French Open 2024 Swiatek: ‘స్వియాటెక్’ హ్యాట్రిక్: మళ్లీ ఫ్రెంచ్ ఛాంపియన్‍గా పోలాండ్ స్టార్.. ప్రైజ్‍మనీ ఎన్ని కోట్లంటే!
French Open 2024 Iga Swiatek: ఫ్రెంచ్ ఓపెన్‍లో ఇగా స్వియాటెక్ మరోసారి ఛాంపియన్‍గా నిలిచారు. వరుసగా మూడోసారి టైటిల్ కైవసం చేసుకున్నారు. మట్టికోర్టులో నాలుగో ట్రోఫీ పట్టారు.
French Open 2024 Iga Swiatek: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‍స్లామ్ టెన్నిస్ టోర్నీలో పోలాండ్ స్టార్ ప్లేయర్ ఇగా స్వియాటెక్ మరోసారి అదరగొట్టారు. వరుసగా మూడోసారి.. మొత్తంగా నాలుగోసారి ఫ్రెంచ్ మహిళల సింగిల్స్ చాంపియన్‍గా టైటిల్ కైవసం చేసుకున్నారు. మట్టికోర్టులో తిరుగులేని ఆటతో సత్తాచాటారు ఈ 23 ఏళ్ల టెన్నిస్ సంచలనం. పారిస్ వేదికగా నేడు (జూన్ 8) జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్ వన్ ర్యాంకర్ ఇగా స్వియాటెక్ 6-2, 6-1 తేడాతో 12వ సీడ్ జాస్మీన్ పొవలినిపై అలవోకగా విజయం సాధించారు. వరుస సెట్లలో ప్రత్యర్థిపై గెలిచి స్వియాటెక్ సత్తాచాటారు.
గంటా 8 నిమిషాల్లోనే..
ఈ ఫైనల్‍లో ఇగా స్వియాటెక్ ఒక గంటా 8 నిమిషాల్లోనే ఇటలీ ప్లేయర్ జాస్మీన్ పొవలిన్‍పై గెలిచారు. ఏ దశలోనూ ఇగా వెనకడుగు వేయలేదు. ఐదుసార్లు ప్రత్యర్థి సర్వీస్‍ను బ్రేక్ చేసి పూర్తి ఆధిపత్యం చూపారు స్వియాటెక్. తన మార్క్ దూకుడైన ఆటతో అదరగొట్టారు.
ఫస్ట్ సెట్‍లో ఓ దశలో 2-2తో ఉన్నా.. ఆ తర్వాత స్వియాటెక్ విజృంభించారు. జాస్మీన్‍కు ఏ మాత్రం అవకాశం ఇవ్వలేదు. వరుసగా నాలుగు గేమ్‍లు గెలిచి 6-2తో సెట్ సొంతం చేసేసుకున్నారు. ఇక రెండో సెట్‍లో మరింత దూకుడు చూపారు స్వియాటెక్. బలమైన షాట్లతో రెచ్చిపోయారు. జాస్మీన్ ఏ మాత్రం పోటీని ఇవ్వలేకపోయారు. దీంతో ఓ దశలో 5-0తో దూసుకెళ్లారు స్వియాటెక్. ఆ తర్వాత ఓ గేమ్ దక్కించుకున్నారు జాస్మీన్. వెంటనే తదుపరి గేమ్ గెలిచి 6-1తో సెట్ కైవసం చేసుకొని ఫైనల్ గెలిచేశారు స్వియాటెక్. ఛాంపియన్‍గా నిలువగానే మట్టికోర్టుపై మోకాళ్లపై కూర్చొని సంబరం చేసుకున్నారు.
నాలుగోసారి ఫ్రెంచ్ టైటిల్
ఇగా స్వియాటెక్ 2020లోనే తన తొలి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ కైవసం చేసుకున్నారు. 19 ఏళ్ల వయసులోనే గ్రాండ్‍స్లామ్ టైటిల్ పట్టారు. ఆ తర్వాత 2022, 2023లోనూ ఫ్రెంచ్ పోరులో చాంపియన్‍గా నిలిచారు. ఇప్పుడు 2024లోనూ దుమ్మురేపి.. వరుసగా హ్యాట్రిక్ కొట్టేశారు. 2022లో యూఎస్ ఓపెన్ గ్రాండ్‍స్లామ్ టైటిల్ కూడా గెలిచారు స్వియాటెక్. మొత్తంగా ఇప్పటి వరకు ఐదు గ్రాండ్‍స్లామ్ టైటిల్స్ కైవసం చేసుకున్నారు. ప్రస్తుతం మహిళల సింగిల్స్ విభాగంలో ప్రపంచ నంబర్ వన్‍గా ఉన్నారు. ఈ ఏడాది తాను ఆడిన 49 మ్యాచ్‍ల్లో ఏకంగా 45 గెలిచారు ఇగా స్వియాటెక్.
ప్రైజ్‍మనీ ఇదే
ఫ్రెంచ్ ఓపెన్ 2024 టైటిల్ గెలిచిన ఇగా స్వియాటెక్‍కు 24,00,000 యూరోల (సుమారు రూ.21కోట్లు) ప్రైజ్‍మనీ దక్కింది. 12,00,000 యూరోలు (రూ.10.8 కోట్లు) లభించాయి.
పురుషుల సింగిల్స్ ఫైనల్
ఫ్రెంచ్ ఓపెన్ 2024 పురుషుల సింగిల్స్ ఫైనల్ రేపు (జూన్ 9) జరగనుంది. జర్మనీ ప్లేయర్ అలెగ్జాండర్ జ్వెరెవ్, స్పెయిన్ ప్లేయర్ మూడో సీడ్ కార్లోస్ అల్కరాజ్ మధ్య ఈ ఫైనల్ ఫైట్ జరగనుంది.
గాయంతోనే ఈ ఏడాది టోర్నీకి బరిలోకి దిగిన 14సార్లు ఫ్రెంచ్ చాంపియన్, మట్టికోర్టు రారాజు రఫేల్ నాదల్ తొలి రౌండ్‍లోనే ఔటయ్యాడు. సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ కూడా టోర్నీ మధ్యలోనే తప్పుకున్నాడు.