New congress president Kharge: కాంగ్రెస్ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే
New congress president Kharge: అఖిల భారత కాంగ్రెస్ కమిటీ నూతన అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే విజయం సాధించారు.
ఏఐసీసీ నూతన అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే ఎన్నికయ్యారు. ఇంకా అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ మల్లికార్జున ఖర్గేకు 7 వేల ఓట్లు రాగా, ఆయనతో తలపడిన శశిథరూర్ 1000 పైచిలుకు ఓట్లు మాత్రమే సాధిచారు.
‘ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌కు అధ్యక్ష బాధ్యతలు స్వీకరించడం గొప్ప గౌరవం, అతి పెద్ద బాధ్యత. మల్లికార్జున ఖర్గే ఈ కార్యం నెరవేర్చడంలో విజయం సాధించాలని కోరుకుంటున్నా. ఈ ఎన్నికలో వెయ్యి మందికి పైగా ప్రతినిధుల మద్దతు నాకు లభించడం నాకు గర్వంగా ఉంది..’ అని శశిథరూర్ ట్వీట్ చేశారు.
కాంగ్రెస్ అధ్యక్ష పదవికి జరిగిన పోటీలో సోనియా గాంధీ కుటుంబ సభ్యులు ఎవరూ పోటీ పడలేదు. 24 ఏళ్ల తరువాత గాంధీ కుటుంబేతర నేత కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉండబోతున్నారు.
గాంధీ కుటుంబానికి ఖర్గే సన్నిహితుడున్న పేరున్నందున పలు రాష్ట్రాల ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నేతలు బహిరంగంగా ఖర్గేకు మద్దతు పలికారు.
కర్ణాటకకు చెందిన మల్లికార్జున ఖర్గే పలుమార్లు కేంద్ర మంత్రివర్గంలో పనిచేశారు. అలాగే గతంలో లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేతగా కూడా పనిచేశారు.
పార్టీలో కాంగ్రెస్ అధ్యక్షుడిదే సర్వోన్నత అధికారమని, పార్టీలో తన పాత్రను కొత్త చీఫ్ నిర్ణయిస్తారని రాహుల్ గాంధీ బుధవారం అన్నారు. ‘కాంగ్రెస్ అధ్యక్షుడిదే పార్టీలో అత్యున్నత అధికారం. ప్రతి సభ్యుడు అధ్యక్షుడికి నివేదిస్తారు... పార్టీలో నా పాత్రను ఆయనే నిర్ణయిస్తారు. దయచేసి ఖర్గే జీ, సోనియా గాంధీని అడగండి’ అని ఆంధ్ర ప్రదేశ్‌లో విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల గురించి అడిగినప్పుడు గాంధీ బదులిచ్చారు.
‘కాంగ్రెస్‌లో ఎన్నికల గురించి అందరూ ప్రశ్నలు అడుగుతారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి బహిరంగంగా, పారదర్శకంగా ఎన్నికలు జరిపినందుకు పార్టీ సభ్యుడిగా గర్విస్తున్నాను. బీజేపీ, ఇతర పార్టీలలో ఎన్నికలపై ఎవరూ ఎందుకు ఆసక్తి చూపడం లేదు?’ అని తన భారత్ జోడో యాత్రలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన అన్నారు.