలుకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఆయనపై వేసిన అనర్హత వేటును కూడా ఉపసంహరించుకోవాల్సి ఉంటుంది.

IPL_Entry_Point

సంబంధిత కథనం