National Herald case: 5వ రోజు ఈడీ ముందుకు రాహుల్ గాంధీ.. ఇంకెనాళ్లు ఇలా?
National Herald case: రాహుల్ గాంధీ.. మంగళవారం ఈడీ విచారణకు హాజరయ్యారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఆయన విచారణకు వెళ్లడం ఇది 5వ సారి.
National Herald case: నేషనల్ హెరాల్డ్ కేసులో భాగంగా మంగళవారం 5వసారి ఈడీ ముందు హాజరయ్యారు కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ. కాంగ్రెస్ నేతను ఇప్పటికే 40 గంటల పాటు విచారించిన ఈడీ.. నేడు మరికొన్ని కీలక విషయాలపై ప్రశ్నించనున్నట్టు తెలుస్తోంది.
కాంగ్రెస్ నేత, సోదరి ప్రియాంక గాంధీతో మంగళవారం ఉదయం 11:15కు ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి వెళ్లారు రాహుల్.
ఇల్లు.. ఈడీ కార్యాలయం..
గతం కొన్ని రోజులుగా.. ఇల్లు, ఈడీ కార్యాలయానికే పరిమితమయ్యారు రాహుల్! ఈ నెల 13న తొలిసారి ఈడీ ఎదుట హాజరయ్యారు. 14, 15వ తేదీల్లోనూ ఆయనపై ఈడీ ప్రశ్నల వర్షం కురిపించింది. కాగా.. 16వ రోజు గ్యాప్ ఇచ్చి.. మళ్లీ 17వ తేదీన విచారణ చేపట్టింది. 18వ తేదీన కూడా రాహుల్ గాంధీ ఈడీ ముందు హాజరవ్వాల్సి ఉంది. కానీ తన తల్లి, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆసుపత్రిలో ఉన్నందున విచారణను వాయిదా వేయాలని ఆయన కోరారు. ఆయన అభ్యర్థనను అంగీకరించిన ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్.. విచారణను 20వ తేదీకి వాయిదా వేసింది. సోమవారం ఈడీ ముందుకు వెళ్లారు. మంగళవారానికి ముందు.. రాహుల్ గాంధీని ఈడీ ఇప్పటికే 40కిపైగా గంటలు విచారించింది.
సోనియా కూడా..
నేషనల్ హెరాల్డ్ కేసులో భాగంగా సోనియా గాంధీని కూడా విచారించనుంది ఈడీ. వాస్తవానికి ఈ నెల 8నే ఈడీ ఎదుట ఆమె హాజరుకావాల్సి ఉంది. అనారోగ్యం కారణాలతో అది కుదరలేదు. కాగా.. ఈ నెల 23న విచారణకు రావాలని సోనియాకు ఈడీ స్పష్టం చేసింది.
ఇదీ అసలు కథ..
Rahul Gandhi ED case : బ్రిటీష్ రాజ్యంపై యుద్ధం కోసం 1938లో స్థాపించిన వార్తాపత్రికే ఈ నేషనల్ హెరాల్డ్. నాటి కాంగ్రెస్ అధ్యక్షుడు జవహర్లాల్ నెహ్రూ.. ఈ పత్రికను ప్రారంభించారు. ఏజేఎల్(అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్).. నేషనల్ హెరాల్డ్ పత్రికలను ప్రచురించేది.
ఈ నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికలో 5వేల మంది స్వాతంత్ర్య సమరయోధులు షేరుహోల్డర్లుగా ఉండేవారు.
స్వాతంత్ర్యం తర్వాత.. ఈ నేషనల్ హెరాల్డ్‌ను కాంగ్రెస్ అన్ని విధాలుగా ఉపయోగించుకునేది. అనంతరం.. ఉర్దూ(కౌమి అవాజ్), హిందీ(నవ్‌జీవన్)లోనూ నేషనల్ హెరాల్డ్ ఎదిగింది.
దేశానికి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం.. నేషనల్ హెరాల్డ్ ఛైర్మన్ పదవి నుంచి నెహ్రూ తప్పుకున్నారు.
క్రమంగా.. దేశంలో నేషనల్ హెరాల్డ్ ఉనికి కోల్పోతూ వచ్చింది. చివరికి 2008లో.. ఈ వార్తాపత్రిక మూతపడింది. అప్పటికే ఆ సంస్థకు రూ. 90.25కోట్ల అప్పులు ఉన్నాయి. అయితే.. అప్పులను తొలగించేందుకు.. కాంగ్రెస్ పార్టీ.. నేషనల్ హెరాల్డ్‌కు రూ. 90.25కోట్లు ఇచ్చింది. అది కూడా రుణ రహిత అప్పులు ఇచ్చింది.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం