Sri rama navami 2024: శ్రీరామనవమి రోజు ఈ పనులు చేశారంటే.. కష్టాలన్నీ తొలగి మీ జీవితమే మారిపోతుంది
Sri rama navami 2024: శ్రీరామనవమి రోజు కొన్ని పరిహారాలు పాటించడం వల్ల జీవితంలోని కష్టాలన్నీ తొలగిపోతాయి. సీతారాముల ఆశీర్వాద బలంతో వైవాహిక జీవితం ఆనందంగా గడుపుతారు.
Sri rama navami 2024: ఎన్నో సద్గుణాలు కలిగిన శ్రీరాముడి జీవితం అందరికీ ఆదర్శప్రాయం. ఏకపత్నివ్రతుడిగా సాగించిన ఆయన జీవితం ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. ఏటా చైత్ర శుక్ల నవమి రోజు శ్రీరామనవమి జరుపుకుంటారు. ఈ ఏడాది ఏప్రిల్ 17వ తేదీ శ్రీరామనవమి జరుపుకుంటున్నారు. ఆ రోజు కొన్ని పనులు చేయడం వల్ల జీవితంలోనే కష్టాలన్నీ తొలగిపోతాయి. సుఖసంతోషాలతో సంతోషంగా జీవిస్తారు.
నిత్యం మీ ఇంట్లో ఆర్థిక కష్టాలు, రోగాలతో ఇబ్బందులు పడుతున్నారా? ఇంట్లో గొడవలతో ప్రశాంతత కరువైందా? అయితే మీ సమస్యలన్నీ తొలగిపోయి ఇంట్లో ప్రశాంతకరమైన వాతావరణం నెలకొనాలంటే ఈ పరిహారాలను పాటించాలి. శ్రీరామనవమి రోజు నివారణలు పాటించడం వల్ల మీకు కష్టాల జీవితం నుంచి విముక్తి కలుగుతుంది. సుఖసంతోషాలతో జీవించగలుగుతారు.
ఆర్థిక లాభాల కోసం
శ్రీరామనవమి రోజు ఎరుపు రంగు దుస్తులు ధరించాలి. అలాగే ఒక ఎరటి వస్త్రం తీసుకొని అందులో 11 గోమతి చక్రాలు, 11 కరివేపాకులు, 11 లవంగాలు, చక్కెరతో చేసిన 11బతషాలు ఉంచి లక్ష్మీదేవికి, శ్రీరాముడికి సమర్పించాలి. ఇలా చేయడం వల్ల మీ ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. అలాగే ఒక గిన్నెలో నీళ్లు తీసుకుని 108 సార్లు శ్రీరామరక్ష మంత్రాన్ని జపించే ఆ నీటిని ఇల్లు మొత్తం చల్లుకోవాలి. ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి సానుకూల శక్తి ప్రసరిస్తుంది. ఆర్థిక సమస్యలు రావడానికి నెగిటివ్ ఎనర్జీ ఉండటం కూడా ఒక కారణం కావచ్చు.
రోగాల నుంచి బయటపడేందుకు
ఆంజనేయుడి అనుగ్రహం ఉంటే ఎటువంటి వ్యాధులు, భయాలైన తొలగిపోతాయి. శ్రీరామనవమి రోజు సాయంత్రం ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించుకోవాలి. అలాగే హనుమాన్ చాలీసా పఠించాలి. శ్రీరామ నామాన్ని జపించడం వల్ల హనుమంతుడి ఆశీస్సులు మీకు లభిస్తాయి. వ్యాధుల నుంచి బయటపడతారు.
సంతోషం కోసం
నవమి రోజున రామాలయంలో నెయ్యి లేదా నూనె దీపం వెలిగించాలి. అలాగే జైశ్రీరామ్ అనే పదాన్ని 108 సార్లు జపించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. మనసు సంతోషంతో నిండిపోతుంది.
సంతానం కోసం
ఒక ఎర్రటి వస్త్రం తీసుకొని అందులో కొబ్బరికాయ చుట్టి సీతాదేవికి సమర్పించాలి. జైశ్రీరామ్ అనే మంత్రాన్ని 108 సార్లు జపించి సీతమ్మ తల్లికి పూజలు చేయాలి. ఇలా చేయడం వల్ల సంతాన ప్రాప్తి లభిస్తుంది.
వైవాహిక సమస్యలు
వైవాహిక జీవితం నిత్యం గొడవలు, అలకలతో సాగుతుందా? అయితే శ్రీరామనవమి రోజు భార్యాభర్తలు ఇద్దరూ కలిసి సీతారాములకు పసుపు, కుంకుమ, గంధాన్ని సమర్పించాలి. ఓం జై సీతారాం అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఇలా చేయడం వల్ల వివాహ బంధంలోని సమస్యలు తొలగిపోతాయి. భార్యాభర్తల మధ్య ప్రేమ చిగురుస్తుంది.
శ్రీరామనవమి నాడు చేయాల్సిన పనులు
శ్రీరామనవమి రోజు రాముల వారి చిత్రపటాన్ని గంధంతో అలంకరించాలి. బెల్లం, పానకాన్ని నైవేద్యంగా సమర్పించి పూజలు చేయాలి. రాములవారికి ఇష్టమైన తులసీదళం, సీతమ్మకి ఇష్టమైన మారేడు దళాలతో పూజ చేయాలి. అలాగే హనుమంతుడికి ఇష్టమైన తమలపాకులు మీద జైశ్రీరామ్ అనే రాసి పూజ చేయాలి. లేదంటే తమలపాకుల దండ హనుమంతుడికి సమర్పించడం వల్ల మీ కోరికలన్నీ నెరవేరుతాయి. శ్రీరామనవమి రోజు రామాయణాన్ని చదవడం లేదా వినడం వల్ల మంచి జరుగుతుంది.